Karthika Masam: కార్తీక మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు చేసే పూజలు, కలిగే పుణ్యఫలితాలు

P Madhav Kumar

కార్తీక మాసం అంటే పూజల మాసం. వ్రతాలు, నోముల మాసం..ఆధ్మాత్మిక వెల్లివిరిసే మాసం. ఈ కార్తీక మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఏ తిథి రోజు ఏ పూజలు చేయాలి..చేస్తే కలిగే పుణ్యఫలితాలు.


Karthika Masam : కార్తీకమాసంలో తెల్లవారు జామునే వణికించే చలిలో చన్నీటితో లేచి తలారా స్నానం చేసి..కార్తీక దీపాలు పెడతారు మహిళలు. కార్తీక మాసం అంతా ప్రతీ రోజు ఏదోక పుణ్యకార్యాల్లోనే మునిగి ఉంటారు. శివకేశవులు దేవాలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. తమ కుటుంబాలు పిల్లాపాపలతో చల్లగా ఉండాలని వేడుకుంటారు. గోమాత పూజలు. ఆవునెయ్యితో కార్తీక దీపాలను తయారు చేసి దీపలక్ష్మికి పూజలు చేసి పారే నీటిలో వదులుతారు. సౌభాగ్యాలు కలిగించే తులసికోట ముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తారు.


అలా కార్తీకమాసం అంతా మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండిపయేలా చేయటమే ఈ మాసం ప్రత్యేకత. సాధారణ రోజుల్లో పూజలు చేసినా కార్తీకమాసం మాత్రం ప్రత్యేకమైన ఆధ్యాత్తిక భావన కలిగిస్తుంది. శ్రావణమాసంలో శుక్రవారానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో కార్తీక మాసంలో సోమవారాలకు అంతటి విశిష్టత ఉంది. అంతేకాదు కార్తీకంలో వచ్చే దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులకు అంతటి విశిష్టత ఉంది. శ్రావణమాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రార్థిస్తే..కార్తీకమాసంలో ఆమె పతిదేవుడైన శ్రీమహావిష్ణువు పూజింటం ఈ మాసం ప్రత్యేకత. విష్ణువును తులసిదళాలతో పూజిస్తే సౌభాగ్యాలను అనుగ్రహిస్తాడు. అలాగే ఆయనకు చాలా ఇష్టమైన కమలాలతో పూజిస్తే జీవించినన్నాళ్లూ ధనానికి లోటు లేకుండా చేస్తాడు. ఎందుకంటే కలువ పువ్వులు లక్ష్మీదేవి నిలయాలు.


కార్తీక మాసంలో ప్రతి రోజూ పుణ్యప్రదమైనదే. ఏ తిధిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుందాం..

కార్తీక శుద్ధపాడ్యమి : అంటే కార్తీక మాసం ప్రారంభం రోజు. పాడ్యమి దీపాలు పెట్టుకునే తొలిరోజు తెల్లవారు జామునే లేచి తలారా స్నానం చేసి..దేవాలయానికి వెళ్లి కార్తీక వ్రతం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చేయమని ప్రార్థించి సంకల్పం చెప్పుకోవాలి.


విదియ : రోండో రోజు తోడబుట్టిన సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణాలు చెబుతున్నాయి. దీనినే భగనీ హస్త భోజనం అంటారు. భగినీ అంటే సోదరి. ఆమె చేతి వంట తినేదానిని భగినీ హస్త భోజనం అంటారు.

తదియ: ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లి కుంకుమ పూజ చేయించుకుంటే చాలా శుభప్రదం. కుంకుమ పూజ చేయించుకుంటే సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. ఆమె ఎప్పుడు నిత్య సుమంగళిగా వర్థిల్లుతుందని పండితులు చెబుతున్నారు.

చవితి : చవితి నాగుల చవితి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుని పూజ చేయాలి. నాగుల పుట్టకు వెళ్లి పూజ చేసి పాలు పోస్తారు.
పంచమి : పంచిమిని జ్ఞానపంచమి అని అని కూడా అంటారు. పంచమి తిథి రోజున సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కోసం ఆర్చనలు చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుందంటారు.

షష్టి : అంటే సుబ్రహ్మణ్య షష్టి. ఈ రోజు కూడా నాలుగ పూజ చేయాలి. పూజ తరువాత బ్రహ్మచారికి ఎర్రని వస్త్రం లేదా కండువా..పంచె దానం చేస్తే సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని సంతానం ఉన్నవారికి శుభాలు కలుగుతాయని చెబుతారు.

సప్తమి : ఈ రోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్షు పెరుగుతుందంటారు.

అష్టమి : సాధారణంగా అష్టమి రోజున ఏపనులు చేసినా అష్టకష్టాలు కలుగుతాయంటారు. కానీ కార్తీకమాసంలో వచ్చే అష్టమిని గోపాష్టమి అంటారు. ఈరోజు గోపూజ చేస్తే చక్కటి ఫలితాలు కలుగతాయట..

నవమి: నవమి అంటే చాలా మంది భయపడతారు. నవమి అంటే తొమ్మిదో రోజు ఈ రోజు నుండి మూడు రోజులపాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరిస్తే ఎన్నో మేళ్లు కలుగుతాయట..

దశమి: దశమి చాలా మంచిరోజు. శుభకార్యాలు ఏవైనా చేపట్టే మంచి తిథి. దశమి రోజు రాత్రి విష్ణుపూజ చేస్తే కుటుంబ క్షేమం కలుగుతుందట..

ఏకాదశి : ఏకాదశి రోజు కూడా విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయని పెద్దలు చెబుతారు.

ద్వాదశి : కార్తీకంలో వచ్చే ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి మొక్క, తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి, దీపాలు వెలిగించడం సర్వపాపాలనూ నశిస్తాయి..

త్రయోదశి: సాలగ్రామ దానం చేస్తే సర్వపాపాలు పోయి అన్ని కష్టాలూ దూరమవుతాయంటారు.

చతుర్దశి : పాషాణ చతుర్ధశి వ్రతం చేసుకునేరోజు.


15వ రోజు కార్తీక పూర్ణిమ : ఈ మాసంలో అత్యంత పవిత్రమైన రోజు..శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వపాపాలూ ప్రక్షాళనమవుతాయి. యువతులు వివాహం జరిగిన తొలి సంవత్సరంలో కార్తీక పౌర్ణమి పూజను చేస్తారు. గుమ్మడి పండుతో పాటు 16 రకాల పండ్లను శివాలయంలో ఇస్తారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడు వచ్చాక అద్దంలో చంద్రుడిని చూసి పూజల చేసిన అప్పుడు భోజనం చేస్తారు. ఇలా వివాహం జరిగిన తొలి సంవత్సరం ఇలా చేస్తే వారికి మంచి పిల్లలు పుడతారని కాపురం సుఖ సంతోషాలతో సాగుతుందని అంటారు. గుమ్మడి పండు శివాలయంలో ఇస్తే గుమ్మడి పండులాంటి బిడ్డలు పుడతారని అంటారు.


కార్తీక బహుళ పాడ్యమి : ఈ రోజు ఆకుకూర ఆవుకు ఆహారంగా పెడితే చాలా శుభాలు కలుగుతాయి.

విదియ : వనభోజనం చేయడం విశేష ఫలాలనిస్తుంది..మరి ముఖ్యంగా రాసి ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయటం ఆచారంగా వస్తోంది..
తదియ : పండితులకు, గురువులకు తులసి మాలను సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి.
చవితి : పగలంతా ఉపవవాసం చేసి సాయంత్రం గరిక గడ్డితో వినాయకుడిని పూజించి ఆ గరికను రాత్రి పడుకు సమయంలో తలగడ కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు రావని చెబుతారు.

పంచమి : చిరు ప్రాణులకు ఆహారం పెట్టే రోజు. అంటే చీమలకు నూకలు, పిండి వంటివి ఆహారంగా పెట్టటం మంచిది. అలాగే కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచి ఫలితాలు లభిస్తాయట.

షష్ఠి : గ్రామ దేవతలకు పూజలు చేసిన నైవేద్యాలు పెడితే వారి కుటుంబాలను దేవతలు చల్లగాచూస్తారట..

సప్తమి : శివ పూజ చేయటం చాలా మంచిది. జిల్లేడు పూల దండను ఈశ్వరునికి సమర్పిస్తే సిరి సంపదల్ని కలిగిస్తాడట.

అష్టమి: కాలభైరవాష్టకం చదివి..గారెలు వండి కుక్కకు గారెల దండవేస్తే ధనం పెరుగుతుందట. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట..

నవమి : కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలకు ముక్తి కలగుతుందట..
దశమి : అన్న సంతర్పణ చేస్తే విష్ణువు సంతోష పడి వారి తరతరాలకు ధన ధాన్యాలకు లోటు లేకుండా దీవిస్తాడట..

ఏకాదశి : శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో దీపారాధన చేసిన విష్ణు పురాటం విన్నా..చదవినా కోటిపుణ్యాలు కలుగుతాయి.
ద్వాదశి : అన్నదానం చేస్తే అన్ని శుభాలు కలుగుతాయి. బ్రాహ్మణులకు స్వయంపాకం సమర్పించడం శుభప్రదం..
త్రయోదశి : నవగ్రహాలను పూజిస్తే ఏ కీడులు జరగకుండా మేలు జరుగుతుంది. అన్ని గ్రహాల దోషాలు తొలగిపోతాయి..
చతుర్దశి: కార్తీక మాసంలో శివరాత్రినాడు చేసే ఈశ్వరార్చన, అభిషేకం అపమృత్యుదోషాలను తొలగిస్తుంది..

అమావాస్య : కార్తీక మాసంలో ఆఖరి రోజు. చాలా విశిష్టమైన రోజు. పితృదేవతల పేరుతో పేదలకు అన్నదానం చేస్తే వారికి స్వర్గప్రాప్తి లభిస్తుంది.

కార్తీక మాసంలో అన్ని రోజులు కురదకపోయినా కనీసం ఈ మాసంలో అత్యంత పుణ్య రోజులైన ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో నిమయ నిష్టలతో పూజ చేస్తే అనంత కోటి పుణ్యఫలితాలు దక్కుతాయి. ఇక పూర్ణిమ రోజు చేస్తే ఇంకా మంచిది. కుదరకపోతే కనీసం ఆ మాసంలో ఒక్క సోమవారం అయినా నియమ నిష్టలతో ఉపవాసం చేసిన దేవాలయంలో దీపం వెలిగించి ఆకాశ దీపాన్ని చూస్తే కోటి పుణ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.

ఏడాదికి సరిపడా ఒకేసారి మట్టి ప్రమిదలో ఆవునెయ్యితో.. 365 వత్తులు శివాలయంలో  వెలిగిస్తే సమస్త పాపాలూ పటాపంచలవుతాయి. జీవించి ఉన్నంతకాలం సర్వసౌఖ్యాలు కలుగుతాయి. చనిపోయాక స్వర్గప్రాప్తి లభిస్తుంది. ఇలా కార్తీక మాసం అంతా ప్రతీరోజు విశేషం. ప్రతీ ఘడియ విశిష్టమైనదే.



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat