ఋషిపలికెను :
అంతట తన సైన్యం నాశనమవడం చూసి సేనాని అయిన చిక్షురమహాసురుడు అంబికతో యుద్ధం చేయడానికై కోపంతో వచ్చాడు.
మేరుపర్వతశిఖరంపై మేఘం ఎలా వర్షం కురిపిస్తుందో అలా యుద్ధంలో అసురుడు ఆ దేవిపై బాణవర్షం కురిపించాడు.
అంతట దేవి అవలీలగా ఆ బాణసమూహాన్ని ఛేదించివేసి, తన బాణాలతో అతడి గుజ్జలను, గుజ్జాలను తోలేవాణ్ణి చంపింది.
వెంటనే ఆమె అతని ధనుస్సును, మిక్కిలి ఎత్తైన ధ్వజాన్ని ఛేదించి, విరిగిపోయిన ధనుస్సు గల అతని శరీరాన్ని బాణపు పోటులచేత గ్రుచ్చివేసింది.
విల్లు త్రుంపబడి, రథం లేక, గుజ్రాలూ సారథి చంపబడగా ఆ అసురుడు ఖడ్గాన్ని, డాలును ధరించి ఆ దేవిపైకి ఉరికెను.
అతివేగంగా అతడు మిక్కిలి పదను గల తన కత్తివాదరతో సింహం తలపై కొట్టాడు. దేవిని కూడ ఆమె ఎడమభుజంపై కొట్టాడు.
రాజకుమారా! అతని ఖడ్గం ఆమె భుజాన్ని తాకడంతోనే ముక్కలుగా విరిగిపోయింది. అతడు అంతట కోపంతో కళ్ళు ఎఱ్ఱబారి శూలాన్ని తీసుకున్నాడు.
ఆ మహాసురుడు అంతట ఆ శూలాన్ని, జాజ్వల్యమాన తేజోయుక్తమైన దానిని, ఆకాశం నుండి సూర్యబింబాన్ని విసరినట్టు, భద్రకాళి పై విసిరాడు.
తన మీదికి వస్తున్న ఆ శూలాన్ని చూసి దేవి తన శూలాన్ని విసరగా అది ఆ శూలాన్ని, ఆ మహాసురుణ్ణి నూరు ముక్కలుగా ఖండించింది.
మహిషాసురుని సేనానియైన మహావీరుడు వధితుడవడం వల్ల వేల్పులను నొప్పించడానికై చామరుడు ఏనుగునెక్కి (దేవిని) మార్కొనెను.
అతడు కూడా తన భల్లాన్ని అంబికాదేవిపై విసిరాడు, ఆమె వెంటనే ఒక హుంకారంతో (“హుమ్” అను శబ్దంతో) దాన్ని ఎదిరించి అది కాంతివిహీనమై నేలపై పడిపోయేటట్లు చేసింది.
తన భల్లం విరిగి నేలకూలడం చూసి చామరుడు కోపంతో ఒక శూలాన్ని విసిరాడు. ఆమె దాన్ని కూడా తన అమ్ములతో త్రుంచివేసింది.
సింహం అప్పుడు పైకి ఎగిరి ఏనుగు కుంభస్థలమధ్యలో కూర్చొని, ఆ సురవైరితో బాహు యుద్ధం చేసింది.
పోరాడుతూ వారిరువురూ ఏనుగుపై నుండి దూకి మహా ఘోరంగా యుద్ధంచేస్తూ ఒకరినొకరు మిక్కిలి భయంకరంగా కొట్టుకున్నారు.
*సశేషం....*