*శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 10*

P Madhav Kumar

 


*మహిషాసుర వధ - 2*


అంతట సింహం వేగంగా ఆకాశానికి ఎగిరి క్రిందికి దూకి తన ముందరి కాలి దెబ్బతో ఆ చామరుని శిరస్సును ఖండించి వేసింది.


ఆ యుద్ధంలో ఉదగ్రుణ్ణి శిలలతో, వృక్షాదులతో; కారాళుణ్ణి తన దంతాలతో, పిడికిటి పోటులతో చెంపదెబ్బలతో చంపివేసింది.


దేవి క్రోధం పొంది ఉద్ధతుణ్ణి గదతో కొట్టి చూర్ణం చేసింది. బాష్కలుణ్ణి గుదియతోనూ; తామ్రుణ్ణి, అంధకుణ్ణి బాణాలతోనూ కూల్చింది.


త్రినేత్రయైన పరమేశ్వరి ఉగ్రాస్య, ఉగ్రవీర్య, మహాహనులను కూడా తన త్రిశూలంతో చంపివేసింది.


ఆమె తన ఖడ్గంతో బిడాలుని శిరస్సును శరీరం నుండి ఖండించింది. దుర్ధర దుర్ముఖులు అనే ఇరువురినీ తన బాణాలతో యముని ఆలయానికి పంపించింది. 


తన సైన్యం ఇలా నాశనం అవుతుండగా మహిషాసురుడు తన మహిషరూపంతో దేవీ సైన్యాలను భీతిల్లజేసాడు.


కొందరిని తన మోరతో కొట్టి, మరికొందరిని గిట్టలతో చిమ్మి, ఇంకొందరిని తోకతో బాది, కొమ్ములతో పొడిచి


ఇతరులను తన వేగంతో, కొందరిని తన అంకెలతో, మరికొందరిని తన చక్రగమనం (చుట్టి పరుగెట్టడం) తో, ఇంకొందరిని తన ఊర్పుగాలితో నేల కూల్చాడు.


మహాదేవి యొక్క సైన్యగణాలను ఇలా కూల్చి ఆ రక్కసుడు ఆమె సింహాన్ని చంపడానికి ఉరికాడు. అందువల్ల అంబికకు కోపం వచ్చింది.


మహావీర్యవంతుడైన మహిషాసురుడు కోపంతో భూతాలను తన గిట్టలతో రాచి ధూళిచేసాడు, ఉన్నత పర్వతాలను తన కొమ్ములతో ఎగురగొట్టాడు, భయంకరంగా అంకెలువేసాడు.


అతని భ్రమణ వేగం చేత ధూళియై భూమి అరిగిపోయింది; తోకదెబ్బలకు సముద్రం అంతటా పొంగి పొరలింది.


కొమ్ముల ఊపుచేత మేఘాలు తునాతునక లైపోయాయి. ఊరుపుగాలి తాకిడికి వందల పర్వతాలు ఆకాసం నుండి క్రిందపడ్డాయి.


ఆ మహాసురుడు కోపావిష్టుడై తనను ఎదుర్కోవడానికి రావడం చూసి అతనిని వధించడానికి చండిక తన కోపాన్ని ప్రదర్శించింది.


ఆమె తన పాశాన్ని అతనిపై ప్రయోగించి ఆ మహాసురుణ్ణి బంధించింది. మహాయుద్ధంలో ఇలా బంధింపబడి అతడు తన మహిషరూపాన్ని విడిచిపెట్టాడు.


 *సశేషం.........*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat