*భగవద్గీత - అంతరార్ధ విశ్లేషణ*" - 22వ భాగము.

P Madhav Kumar


సంసారబాధ్యతలు స్వీకరిస్తూ, గృహస్థులుగా నున్న వారికి "అనన్యభక్తి" పొందుట సాధ్యమేనా? ఏ శాస్త్రమైన దీనికో ఉపాయం చెప్పిందా? అన్న ప్రశ్నలు చాలామందికి కలుగుతాయి. ఇందుకు "యోగవాశిష్టము" (వశిష్టమహర్షి - శ్రీరామచంద్రుల సంవాదము) సులువైన, ఆచరణయోగ్యమైన పద్ధతిని ప్రతిపాదించింది. ఇది మూడుదశలుగా విభజించబడింది.


తొలుత సామాన్య భక్తుడు, "అనన్యభక్తిని" సాధించేందుకు దృఢనిశ్చితుడై వుండాలి. 


ప్రాధమికదశ (1/2+1/4+1/4 formula) - ఒకే మనస్సును నాలుగు భాగాలుగా (పావు చొప్పున) విభజించి, రెండు భాగాలను సంసారబాధ్యతల నిర్వాహణకు(సంపాదన, తిండి, కుటుంబసభ్యుల పోషణ), ఒక భాగము పెద్దలద్వారా, గురువుద్వారా శాస్త్రము తెలుసుకొనుట యందు, ఒక భాగము దైవకార్యములందు వినియోగించాలి. ఈ రకమైన సాధనతో మనస్సు కొంత "పరిపక్వత" చెందుతుంది. 


మధ్యదశ (1/4+1/2+1/4 formula) - మనస్సు యొక్క నాలుగు భాగాలలో, ఒక భాగము అత్యవసర లోకవ్యవహారములు, శరీర, కుటుంబ నిర్వహణ యందు, రెండు భాగములు గురుసేవ, దైవచింతనల యందు, ఒక భాగము శాస్త్రవిచారణ యందు ఉపయోగించాలి. అంటే సంసార వ్యవహారములను కొద్దిగా తగ్గించుకొని తన శక్తిని, యుక్తిని భగవద్విచారణ యందు వాడుకోవాలి. ఈ రకమైన సాధన వలన మెల్లగా "విశేషభక్తి" అలబడుతుంది.


ఉత్తమదశ (1/2+1/2 formula) - మనస్సు యొక్క నాలుగు భాగాలలో, రెండు భాగాలను సత్యశోధన, వైరాగ్యములతో, మిగతా రెండు భాగాలను ఆత్మవిచారణ, ఆత్మధ్యానముతో నింపాలి. అంటే లౌకికవ్యవహారములనుండి పూర్తిగా బయటపడి పరమానందముతో, పరమార్ధచింతన యందు మనస్సును పూర్తిగా లగ్నం చేయాలి. ఈ సాధనతో క్రమంగా "అనన్యభక్తి" అలబడుతుంది. 


"అనన్యభక్తి" సాధించినవారికి "విశ్వరూపసందర్శన" భాగ్యము లభిస్తుంది. "సందర్శన" తో పాటు "ప్రవేశం" కూడా సిద్ధిస్తుంది. అంటే, పరమాత్మను తెలుసుకొనుట(జ్ఞాతుమ్), పరమాత్మను దర్శించుట(ద్రష్టుమ్), పరమాత్మలో లీనమగుట(ప్రవేష్టుమ్) సిద్ధిస్తుంది. ఇదే సాధకుని పారమార్ధిక క్రమవికాసము.


ఈ పారమార్ధిక క్రమవికాసాన్ని శాస్త్రపరంగా చెప్పాలంటే - 


ప్రాధమికదశ "ద్వైత స్థితి" లాంటిది. ఈ స్థితిలో భక్తుడు వేరు, భగవంతుడు వేరుగా వుంటూ, భక్తి ఏమాత్రం తగ్గకుండా కోనసాగుతుంది.


ఇక మధ్యదశ "విశిష్టాద్వైత స్థితి" లాంటిది. ఈ స్థితిలో భక్తుడు దేవునికి అతిసమీపంగా వచ్చి, అతనిని మనసా దర్శిస్తూ, మనసా భగవంతునితో ప్రత్యక్షంగా సంభాషించే స్థితికి చేరుకుంటాడు. తాను, పరమాత్మలో ఒక అంశముగా భావిస్తాడు.


ఇక ఉత్తమదశను "అద్వైత స్థితి" అంటారు. తీవ్రమైనసాధన వలన, భక్తియొక్క పరాకాష్ట వలన, జీవునికి ఆత్మజ్ఞానం సిద్ధించి, ఆత్మానుభూతి పొందుతాడు. ఆత్మ-పరమాత్మ ఒకటైపోతుంది. ఈ స్థితిలో జీవుడు సర్వదుఃఖముల నుండి విముక్తిపొంది, బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. క్రమంగా మానవుడు, మాధవునిగా మార్పుచెందుతాడు.


తదుపరి భాగంలో మళ్ళీ కలుసుకుందాము...🪷                                                       🪷⚛️✡️🕉️🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat