*🌻1.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్యారాధనము🌻*
*🌻సువర్ణలక్ష్మి అభిషేకము🌻*
🍃🌹శ్రీస్వామివారి వక్షస్థలమునందు సువర్ణ ప్రతిమా రూపముగా వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీ తాయార్లవారికి గర్భాలయమునందు సమంత్రకముగా పరిమళముతోను హరిద్రతోను అభిషేకము జరుగును. దక్షిణ భాగమున అధికారులు, శ్రీవైష్ణవస్వాములు అందరూ కులశేఖరపడికి ముందుభాగమునకు వచ్చియుందురు.
🍃🌹అర్చకుడు పంచపాత్రములతో కూడిన వెండిపల్లెరమునందు శ్రీలక్ష్మీ తాయార్లవారిని సువర్ణపాత్రముపైన స్థానకములో వేంచేపుచేసి శ్రీతాయార్లవారికి అభిషేకానుగుణములగు ఉపచారములను సమర్పించి పంచ పాత్రములలోని పరిమళ తీర్థమును సువర్ణశంఖముతో తీసుకొని భక్తితో విధేయతతో “హరిః ఓమ్', 'హిరణ్య వర్ణాం హరిణీం' అని సూక్తమును పఠించుచూ అభిషేకము చేయనారంభింపగానే వేద పూతగాత్రులగు వేదపారాయణపరులు అర్చకముఖోధ్ధతమైన ఆ వాక్యమును అనువదించుచూ శ్రీసూక్తమును అతి శ్రావ్యముగా పఠించు చుందురు.
🍃🌹అర్చకుడు శ్రీతాయార్లవారికి ఆ శ్రీసూక్తముతో పరిమళాభిషేకమును హరిద్రాభిషేకమును పూర్తిచేసి ఫ్లోతవస్త్రముతో (తుడిచెడు పొడివస్త్రముతో) తడిలేకుండునట్లు తుడిచి అనువైన సరిగపట్టు వస్త్రమును ధరింపజేసి తిలకమును దిద్ది శ్రీవారి వక్షస్థలములో దక్షిణ భాగమున సువర్ణహారముచే మహాభరణముగా వేంచేపు చేయుదురు. భూదేవీవారును శ్రీవారి వక్షస్థలములో వామభాగమున సువర్ణ ప్రతిమా రూపముగా వేంచేపు అయియుందురు. ఇది అనాది ఆచారము.
🍃🌹ఇటుల మనోహర వస్త్రభూషణాద్య లంకృతులై వక్షస్థలమునందు శ్రీభూదేవులతో ప్రకాశించు శ్రీస్వామివారికి నీరాజన పాత్రముచే కర్పూర హారతి జరుగును. ఇదియే అభిషేకమహోత్సవము.
*🌻మాధ్యాహ్నికారాధనము🌻*
🍃🌹ఇటుల శ్రీస్వామివారికి శ్రీతాయర్లవారికి శుక్రవారాభి షేకాలంకారాదులు పూర్తి అయిన పిమ్మట శ్రీవారి మాధ్యాహ్నికారాధనమునకు గాను మరియొక అర్చకుడు అహ్నిక కర్మల నాచరించి మర్యాదలతో శ్రీవారి సన్నిధానమునకు వచ్చిచేరును.
🍃🌹పిమ్మట శ్రీ జియ్యంగార్లు మామూలు ప్రకారము యమునత్తు రైకి వెళ్లి తులసీ పుష్పములు పుష్పమాలలు కల వేణుమయ పాత్రమును తెచ్చి శ్రీవారి సన్నిధానమున ఉంచెదరు.
*🌻తోమాల సేవ🌻*
🍃🌹అర్చకుడు శ్రీవారికి ఆరాధనము ప్రారంభించి మధ్యాహ్నోచితములగు ఉపచారములను సమర్పించి తోమాల సేవ ప్రారంభించును. జియ్యంగార్లు, అధ్యాపకులు, శ్రీవైష్ణవస్వాములు “ సిరియతిరుమడల్ ,
అను (72) దివ్య ప్రబంధ పాశురములను గానము చేయుచుందురు. తోమాల సేవ పూర్తికాగానే మంత్రపుష్పము జరిగి హారతి జరుగును.
*🌻అర్చనము🌻*
🍃🌹వెంటనే అష్టోత్తర శతనామార్చనము, హారతి జరుగును.
*🌻మాధ్యాహ్నిక నివేదనము (రెండవ ఘంట)🌻*
🍃🌹అప్పుడు పాచక కైంకర్యపరులు శుక్రవార నిమిత్తకమగు ప్రసాదములు భక్ష్యభోజ్యాదులు శైత్యోపచారమునకై వడపప్పు, పానకము మామూలు ప్రసాదములు తెచ్చి శ్రీవారికి పురోభాగమున నుంచి వెళ్లెదరు. ఘంటానాదము ప్రారంభమగును. అర్చకులు అంతర్ద్వారము తలుపులువేసి శ్రీవారికి ప్రశాంతంగా నివేదనము చేయుదురు. నివేదనము పూర్తికాగానే తలుపులు తీయుదురు. ఘంటానాదము శమించును. పాచక కైంకర్యపరులు ప్రసాదములను నిర్ణీత స్థానములకు చేర్చెదరు. అర్చకుడు శ్రీవారి పరివారదేవతలకు బలిని సమర్పించి శేషమును భూతపీఠమున చేర్చును. ఈ సమయములో ఇతర దేవులకు శ్రీ భాష్యకారులవారికి నివేదనము జరుగును. ఏకాంతముగా శాత్తుమొర జరుగును.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*