ఆత్మకు జననమరణములు వుండవు. అలాగే భూత, భవిష్యత్, వర్తమానాలు వుండవు. అది శాశ్వతము, సనాతనము. అది అంతటా వ్యాపించియున్నది. అన్ని జీవులయందు వున్నది. ఆత్మను ఆయుధములు ఏమీ చేయజాలవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. అనగా ప్రపంచాన్ని శాసించే పంచభూతములు ఆత్మను ఏమి చేయలేవు. దానిని తెలుసుకోవడమే అసలైన సాధన. దానిగురించే యోగుల తపన.
ఆత్మ ఇంద్రియములకు లోబడదు. ఆత్మను చాలామంది చాలారకాలుగా వర్ణిస్తారు. దానిని వర్ణించేకన్నా సాధన ద్వారా అనుభూతి పొందడం ఉత్తమము. తనను తాను తెలుసుకొని, ఆత్మానుభూతి పొందడమే అసలైన సాధన. ఆత్మను గ్రహించలేని సాధనాలన్నీ వ్యర్ధమే.
ఆత్మజ్ఞానము వలనే మనుజులకు బలము, ఉత్సాహము, ధైర్యము కలుగుతుంది. అందుచేతనే దుర్బలుడై నిరుత్సాహంతో నున్న అర్జునునికి మొట్టమొదటిగా ఆత్మను గురించి తెలియజేశాడు. ఉపనిషత్తుల సారమంతా "విద్యలన్నింటిలో ఆత్మవిద్యను నేను" అన్న వాక్యంతో ఎంతో సులువుగా బోధించాడు శ్రీకృష్ణపరమాత్మ.
జీవితములో మానవులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాధనద్వారా వాటిని పరిష్కరించుకొను మార్గములు, ఉన్నతస్థితినొంది ఆనందమును ఆస్వాదించుటకు చేయవలసిన సాధనాలు ఈ భగవద్గీతలో ప్రతిపాదించేడు జగద్గురువైన గోవిందుడు.
ఆత్మజ్ఞానము పొందుటకు ముఖ్యముగా మూడు మార్గములను ప్రతిపాదించాడు శ్రీకృష్ణుడు. మొదటిది కర్మమార్గము, రెండవది భక్తిమార్గము, మూడవది జ్ఞానమార్గము. గీతలో శ్రీకృష్ణుని ఉపదేశమంతా ఈ మూడింటి పైనే ఆధారపడివుంది. ఈ మూడు మార్గములు ఒకదానితో ఇంకొకటి పరస్పర సంబంధమును కలిగివుంటాయి. కర్మయోగమందు భక్తి-జ్ఞానములు, భక్తియోగమందు కర్మ-జ్ఞానములు, జ్ఞానయోగమందు కర్మ-భక్తులు ఇమిడివుంటాయి.
కర్మయందు అనాసక్తుడై యుద్ధముచేయనని తేల్చిజెప్పిన అర్జునుణ్ణి మేల్కొలుపుటకు తొలుత స్వరూపజ్ఞానమును బోధించి, ఆపిమ్మట ఆత్మభావముతో అసలు ఎటువంటి కోరికలేకుండా, అనాసక్తితో, ఒక విధిగా భావించి కర్మనాచరించమని ప్రోత్సహించాడు జగద్గురువు. కారణం కర్మనాచరింపక ఎవ్వరునూ ఒక్క క్షణమైనా వుండలేరు కాబట్టీ.
కావునా మానవుడు చేయు ప్రతి కర్మను, కర్మయోగముగా మార్చుకుంటే కర్మబంధము నుండి ముక్తి పొందవచ్చని సూచించాడు జగద్గురువు. ఇది వినడానికి కొంచం సందిగ్ధంగా వున్నా, అసలు సత్యాన్ని బోధిస్తుంది. అదేంటో పరిశీలిద్దాము.
ఆసక్తితో, కోరికలతో, ఫలాపేక్షతో, అహమనే భావముతో చేసేది కేవలం "కర్మ". ఇది బంధమును కలుగ జేస్తుంది. అనాసక్తితో, ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి కోరికలేక, అహమనే భావంలేకా చేయు కర్మ “కర్మయోగము"గా మారిపోతుంది. కర్మయోగము వలన బంధము కలుగదు. ఎందుకంటే అది పరమాత్మలో కలిసిపోతుంది. ఈ కర్మయోగమునే "యజ్ఞము" అని
తదుపరి భాగంతో మళ్ళీ కలుసుకుందాము...🌹 🪷⚛️✡️🕉️🌹