84 లక్షల జీవరాసులలో అపురూప జన్మ ఏది? అన్ని_జన్మలలోను_ఏది_ఉత్తమమైనది*?

P Madhav Kumar


*అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది.*


*అసలు జన్మలు మూడు రకాలు.*


*1) దేవజన్మ 2) మానవజన్మ 3) జంతుజన్మ.*


*జన్మలు ఎలా వస్తాయి? వాటి ప్రత్యేకతలేమిటి?*


*మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు.*


*అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగాప్రయాణిస్తుంటాయి. అందులో అన్నీ పుణ్యకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మ నెత్తుతాడు. అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగభూమి. కనుక అక్కడ అతడికి ఏ కర్మలూ చేసే అధికారం లేదు. అందువల్ల పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడ లేదు. తన కర్మ ఫలాలను అనుసరించి భోగాలనుభవించి, ఆ కర్మ ఫలాలు క్షయంకాగానే “క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి” అన్నట్లు ఈ మర్త్యలోకాన్ని మానవ లోకాన్ని చేరుకోవలసిందే!*


*మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే!*


*ఈ దేవజన్మలో కేవలం మనోబుద్ధులుంటాయి గాని కర్మజేయుటకు సాధనమైన స్థూలశరీరం ఉండదు. కనుక భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు దేవజన్మ.*


*ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనులందు జన్మిస్తాడు. ఆ జన్మలలో ఆ కర్మ ఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడతాడు. జంతు జన్మలలో కర్మలు చేస్తున్నట్లు కన్పించినా, ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని చేసేవి కావు. కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి. కారణం ఈ జంతు జన్మలలో శరీరం మనస్సు ఉన్నాయి గాని బుద్ధి మాత్రం లేదు. కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మ ఫలాలు అనుభవించుటయే గాని పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. కనుక భగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు!*


*ఇక పుణ్య పాప కర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది. ఈ జన్మలలో పుణ్య కర్మఫలాల కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు. పాప కర్మ ఫలాల కారణంగా దుఃఖాలు, బాధలు అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మ ఫలాలనుభవించటం మాత్రమే గాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవ జన్మలోనే ఉన్నది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధితో ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా శరీరం, మనస్సు, బుద్ధి అనే మూడు సాధనాలు ఉన్న జన్మ ఇది. కనుక పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మను ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది అన్నారు.*


*84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానవజన్మను “జంతూనాం నరజన్మ దుర్లభం” అని ఆచార్య శంకరులు “వివేక చూడామణి” గ్రంధంలో తెలియజేయటం జరిగింది.*


*ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమమైన మానవజన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat