అయ్యప్ప సర్వస్వం - 50 *స్వామి దర్శనమునకు అర్హతలు - 4*

P Madhav Kumar


*స్వామి దర్శనమునకు అర్హతలు - 4*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*సేవా మానసము - త్యాగము*


వ్రత ఆరంభము మొదలు సర్వవేళలయందు సర్వ ప్రాణికోట్లకూ తన , పర బేధము లేక శత్రు మిత్ర బేధము లేక సేవ చేయగల మనస్సు కలిగి యుండవలెను. ఈ సేవ దయార్ద్రహృదయముతో కూడినదై ఏ మాత్రమూ ధనము తీసుకోక ఉచితముగా చేయబడవలెను. అప్పుడే దానికి ఫలితము. ఏ ఒకరికి ఏ ఒక చిన్న సహాయము చేయగల అవకాశము లభించిననూ అది మన భాగ్యమే అని భావించుకొన వలయును. సేవ చేయుచున్నది సామాన్యమైన మానవమాత్రులకి అని భావించక సాక్షాత్ శ్రీ అయ్యప్పస్వామికే సేవ చేయుచున్నామని భావించుకొని పవిత్ర హృదయముతో చేయవలెను. ఇట్టిసేవా మానసము కలిగి యుండవలెనన్న ఆతనిలో తప్పక త్యాగ గుణము ఉండియే తీరవలయును. సాక్షాత్ శ్రీ అయ్యప్పస్వామి వారే స్వసుఖమును త్యజించి అన్యాధీనులై , అన్యులయొక్క కుతంత్రములకు వశంవదులై జీవించి , సేవచేసి , క్రమేణా ఆ దాస్యము బాపుకొని సజ్జనప్రియులై లోక సేవ అనుష్ఠించిన కథను మనము విస్మరించరాదు. ఎవరికి ఏ సంకటము వచ్చిననూ మనము యథాశక్తి ఆదుకొన వలయును. తమ వలన అగు సహాయము చేసి , మనో వాక్కాయ , కర్మలా ఎట్టి సేవ చేయగల్గుదుమో అట్టి సేవచేసి తరించవలెను. ఇతరుల కష్టములను తమ కష్టముగా భావించుటయే మానవ ధర్మమన్న ఆర్యుల మాటను మరచి పోకూడదు. మనము మన సుఖమును మాత్రము చూచుకొనక అన్యుల సుఖముల కొరకై జీవించ వలయును. అదియే మన కర్తవ్యము. ఇదియే త్యాగము. ఫలితము ఆశించకుండా సేవ , త్యాగము చేసినచో అది ఉత్తమ త్యాగము. మనమూ అట్టి ఉత్తమ సేవ , త్యాగము చేసి తరింతుము గాక.


*ధర్మము*


ధర్మ , అర్ధ , కామ , మోక్షములందు మొదట ధర్మమునకే ప్రాధాన్యత నిచ్చిరి మన పెద్దలు. ధర్మమనగా నేమి ? ధర్మము ఇట్టిదని నిర్వచించుట కష్టమే. పైన చెప్పబడిన బ్రహ్మచర్యము , క్షమాశీలత , దయ , అహింస , సేవ మొదలగు గుణములు కలిగి వ్రతదీక్ష ముగించి , స్వామిని కొలిచి తరించుటయే వారి ధర్మము. ధర్మము అనగా వారి వారికి విధించబడిన కర్తవ్యమును ఏమరుపాటు , ఫలాపేక్ష లేకుండా నిర్వహించుటయే వారి వారి ధర్మమని ధర్మమునకు ఒక విధముగా అర్థము చెప్పుకొనవచ్చును. అయ్యప్పస్వామి భక్తులు సర్వ భూతములయందునూ ద్వేష భావము లేకుండుటయే గాక దయాసుహృద్భావములు కలిగియుండుట ధర్మము. సదా సంతుష్టి కలిగి మనో నిగ్రహముతో జీవిత లక్ష్యమును గూర్చి ధృఢనిశ్చయము గలవాడై మనో , బుద్ధులను , ధన , మాన , ప్రాణములను స్వామి కర్పించుటయే ధర్మము. తన వలన లోకమునకు గాని, లోకమువలన తనకుగాని ఎట్టి భయము కలుగకుండా యుండునట్లు నడచు కొనుటయే అయ్యప్ప భక్తుని ధర్మము. భయోద్రేకములు లేక నిరపేక్షుడై , శుచియై కార్యదక్షుడై , ప్రాప్తా ప్రాప్తములయందు ఉదాశీనుడై , నిశ్ఛితుడై , సర్వమును స్వామి చరణారవిందముల యందు సమర్పించి జీవితము నడుపుకొనుటయే ధర్మము.


