‘నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా’
నవచంపకము అంటే అప్పుడే విరిసిన సంపంగిపువ్వు. వశిన్యాది దేవతలు అమ్మవారి ముక్కుని నవచంపకము అని పోల్చారు. లోకములోని ముక్కులన్నీ వాసన చూడటానికి పనికి వస్తాయి. అమ్మవారి శరీరము, జుట్టు దగ్గరనుంచీ అన్నీ పరిమళములు కలిగి ఉంటాయి. ఈ నామము చాలా గొప్ప నామము. వాసన అన్న దానిని పక్కన పెడితే ముక్కు ఊపిరికి చిహ్నము. ముక్కు ఊపిరిని తీసి మళ్ళీ వదలకపోతే ప్రమాదము వచ్చేసిందని గుర్తు. చేసిన కర్మలకు ఆధారముగా ఈశ్వరుడు శరీరము ఇస్తాడు. ఆఖరి ఊపిరినాడు ఏమి చేసాడు అన్నదానిబట్టి పునర్జన్మ ఉంటుంది. ఏ భాష్యమైనా అదే చెపుతున్నది. ఏ ఉపాధిలో ఉన్నా భక్తిని అనుగ్రహిస్తాడు. భక్తి ఉంటే ఆయన మోక్షమును కూడా అనుగ్రహిస్తాడు. ఒక సాలె పురుగుకి, పాముకి, ఏనుగుకి ఇచ్చాడు. పునర్జన్మను ఫలానాదిగా పుట్టించమని అంటే తనకు సంబంధము లేదని చెపుతాడు. మళ్ళీ మంచిజన్మలోకి దేనివలన వెడతారు బ్రతికి ఉండగా చేసిన కర్మానుష్టానములోమనసు ఎంత రంజిల్లినదని చూస్తారు. జాగరూకత కలిగి దీపము ఉండగా ఇల్లు చక్కపెట్టుకున్నట్టుగా ఈశ్వరోపాసన ఎక్కువ చేసుకోవలిసి ఉంటుంది.
అమ్మవారు ఎప్పుడైనా ఒక రూపము తీసుకుంటే కర్మకొరకు తీసుకోదు. ఒకనాడు దక్షప్రజాపతి కోరుకుంటే ఆయనకు కూతురిగా పుట్టి దాక్షాయిణి అని పేరు పెట్టుకున్నది. అలా పెట్టుకోవడము వలన కీర్తి తండ్రయిన దక్షప్రజాపతికి దక్కింది. నిరీశ్వర యాగము చేస్తూ, శివుడిపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే శివుని రుద్రుని చెయ్యగలనని నిరూపించడానికి శరీరము వదిలి పెట్టింది. శివుడు వీరభద్రుని సృష్టించాడు. దక్షయజ్ఞం సర్వనాశనము అయిపోయింది. యజ్ఞము ఆగిపోయిందని ఏడిస్తే దక్షునికి మేకతల పెట్టి యజ్ఞము పూర్తిచేసారు. అమ్మవారి ముక్కు వేరొక చోట ఊపిరి పోసుకున్నది. నిజానికి ఆవిడకు పుట్టుక, ఊపిరి ఆగడము లేదు. ఒక ప్రయోజనము కోసము శరీరము తీసుకున్నది.
ఒకనాడు మేనకాదేవి హిమాలయ పర్వతముల మీద తిరుగుతున్నది. అక్కడ పార్వతీపరమేశ్వరులు విహారము చేస్తున్నారు. పార్వతీదేవి అందచందములను చూసి మేనకాదేవి ఇటువంటి కుమార్తె నాకు ఉంటే అనుకున్నది. మనస్ఫూర్తిగా కోరుకుంటే అమ్మవారు ఇచ్చేస్తుంది. దాక్షాయణిగా శరీరము వదిలి హైమవతిగా పర్వతరాజు పుత్రిక పార్వతిగా వస్తాను అన్నది. ఆవిడ ఎక్కడ పుడితే అక్కడ వారి జీవితములు ధన్యము. ఊపిరికి ముక్కును సంకేతిస్తాము. వాసన ఊపిరికి అంతర్గతము. వాసన – ఊపిరి రెంటినీ ఏకీకృతముగానే సంకేతిస్తాము. పరమేశ్వరుడు ఇన్ని ఊపిరులని లెక్క కట్టి ఇస్తాడు. ముక్కు ఆయుర్దాయములను నిర్ణయించగల చిహ్నం. అమ్మవారు కూడా ఊపిరితీస్తుంది, విడచి పెడుతుంది. అవి ఆవిడ ఆయుర్దాయమునకు సూచనలు కావు. అమ్మవారి ఊపిరియే శృతి – వేదము. ఆమె ముక్కువంక చూసి నమస్కారము చేస్తే ఎక్కడ గాడితప్పితే అక్కడ దిద్దుబాటు చేస్తుంది. అదంతా ముక్కుకి సంబంధించిన గొప్పతనము. అమ్మవారి ముక్కుని సంపంగి పువ్వుతోనే ఎందుకు పోల్చారు? అనగా సంస్కృతములో తుమ్మెదను షట్పదము అంటారు అనగా ఆరుకాళ్ళున్నదని అర్థము. పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, మనసు ఈ ఆరింటితోటి అన్ని సుఖములు అనుభవించి సంసారములో మగ్నులమై ఆ పువ్వుమీదనుంచి ఈ పువ్వుమీదకి, ఈ పువ్వుమీదనుంచి ఆ పువ్వుమీదకు వాలుతూ తేనె త్రాగి బ్రతుకుతూ ఉంటాము. సంపంగిపువ్వు ఒక్కదాని మీద తుమ్మెద వాలదు. పంచ ఇంద్రియములు బహిర్ముఖము కాకుండా అంతర్ముఖమై భగవంతుని పాదములలో ఉండే మందారమకరంద పానముచేసి మత్తెక్కి ఉండే హృదయము కలిగిన మహాపురుషుడై జ్ఞానబోధ చేయకలిగిన అధికారము కలిగిన మహాపురుషుడు ఒక గొప్ప గురువు లోకములో పుట్టాలి అంటే అమ్మవారి నాసాదర్శనము తప్ప వేరొకమార్గము లేదు. అందుకని నవచంపకముతో పోలిక వేసి ఈ నామము చెప్పారు.🙏
J N RAO 🙏🙏🙏