కాలభైరవుడు, వీరభద్రుడు ఇరువురు ఓకరేనా, లేక వేర్వేరు*దేవుళ్ళా*?...!!

P Madhav Kumar


భైరవుడు, వీరభద్రుడు ఇద్దరూ కూడా శివుని అంశలే , కానీ వారిని సృష్టించిన ప్రయోజనాలు వేరు వేరు.. 


కాలభైరవుడి వృత్తాంతాన్ని తీసుకుంటే ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మ గారికి ఐదు తలలు ఉండేవట, దానితో అయన త్రిమూర్తుల్లో తానే గొప్ప అని అహంకరించడంతో, శివుడికి ఆగ్రహం వచ్చి, తన వేలి నుంచి ఒక గోరు ని తీసి విసిరాడుట.. 


ఆ గోరే భయానకమైన కాల భైరవుడి రూపం సంతరించుకుని, బ్రహ్మ అహంకారానికి కారణమైన ఆ ఐదో తలని నరికేస్తాడు.. అప్పటినుంచే బ్రహ్మ గారు చతుర్ముఖుడు గా మిగిలారు అని అంటారు.


అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు, బ్రహ్మ గారి శిరస్సు ని నరకడంతో, ఆ శిరస్సు అయన చేతికి అంటుకుపోతుంది.. ఎంత ప్రయత్నించినా అది వదలదు.. 


దానితో పాటుగా బ్రహ్మ గారి శిరస్సు ని ఖండించడంతో బ్రహ్మ హత్య పాతకం కూడా చుట్టుకుంది.. దానితో ఏమి చేయాలో తెలియక, కాశీ బాట పడతాడు కాల భైరవుడు.. కాశీ లో ఎటువంటి పాపం ఆయన్ని ఏమి చేయలేదు కనుక, అక్కడే అయన స్థిరనివాసి అయ్యాడు.


 కాశీ కి వెళ్ళిన ఎవరైనాసరే కాలభైరవుడి దర్శనం చేసుకుని తీరాల్సిందే.


కాశీ కి మాత్రమే కాదు ,అష్ట దిక్కులకి కాపలా కాస్తూ , నియంత్రించే , అష్ట భైరవులు కూడా మహా కాల భైరవుని అధీనంలో ఉంటారు.. 

మన తెలుగు వారి దగ్గర కాల భైరవ ఆరాధన తక్కువే కానీ, తమిళ నాట కాల భైరవ ఆలయాలు, ఆరాధన ఎక్కువే. 


      వీరభద్రుడు : 


ఇక వీరభద్రుడి అంశని సృష్టించిన సందర్భం వేరు.. దక్ష యజ్ఞం సందర్భంగా శివుడికి జరిగిన అవమానం తట్టుకోలేక సతీదేవి దేహత్యాగం చేయడంతో శివుడు ఆగ్రహోధిగ్తుడు అవుతాడు.. 


దానితో తన జటాజూటం నుంచి ఒక శిరోజాన్ని తీసి విసరడంతో అది వీరభద్రుడి గా, భద్ర కాళి గా ఉద్భవిస్తుంది.. వీరభద్రుడు దక్షుడి తల తెగనరికి , యజ్ఞ గుండంలోకి విసిరేస్తాడు.. అలా వీరభద్రుడు దక్షుడి గర్వ భంగం చేస్తాడు..


వీరభద్రుడి ఆగ్రహాన్ని కాళీ ఒక యువతిగా మారి శాంతపరుస్తుంది .. మన కోనసీమ లో ఉన్న మురముళ్ళ లో వీరభద్రుడు, భద్ర కాళీ సమేతంగా వెలిశారు.


ఈ వీరభద్రుడి తో మన తెలుగు వారికి చాలా అనుబంధం ఉంది.. కొన్ని కుటుంబాల్లో తమ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే వారిని వీరభద్రుడిగా భావించి పూజిస్తారు.. 


ప్రతి సంవత్సరం మేళ తాళాలతో పల్లకీలు కట్టి, వీరభద్రుడిని ఊరేగిస్తూ తీసుకెళ్లి, నది దగ్గర పూజలు ఆచరిస్తారు.. కాబట్టి వీరభద్రుడు అంటే మన తెలుగు వారికి ఒక కుటుంబ సభ్యునితో సమానం.


తమిళనాడు లో మాత్రం వీరభద్రుని ఊరిని రక్షించే దేవునిలా పూజిస్తారు.. ఊరికి పొలిమేరలో భీకర ఆకారంలో కత్తి చేతబూనిన వీరభద్రుడి విగ్రహాలు, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో సర్వ సాధారణం.. 


మొత్తంగా చెప్పాలంటే వీరభద్రుడు ఇంకా కాల భైరవుడు వీరిని సృష్టించిన ప్రయోజనం ఒకటే, సృష్టిలో మనిషికి కావొచ్చు, దేవతల కి కావొచ్చు, అహంకారం ఉండకూడదు, అలా నేనే గొప్ప అని విర్రవీగితే మహా శివుడి ఒక్క గోరు, ఒక్క శిరోజం చాలు మీ అహాన్ని అణచడానికి అని సారాంశం.. 


ఆ దేవుళ్ళని పూజించి ఆగిపోకుండా, ఆ కథల్లోని సారాంశాన్ని కూడా గ్రహిస్తే అంతా మంచే చేకూరుతుంది..

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat