Part - 45
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️
ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది.
తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు సమ్మక్కసారక్క జాతర్ల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది.
ఒకనాటి తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది.
అన్ని గ్రామాలకూ ఉన్నట్టే తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మకు ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు
పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు.
యుక్తవయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు
తమిళ సంప్రదాయం ప్రకారం చిత్రినెల చివరి మంగళవారం రోజున చాటింపు జరుగుతుంది.
ఇందులో భాగంగా ఉదయం ఆలయప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి, వడిబాలు కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కులపెద్దల నుంచి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాల సారెను తీసుకువస్తారు. ఈ పసుపుకుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు వూరి ప్రజలెవరూ పొలిమేరలు దాటరాదంటూ చాటింపు వేస్తారు.
మర్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. అలనాడు పాలెగాణ్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు.
ఈ క్రమంలో వెుదటిరోజున బైరాగివేషం వేస్తారు. కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగివేషం వేసిందని భక్తుల నమ్మిక. రెండోరోజు బండవేషం. మానవుడు కష్టనష్టాలకు వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు. మూడోరోజు తోటివేషం. దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు. నాలుగోరోజు దొరవేషం. డప్పులు, వాయిద్యాల సందడి మధ్య దొరవేషదారులు వూరంతా వూరేగుతారు.
స్థలపురాణం ప్రకారం శనివారంనాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాడిని సంహరిస్తుం
నాలుగోరోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదోరోజున మాతంగి రూపు ధరించి పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్య వాచకాలు చెబుతుందట. దీనిని గుర్తుచేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు. ఆరోరోజు సున్నపుకుండల వేషం వేస్తారు. ఏడోరోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను(వెదురు బద్దలతో) తయారుచేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాల వేషం వేస్తారు. ఇక చివరిరోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రినుంచే పడిగాపులు కాస్తారు.
పేరంటాలు వేషంలో ఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారుచేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది.
గంగమ్మతల్లి తిరుమల వేంకటేశుడికి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో తితిదే నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర నాలుగోరోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపుకుంకుమలూ శేషవస్త్రాలూ గంప, చేట తదితర మంగళద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారెగా అందజేస్తారు.
పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారట. ఈ విషయం తెలిసినవారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు.
ఓం నమో వేంకటేశాయ 🙏🏻