*🌻1.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్యారాధనము🌻*
*🌻గురువారవిశేషము- (పూలంగి)🌻*
🍃🌹విభూతిద్వయనాయకుడై ఈ లీలా విభూతియందు చేతనోజ్జీవ నార్థము కొంతకాలము నివాసము చేయదలచి తిరుమలయందు అర్చా వతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతి గురువారము నిత్య కైంకర్యములో విశేషము (పూలంగి) జరుగును. ఈ రోజున భక్తులు తరచుగా తిరుప్పావడను (అన్నకూటోత్సవమును) చేయించుచుందురు.
🍃🌹గురువారమున శ్రీ స్వామివారికి ప్రాతఃకాలారాధనముపూర్తి కాగానే అర్చకులు లోపల అంతర్ద్వారము తలుపులు వేసి ఏకాంతముగా సళ్ళింపు చేయుదురు. అనగా శ్రీవారికి అలంకరింపబడియున్న సువర్ణా భరణములు, రత్నాభరణములు, సువర్ణహారములు, రత్నహారములు, పీతాంబరములు అన్నియుతీసి భద్రపరచెదరు. మరియు శ్రీవారి పచ్చ కర్పూరపు ఊర్ధ్వపుండ్రమును అర్ధభాగమును తగ్గించి భక్తులు శ్రీవారి నయనగోచరమగునట్లును, వారు శ్రీవారి నయనారవింద సౌందర్యమును చూచునట్లును చేసెదరు.
🍃🌹పిమ్మట 24 మూర సరిగ పట్టంచు ధోవతిని అతి రమణీయముగా ధరింపచేసి 12 మూరగల అట్టి ఉత్తరీయమును ఉపవీత పద్ధతితో సమకూర్చి, శ్రీపాదములను, శ్రీహస్తములను, శంఖచక్రములను, కర్ణభూషణములను, సువర్ణ సాలగ్రామ హారమును సమర్పించెదరు. వెంటనే అంతర్ద్వారము తలుపులు తీసెదరు.
🍃🌹ఆ సమయమున శ్రీవారు చేతనులకు క్షేమంకరములగు శంఖ చక్రములతోను, క్షేమసూచకములగు వైకుంఠ కటిహస్తములతోను, వస్తోత్తరీయములతోను చిత్తహరమగు స్వతస్సిద్ధ దివ్యస్వరూప సౌందర్యమును ప్రకాశింపచేయుచూ, వక్షస్థలమున శ్రీ భూదేవులతో వేంచేసి యుందురు.
*🌻శుద్ధి🌻*
పిమ్మట దేవాలయములో శుద్ధి జరుగును. శ్రీవారికి మాధ్యాహ్ని కారాధనము ప్రారంభమగును.
*🌻మాధ్యాహ్నికారాధనము🌻*
మామూలు మేరకు తోమాల అర్చనము పూర్తి అయిన పిమ్మట నివేదన సమయము వచ్చును.
*🌻మాధ్యాహ్నిక నివేదనము🌻*
శ్రీవారికి తిరుప్పావడ కైంకర్యము జరుగు నెడల, ఆస్థాన మండపములో తగిన ఆవరణయవనికను యేర్పాటు చేయుదురు.
*🌻తిరుప్పావడ🌻*
🍃🌹పాచకకైంకర్యపరులు ఆరుమూటలు (అనగా 450 కిలోలు) పరిమాణముగల తండులములతో తయారుచేయబడిన అన్న ప్రసాదమును (పులిహోరను) గంగాళములతో తెచ్చి ఆ యవనిక (తెర) మధ్య భాగమున శ్రీవారి దృష్టి ప్రసారము కలుగునట్లు అన్నరాశిని చేయుదురు. ఆ అన్నరాశిని కొన్ని పర్వములుగా తయారుచేసి పైభాగమున పెద్ద అన్నకూటమును (శిఖరమును) యెనిమిది దిక్కుల యందు శిఖరములను యేర్పాటుచేసి నారికేళఫలముల యొక్క అర్థభాగములచేతను, పుష్పములచేతను, అన్ని దిక్కులయందును, ముఖ భాగమందును రమణీయముగా అలంకరించి అన్నరాశిని సిద్ధముచేయుదురు.
🍃🌹అందుచే ఈ తిరుప్పావడను అన్నకూటోత్సవమని వ్యవహరించు చున్నారు. తరువాత శ్రీవారిసన్నిధి కి విశేషములగు లడ్డు ప్రసాదములు, వడ ప్రసాదములు, అప్పం ప్రసాదములు, దోసె ప్రసాదములు, జిలేబీ ప్రసాదములు, పాయస ప్రసాదములున్నూ, మామూలు ప్రసాదములున్నూ, విశేష ప్రసాదములున్నూ చేర్చి శ్రీవారి దృగ్గోచర మగునట్లు చేసెదరు.
🍃🌹అంతట మహామంటలనుండి ప్రణవనాదము బయలుదేరును. వెంటనే అర్చకులు ఏకాంతముగా శ్రీస్వామివారికి అన్ని ప్రసాదములను ప్రత్యేకముగా నివేదనముచేసి అన్నరాశిని క్రమముగా నివేదనముచేసి నివేదనాంతోపచారములను సమర్పించి నివేదనమును పూర్తి యొనరించెదరు. అంతట శ్రీ భాష్యకారులవారికి నివేదనము జరుగును.
🍃🌹పిదప ఆవరణయవనికను (తెరను) తొలగించి, తిరుప్పావడ వద్దకు ప్రార్థనావరులగు గృహస్థులను రప్పించి దత్తమును చేయించెదరు. ఇచ్చటనుండియే శ్రీవారికి కర్పూరహారతి జరుగును. అధికారులకు ఫలతాంబూల బహుమానము జరుగును. అనంతరము అర్చకులు వారి భాగల్భమగు ప్రసాదమును (హళ్ళు) ఈ తిరుప్పావడ నుంచి తీసుకొనెదరు. వెంటనే ఈ ప్రసాదము నుంచి గోష్ఠికి స్థానబహుమానము జరుగును. తరువాత ప్రార్ధనాపరులగు గృహస్థులకు వారి బంధువులతో సహా శ్రీవారి దర్శనము జరిగి వారికి వస్త్ర బహుమానము జరుగును. ప్రార్థనాపరులు స్వస్థానమునకు వెళ్ళెదరు. శ్రీస్వామివారి సన్నిధానమున సర్వదర్శనము ప్రారంభమగును.
*🌻సర్వదర్శనము🌻*
🍃🌹ఆ' సర్వదర్శనములో శ్రీవారు, భక్తులను కన్నులార కటాక్షించు చుందురు, భక్తులు శ్రీవారి కటాక్ష పాత్రులగుచు శ్రీవారి నయనార వింద సౌందర్యమును కన్నులార కాంచుచు బ్రహ్మానందముననుభవిం చుచూ తీర్థా దిస్వీకారము చేయుచూ శ్రీవారి స్వయంవ్యక్త దివ్య స్వరూప సౌందర్య శక్త్యపహృత చిత్తులై వెళ్ళలేక వెళ్ళుచుందురు.
*🌻శుద్ధి🌻*
సాయంకాలారాధన సమయముకాగానే సర్వదర్శనము నిలుపబడి దేవాలయ శుద్ధి జరుగును.
*🌻సాయంకాలారాధనము🌻*
వెంటనే అర్చకుడు శ్రీవారి సాయంకాలారాధనమునకుగాను నిత్యకర్మలనాచరించి మర్యాదలతో ఆలయమును ప్రవేశించి శ్రీవారి సన్నిధానమునకు చేరును.
🍃🌹అనంతరము శ్రీ జియ్యంగార్లు, ఏకాంగి యమునత్తురై అను పుష్పసంచయస్థానమునకు వెళ్ళి అచ్చట పుష్పకైంకర్యపరుల చేత తయారుచేయబడిన పుష్పమాలికలతోను, పుష్పములతోను నిండియున్న వేణుమయ పాత్రములను (వెదురు గంపలను) రెంటిని జియ్యంగార్లు, ఏకాంగివారు శిరస్సులయందు ఉంచుకుని మామూలు ప్రకారం జాఘంటా వాద్యముతోను, మంగళవాద్యములతోను ధ్వజ
ప్రదక్షిణముగా సువర్ణ ద్వారమునకు వచ్చి అచ్చట వాద్యములను వదలి పెట్టి శ్రీవారి సన్నిధానమునకు వచ్చి ఆ పుష్పపాత్రములను సమర్పించెదరు.
🍃🌹ఇంతలో అర్చకుడు శ్రీవారికి కపాయిని (గాత్రసంవరణ వస్త్ర విశేషమును) తిరుమేనుకు కిరీటమునకు సమర్పించును. సాయంకాలా రాధనము ప్రారంభమగును. జియ్యంగారు ఆలవట్టముతో (పట్టు విసరెతో) విసరుచూ దివ్య ప్రబంధమును గానము చేయుచుందురు. అర్చకుడు శ్రీవారికి ఉపచారములను పూర్తిచేసి అలంకారాసనములో తోమాలసేవ ప్రారంభము చేయును.
🍃🌹అంతట జియ్యంగారు, అధ్యాపకులు ఆచార్య, పురుషులు, శ్రీ వైష్ణవస్వాములు అందరు ఆలయము లోని మూడవ అంతర్ద్వారము ముందుకువచ్చి పంక్తులుతీరి పద్మాసన మున కూర్చుండి దివ్య ప్రబంధములోని నిత్యానుసంధాన పాశురములను (140) గానము చేయుచుందురు. సువర్ణద్వారమునకు పురోభాగము నగల ఆస్థాన మండపమునందు గరుడాళ్వారు సన్నిధి వద్ద మంగళవాద్యములు జరుగుచుండును.
🍃🌹శ్రీవారి బంగారువాకిలియందుగల మామూలు పరదాను తీసివేసి పూలంగి పరదాను, అనగా మధ్యభాగమున శ్రీవారి ప్రతిమతో అతిరమణీయముగా తయారు చేయబడిన నగిషీ పనిగల 'వెల్వెట్టు' పరదాను కట్టెదరు.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*