*2.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు*
*🌻20. గోకులాష్టమీ ఆస్థానోత్సవము🌻*
🍃🌹చరమపురుషార్ధ ప్రధానచతురుడై శ్రీవేంకట మహీధరమునందు అర్చావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధానమున ప్రతి సంవత్సరము శ్రావణ బహుళ అష్టమి శుభవాసరమున గీతా ప్రదాతయగు శ్రీ కృష్ణస్వామివారికి ఆస్థానము జరుగును.
🍃🌹ఈ దినమున సాయంకాలము శ్రీ కృష్ణస్వామివారు శ్రీవారి సువర్ణద్వారము ముందుసర్వభూపాల వాహనములో వేంచేసెదరు. అచ్చట శ్రీ కృష్ణస్వామివారు రత్నాభరణములతోను, కౌశేయములతోను పుష్పసరములతోను, అతిమనోహరముగా అలంకరింపబడెదరు. వెంటనే శ్రీవారికి ఆరాధనము, ఆస్థాన తళిగలు నివేదనము జరుగును. పిమ్మట జియ్యంగారువారికి మర్యాద జరిగి ప్రబంధ శాత్తు మొర జరుగును.
🍃🌹వెంటనే ఆరాధకులకు మర్యాదలు జరిగి శ్రీవారికి అక్షతారోపణము జరుగును. ఆరాధకులు శ్రీవారి పాదారవిం దములయందుంచిన శ్రీభాగవతమును పౌరాణికులకిచ్చెదరు. వారు శ్రీకృష్ణావతార మట్టమును అతిమనోహరముగా ఆస్థానమందు ఏకాగ్రచిత్తముతో శ్రీకృష్ణ ధ్యానము చేయుచున్న భక్తజనము ఆనందము నొంద పురాణ కాలక్షేపము చేయుదురు. తరువాత పౌరాణికులకు మర్యాదలు జరుగును. తరువాత శ్రీవార్లకు హారతులు జరిగి శ్రీ జియ్యంగార్లకు సర్కారుకు మర్యాదలు జరుగును.
🍃🌹వెంటనే స్థానబహుమాన పూర్వకముగా ప్రసాదములు పణ్యారములు గోష్ఠికి వినియోగము జరుగును. తరువాత శ్రీ స్వామి వారు సన్నిధికి వేంచేయుదురు. తరువాత పౌరాణికులును మర్యాదలతో విడిదికి వెళ్లెదరు.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*