బాహ్యశౌచము అనగా ఇంటిని , పరిసరములను , ఇంటి యందలి వస్తువులను , దుస్తులను , శరీరమును పరిశుభ్రముగా నుంచుకొని స్వామిని అర్చించుట స్వామి భక్తుని ధర్మము. అట్లే ఆంతరంగిక శౌచము అనగా మనస్సులో దుష్ట సంకల్పములకు తావీయక శుద్ధ భావనతో నుండుట , స్వామియందే మనస్సు నిలుపుకొని యుండుట స్వామి భక్తుని ధర్మము. భక్తుడు శారీరక , మానసిక పారిశుద్ధ్యము ఎంత అలవరచుకొనునో అతడు అంతంత దైవత్వమును సంపాదించుకుని భగవంతునికి దగ్గర అగును. ఎంత మాలిన్యముగా నుండునో దేవుని కంత దూరమగును. వాక్పౌరుష్యము కూడా మనో మాలిన్యమును సూచించును. కాన వాక్ శౌచము కూడా అత్యంతావశ్యకము. ఇప్పటివారు ప్రస్తుతం వారి వారి యొక్క బాహ్య ఆంతరంగిక శౌచమును వదులుకుని , కులముల ప్రాతిపదికగా అస్పృశ్యతను పాటించుచున్నారు. కాని ఇది అభిలషణీయము కాదు. ముందే వివరించి చెప్పినట్లు కుల , మత విచక్షణ లేనిదియే స్వామి యొక్క మతము, ధర్మము. ఇట్లు బాహ్య , ఆంతరంగిక శౌచములను సాధించినవాడై , ఎటువంటి రాగద్వేషములూ లేక , సుఖ దుఃఖ ద్వంద్వములకు వశుడుగాక , స్వామి చరణాల సన్నిధిన తన పుణ్యపాప కర్మల రెండింటినీ సన్యసించిన వాడే స్వామి భక్తుడు. అదియే అతని ధర్మము. భగవంతుడు మన పూర్వజన్మ కర్మాను సారము దేనిని ప్రసాదించిననూ అది అంతయూ మన మేలు కొరకే అను భావము కలిగిన స్థిరచిత్తునకు ఆతని భావములు కార్యములు అన్నియూ ధర్మపూరితములే. ఆతడు ఏ శుభా శుభములను కాంక్షించడు. వగచడు. అదియే అతని ధర్మము.


మొత్తం మీద మనకు అర్ధమయ్యెడి ధర్మమనగా స్వామి భక్తుడు మానావమానములు , శీతోష్ణములు , సుఖదుఃఖములు , నిందా స్తోత్రములు మొదలగు ద్వంద్వముల యందు సమబుద్ధి కలిగి, ఈ లౌకిక విషయములందు సంగమము లేక , ఆసక్తిని వీడి , యదృచ్చా లాభ సంతుష్టుడై , మౌనియై , క్షమాశీలుడై , బ్రహ్మచర్య వ్రతావలంబుడై , అహింసా వ్రతమును చక్కగా పాటించినవాడై , దయా హృదయము కలవాడై , స్వామి ఇష్టమైన కార్యములను స్వామి భక్తుల హృదయముల మెప్పించే చేతలు కలవాడై , మనఃశుద్ధి , లేక చిత్తశుద్ధి కలిగి , తన ధన సంపాదనలో ఆరవ వంతు అయినా సాధువులకు , బీదలకు దాన ధర్మాదులు చేయుచూ , అన్నదానము చేయుచూ , సర్వమునూ స్వామి పాదర్పణము చేసుకొని జీవితమును గడుపుటయే స్వామి భక్తులు ధర్మము. ఈ విధముగా ధర్మ బద్దముగా వ్రతదీక్ష కొనసాగించిన స్వామి భక్తునకు ధర్మశాస్తా అయిన అయ్యప్పస్వామి యొక్క ఆనుగ్రహము నిశ్చయముగా లభించును.


*కర్తవ్య నిష్ఠ*


స్వామి భక్తులు తమ కర్తవ్యమేదో ఎల్లప్పుడు జ్ఞప్తి యందుంచుకొనే మెలగ వలయును. మనము ఎందుకొరకై మాలధరించి వ్రత దీక్షబూని శరణములు పలుకుచూ , ప్రత్యేక వేషధారులమై యున్నాము అను విషయము ఎప్పుడూ మరచిపోక స్వచింతన కలిగి యుండ వలయును. మనము మనయొక్క సుఖములను , కష్టములను , బాధ లను , మన జీవితమును స్వామి సన్నిధానమందు సమర్పించుట కొరకే వ్రతదీక్ష చేపట్టి మాలధరించి , ఇరుముడి మోసి శబరిగిరి యాత్ర చేయునది. మాల ధరించిన క్షణము మొదలుకొని మనము మన యొక్క ప్రవృత్తులను సన్మార్గమున మలచుకొని , కర్తవ్య నిష్ఠులము కావలెను. ఉషఃకాలము చేయవలసిన స్నానము సాయంత్రము చేయ వచ్చులే అనియూ , ఒకపూటనే ఆహారము స్వీకరించవలసి యుండగా పలు వేళలైనా తప్పు లేదనియూ , ఈ వేళ ఏదోపని ఉన్నది గనుక శరణములు పలుకుట , స్వామిపూజ చేయుట రేపు చేయవచ్చులే అనియూ ఇట్లు అనేక విషయములలో అనేక విధముల నిర్లక్ష్యముగా యుండుట స్వామి పట్ల నేరము చేసినట్లగును. ఆయా సమయము లందు చేయవలసిన పని ఆయా సమయములందే చేయవలయునన్న కర్తవ్యము విస్మరించరాదు. ఈ దినము చేయవలసిన కార్యము రేపటికి పొడిగించుట , రేపు ఏదో కుదరదు కనుక రేపటి కర్తవ్యము కూడా ఈ రోజే ఎలాగైననూ చేసి ముగించుట ఇవన్నియూ సోమరుల లక్షణమగును. అటువంటి ప్రవర్తనను పూర్తిగా మార్చుకుని ఆనాదినుండి వ్రతకాలము నందు పెద్దలు ఏర్పరచియున్న ఏ ఒక్క నిబంధననూ ఆచరణలో లోపము రానీయకుండా పాటించుట , ఏ నిష్ఠనూ విఘ్నము లేక నిర్వహించుట , సంపూర్ణ వ్రతనిష్ఠ ఆత్మార్పణముగా చేసి స్వామి దర్శనము చేసికొని వచ్చుట స్వామి భక్తునియొక్క సంపూర్ణ కర్తవ్యము. తన విధ్యుక్త ధర్మమును చక్కగా నిర్వహించిన వానిని కర్తవ్య పరాయణుడైన శ్రీ అయ్యప్పస్వామి ఎల్లవేళలా కాపాడుచుండును. మాలవేసికొనినంతనే మన కర్తవ్యం తీరిపోయినది అని అనుకొనక ఇట్లు అనేక మానవతా ధర్మములను పాటించుచూ , మానవుడు మాధవుడు కాగలడని నిరూపించుచూ అయ్యప్ప స్వాములు వ్రత మాచరించి చూపుచూ ఇతరులకు ఆదర్శవంతులు కావలయును.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat