బాహ్య పుష్పములతో భగవంతుని విగ్రహాలను పూజించు ప్రక్రియతో ఆరంభమైన భక్తి క్రమముగా మనస్సనే పుష్పమును పరమాత్మకు అర్పించే స్థితికి చేరుకోవాలన్నదే భక్తియోగము యొక్క ముఖ్యవుద్దేశము. కేవలం విగ్రహాలలో మాత్రమేవున్నాడన్న ఆలోచనను వీడి, సకలచరాచర సృష్టిలో పరమాత్మను దర్శించడాన్నే పరాభక్తి లేక విశేషభక్తి అంటారు.
భగవంతుడు సృష్టించిన వస్తువులను తిరిగి అతనికి సమర్పించుటకన్నా, జీవుడు తన ప్రయత్నంతో శుద్ధిచేసుకున్న తన మనస్సును పరమాత్మకు సమర్పించవలెనని శ్రీకృష్ణుని బోధ. బాహ్యపువ్వులు కొంతకాలానికి వాడిపోతాయి, కానీ పరాపూజయందు వాడే ఇంద్రియనిగ్రహము, సర్వభూతదయ, అహింస, క్షమాగుణము, శాంతి, తపము, సత్యము, ధ్యానము అనే ఎనిమిది పువ్వులు ఎన్నటికీ వాడకపోగా రానురాను వికసించుచూ ఆత్మజ్ఞానమును కలుగచేస్తాయి.
ఈ అనన్య భక్తిమార్గము ద్వారా మనస్సును ఆధీనపరచుకొని దానిని ఆత్మయందు ప్రతిష్టించే సాధన చెయ్యాలి. అప్పుడు చిత్తము తన రూపమును కోల్పోయి చైతన్యాత్మగా ప్రకాశిస్తుంది. ఎందుచేతనంటే మోక్షము అనునది మనస్సుకే కానీ ఆత్మకు కాదు. జీవుని బంధ, మోక్షములతో ఆత్మకు ఎలాంటి సంబంధంలేదు. పునర్జన్మరహిత స్థితిని పొందాలంటే ఆత్మ తన నిజస్థానమైన పరమాత్మను చేరాలి.
ఆత్మ ఎప్పుడూ శుద్ధిగానే వుంటుంది. అది ఆత్మ లక్షణము. శుద్ధి చేయవలసిందల్లా మనస్సునే. ఆత్మవలే మనస్సు కూడా ఎప్పుడు శుద్ధి పొందుతుందో, జీవునికి అప్పుడు కైవల్యపదవి సిద్ధిస్తుంది. భక్తియోగము ద్వారా దీనిని సాధించవచ్చు.
జీవుడు శుద్ధత్యముతోనే జన్మిస్తాడు కాబట్టి మరణించేటప్పుడు కూడా శుద్ధత్యముతోనే మరణించాలి. ఈ మధ్యలో మాయ(అజ్ఞానము) వలనగాని, పూర్వజన్మ వాసనలు వలనగాని, జీవునికి ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు కలిగినా ఈ శుద్ధత్యమును పొందాలి. ఇదే జీవుడు సాధించవలసిన అంతిమ లక్ష్యము.
భగవంతునియెడ అనన్యభక్తితో ఇది అతి సులభంగా సాధ్యపడుతుంది. దీనికి ప్రగాఢ విశ్వాసము, సహనము(శ్రద్ధ - సబూరి) కావాలి. ఇదే విషయాన్ని సద్గురు సాయినాధులవారు తరచుగా తన భక్తులకు బోధిస్తుండేవారు. పట్టు వదలకుండా భగవంతుని పాదాలను పట్టుకోవాలి. ఇక చేసేదిలేక ఆ భక్తుడికి, భగవంతుడు చేయూతనిచ్చి, పైకిలేపి తనలో కలుపుకుంటాడు.
ఈ భక్తి మార్గమే అన్ని మార్గములకన్నా చాల సులువైన మార్గమని జగద్గురువు అర్జునునికి ఉపదేశించాడు.
ఇంకొన్ని విశేషాలను వచ్చే భాగంలో పరిశీలిద్దాము...🪷 🪷⚛️✡️🕉️🌹