*భగవద్గీత - అంతరార్ధ విశ్లేషణ*" - 6వ భాగము.

P Madhav Kumar


భగవద్గీత ఎప్పుడో ఐదువేల సంవత్సరముల ముందు జరిగిన శ్రీకృష్ణార్జున సంవాదమని, ప్రస్తుత కాలమునకు అది సరితూగదని భావించేవారు చాలామంది వున్నారు. కాలము గడచినా, యుగాలు మారినా మానవ నైజాము మారలేదు కాబట్టీ గీతాబోధ ఎప్పటికీ ఆచరణీయమే!!


ఎందుచేతనంటే మానవుడు ఏ యుగంలో పుట్టినప్పటికీ తనలో యున్న ఇంద్రియములు, మనస్సు, బుద్ధి యొక్క వికారములు మారలేదు. వీటి వికారముల వలన తనలో నున్న అఖండమైన ఆత్మశక్తిని కనుగొనలేక వివిధ కర్మలు చేస్తూ వాటి ఫలములు పొందుతూ, సుఖదుఃఖములను అనుభవిస్తూ, తుదకు మరణించి మరల జన్మించి ఈ భవసాగరంలో కొట్టుమిట్టాడుతున్నాడు. 


అలాకాకుండా ఈ జన్మకర్మల తత్వమును పూర్తిగా అర్ధంచేసుకుని తదనుగుణంగా జీవించువాడు మరణానంతరము తిరిగి జన్మనెత్తడు. అది ఎలా సాధ్యమో చెబుతుంది భగవద్గీత. దీనికి కులమత సాంప్రదాయాలతో పనిలేదు. మానవులందరికీ ఉపయోగపడు సత్యాన్ని బోధిస్తుంది.


గీత కేవలం కృష్ణార్జున సంవాదమే కాదు. అది మానవులందరి హృదయమున నిరంతరము జరుగు సంభాషణ. జీవాత్మకు, పరమాత్మకు నిత్యమూ జరుగు సంవాదము. 


జీవునికి, భగవంతుడికి ఉపాధికి సంబంధించిన అనేక భేదములు యున్నప్పటికీ "చైతన్యాంశ" మాత్రము యిరువురుకి సమానమే కావునా జీవేశ్వరులిరువురును ఒకటేయని "అయమాత్మాబ్రహ్మ", "తత్వమసి" అనెడి మహావాక్యములు బోధిస్తున్నాయి. అన్ని శాస్త్రముల సారాంశమే భగవద్గీత. 


శంకరాచార్యులవారిని, వారి శిష్యులు దేనిని గానంచేస్తే జ్ఞానం సిద్ధిస్తుంది? అని ప్రశ్నించినప్పుడు, "గేయం గీతా నామసహస్రం" అంటే "భగవద్గీతను, విష్ణుసహస్రనామములను గానము చేయమని" సమాధానమిచ్చారు. జ్ఞానాన్ని ప్రభోదించడమే గీత ముఖ్యోద్దేశం. 


ఆకాశమున ఎగురుటకు పక్షులకు ఎలాగైతే రెండురెక్కలు కావాలో అలాగే మానవులు పరమాత్మను చేరుటకు కర్మ-జ్ఞానములు అవసరము. ఇకమీదట "కర్మ అంటే నిష్కామకర్మ" అనే భావించాలి. దానివలనే జ్ఞానము ఉదయిస్తుంది. 


జ్ఞానము పరిపక్వతజెంది సమాధి స్థితి కలిగినప్పుడు కర్మలతో పనిలేదు. కొందరు లోకకల్యాణం కొరకు కర్మలు చేస్తారు, కొందరు చేయరు. వారు కర్మని అకర్మగా, అకర్మని కర్మగా భావిస్తారు. అంటే వారు చేసే కర్మలు అసంగముగా చేస్తారు కావునా కర్మబంధము యుండదు.


నిష్కామకర్మ ద్వారా చిత్తశుద్ధి కలిగి జ్ఞానోదయమైన పిమ్మట సాధకుడు క్రమముగా ద్వైతమును (రెండుగా భావించుట, జీవాత్మను-పరమాత్మను వేరుగా భావించుట) వీడి, అద్వైతమును (అంతా ఒకటే, జీవాత్మ-పరమాత్మను ఒక్కటిగా భావించుట) అవలంబించుట జరుగుతుంది. ఈ విచారణాత్మకమైన సాధన మనుజుని జీవన్ముక్తునిగా (జీవించియుండగా ముక్తిని పొందడం) చేస్తుంది. 


మానవుడు సహజంగా పొందిన ఎరుకను, జ్ఞానముగా మార్చు ప్రక్రియనే జ్ఞానయోగమని, గీతలో పేర్కొన్నాడు శ్రీకృష్ణపరమాత్మ. నాకు ఆత్మీయ స్నేహితుడైన నీకు ఈ సనాతనమైన జ్ఞానయోగాన్ని వివరిస్తానని శ్రీకృష్ణుడు, పార్దునితో చెప్పడము మొదలుపెట్టాడు.

✍️శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి).

తదుపరి భాగంలో మళ్ళీ కలుసుకుందాము...🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat