*🌻2.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు🌻*
*🌻2.నిత్యోత్సవము🌻*
🍃🌹దేవాదిదేవుడై (తిరుమల) శేషపర్వతమునందు అర్చావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి చాంద్ర - సంవత్సర ప్రారంభము మొదలుకొని నలుబది దినములు నిత్యోత్సవములు జరుగును. ప్రతి దినము సాయంకాలము శ్రీమలయప్ప స్వామివారు (ఉత్సవమూర్తులు) బంగారు తిరుచ్చియందు వేంచేసెదరు. రత్నాభరణముల చేతను, పట్టువస్త్రములచేతను, పుష్పమాలికలచేతను శ్రీవారికి అలంకారము జరిగి తిరువీధుల ఉత్సవమును సమస్త పరివారములతో, మంగళవాద్యములతో వేదపారాయణముతో పూర్తి యొనరించుకుని క్రమముగా శ్రీభాష్యకారులవారి సన్నిధి ముఖమండపమునకు వేంచేయుదురు.
🍃🌹అచ్చట శ్రీవారికి ఆరాధనము జరిగి తళియలు ఆరగింపు అయి హారతి జరుగును. పిమ్మట శ్రీవారికి సమర్పింపబడియున్న తోమాలను తీసి అర్చకులు శ్రీ భాష్యకారులవారికి సమర్పించి శేష హారతి మొదలగు మర్యాదలను జరిపెదరు. పిమ్మట ప్రసాదముతో అర్చకులకు శ్రీభాష్యకారులవారికి మర్యాదలు జరిగి స్థానబహుమాన పూర్వకముగా గోష్ఠికి ప్రసాద వినియోగము జరుగును. తరువాత శ్రీవారు సన్నిధికి వేంచేయుదురు. (ఈ నిత్యోత్సవములో రెండవదినము మొదలు చివరవరకు శ్రీవారు మాత్రమే తిరుచ్చిలో తిరువీధుల ఉత్సవమునకు వేంచేయుదురు.)
*🌻3. కొలువు (నిత్యా స్థానోత్సవము)🌻*
🍃🌹ఆశ్రితకల్ప భూరుహమై సప్తాచలమున అర్చావతారమున వేంచేసి యున్న శ్రీవేంకటేశ్వరస్వామివారికి ప్రతిదినము ఆరాధనాంగముగ కొలువు (ఆస్థానోత్సవము) జరుగును. శ్రీ స్వామివారికి ప్రతిదినము ఉషఃకాలమునకు పూర్వమే సుప్రభాతము జరిగి విశ్వరూపదర్శనము ప్రారంభమగును. ఆ విశ్వరూప దర్శనమందు రాత్రియందు శ్రీస్వామి వారికి బ్రహ్మాదులు ఆరాధనముచేసి తీర్థస్వీకారము చేయగా మిగిలిన తీర్థమును విశ్వరూప దర్శన పరాయణులగు భక్తులకు వినియోగమైన వెంటనే శుద్ధిజరిగి ఆరాధనాంగముగా తోమాలసేవ ప్రారంభమగును.
🍃🌹దివ్య ప్రబంధ పారాయణము. చతుర్వేదపారాయణము జరుగుచుండ పరిమళ పరిపూర్ణములగు వివిధములైన పుష్పమాలలను ఆరాధకులు శ్రీస్వామివారికి సమర్పించెదరు. తరువాత, (శ్రీనివాస ప్రభువు) కొలువు శ్రీనివాసమూర్తి సువర్ణద్వారము ముందుగల ఆస్థానమండపమునందు అమర్చియున్న సింహాసనమునకు సువర్ణ ఛత్రము, వింజామరలు మొదలగు రాజ మర్యాదలతో వేంచేయుదురు. అచ్చట శ్రీవారికి ఆరాధనము జరిగి శ్రీవారు అర్చకులకు మాత్రాదానము చేయుదురు. ఆరాధకులు శ్రీవారి పాదములయందు మంత్రపుష్పమును సమర్పించెదరు. మిరాశీదార్లు దివ్య ప్రబంధములను, చతుర్వేదములను, వేదాంగములను ఇతిహాస పురాణములను, కర్మసూత్రములను, బ్రహ్మ సూత్రములను వినిపించెదరు.
🍃🌹పంచాంగములో నాటిదినమున జరుగు తిథి వార నక్షత్ర యోగ కరణాదులను విశేషములను పరదినమునందు జరుగు తిథి వార నక్షత్రయోగ కరణాదులను విశేషములను వినిపించెదరు. తరువాత శ్రీ స్వామివారికి పూర్వదినము నందు వచ్చిన ఆదాయమును నాణెముల వారిగా లెక్కలను వినిపించెదరు. పూర్తికాగానే గుడమిశ్రమగు తిలపిష్టము (నువ్వుపిండి) శ్రీవారికి నివేదనముజరిగి హారతి అయి జియ్యంగార్లకు అధికారులకు మర్యాదలు జరిగి గోష్ఠికి ఆ ప్రసాదము ఆ వినియోగము చేయబడును. తరువాత శ్రీస్వామివారు కొలువుచాలించి రాజమర్యాదలతో సన్నిధికి వేంచేయుదురు.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*