*భగవద్గీత - అంతరార్ధ విశ్లేషణ*" - 19వ భాగము.

P Madhav Kumar

తవరకు జరిగిన శ్రీకృష్ణార్జున సంవాదాన్ని పరిశీలిస్తే, పరమాత్మను తెలుసుకొనుటకు మూడు ముఖ్య మార్గములను అర్జునునికి సూచించాడు జగద్గురువు.


1. కర్మయోగము : జీవుడు ఏ కర్మ చేసినను నిష్కామబుద్ధి(ఎటువంటి ఫలితములు ఆశించకుండా)తో చేయడం ద్వారా చిత్తశుద్ధి కలిగి జ్ఞానముదయిస్తుంది.

2. జ్ఞానయోగము : సమస్త జడజీవపదార్ధములయందు పరమాత్మ వున్నాడన్న వాస్తవాన్ని జ్ఞానముతో గ్రహించి దానిని విజ్ఞానపూర్వకంగా (అనుభవ జ్ఞానము/Practical Knowledge) ఆచరించాలి.

3. ధ్యానయోగము : విజ్ఞానముతో గ్రహించిన సత్యాన్ని నిరంతరము మననం చేసుకుంటూ అభ్యాసంతో ఆత్మజ్ఞానము పొందాలి.


పైన పేర్కొన్న మార్గములను ఆచరించడం అంత సులభము కాదు. కారణము ప్రతిఅడుగులో జీవుని "అహంభావము" అడ్డుతగులుతూవుంటుంది. ఈ అహం(నేను/నాది లేదా I/Me/Mine) అనే భావం పోవాలంటే జీవుడు ఏంచెయ్యాలన్న ప్రశ్న వేసాడు అర్జునుడు. దానికి సమాధానంగా "భక్తియోగమును" ప్రబోధించాడు జగద్గురువు.


భక్తి అంటే భగవంతునియందు మిక్కిలి ప్రీతి కలిగియుండటమే. చాలామంది అనుసరించేది ఈ మార్గమునే. ఇలా ప్రీతితో భగవంతుని ఆరాధించుటవలన, అతనికి "దాసోహం" అగుటవలన జీవుని అహంభావము క్రమక్రమముగా అంతరించును. ప్రారంభదశలో ఇది చాలా సులువైన పద్ధతి. దేవునియందు ప్రీతితో కొన్ని మంచికార్యములు చేయుటవలన స్వార్ధబుద్ధి తొలగును. అయితే ఈ కార్యములన్ని భగవంతునియెడ ప్రీతితో చేయవలెను తప్పా భయముతో, స్వార్ధముతో చేయకూడదు. 


ఈ రకంగా సాకారోపాసన(ఒక రూపం కలిగిన వస్తువును దేవునిగా భావించి ఆరాధించడము) శ్రద్ధతో ఆచరిస్తూ, దైవముపై పరిపూర్ణ విశ్వాసముతో, భగవంతునికి యిష్టమైన కర్మలు ఆచరిస్తే ఉత్తమ ఫలితములు పొందవచ్చును. సాకారమైన లేదా నిరాకారమైన, సగుణమైనా లేదా నిర్గుణమైనా, కావలసింది శ్రద్ధాభక్తులు మాత్రమే. 


ఇటువంటి శ్రద్ధాభక్తులతో కూడిన ఉపాసనతో క్రమముగా చిత్తశుద్ధి ఏర్పడి నిర్గుణోపాసనకు కావలసిన వివేకము, విచారణాబలము జీవునికి లభిస్తుంది. "దాసోహం"తో ప్రారంభమైన ప్రక్రియ "సోహం" అనే ఉన్నతస్థితికి చేరుకుంటుంది. 


అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు ధూపదీపనైవేద్యాది ఉపచారముల గురించి ప్రస్తావించలేదు. కేవలము మనోనిగ్రహము, సత్యశోధన, భూతదయ, పరమాత్మ తత్వము, ఆత్మజ్ఞానము గురించి మాత్రమే ప్రబోధించడము జరిగింది. తెలివితేటలు, కుల, జాతి, మత ప్రస్తావన భగవద్గీతలో కనపడదు.


ఇంద్రియనిగ్రహము, సర్వభూతదయ, శాంతి, క్షమ, తపము, ధ్యానము, సత్యము, జీవధర్మము అనే విషయాలను మాత్రమే ప్రస్తావిస్తుంది గీత. వీటిద్వారానే పరమాత్మ అవగతమౌతాడు.


భక్తి యొక్క విశిష్ఠతను, ఉన్నత స్థితులను తదుపరి భాగములో పరిశీలిద్దాము... 🪷                                                       🪷⚛️✡️🕉️🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat