*
- శాస్త్రి ఆత్రేయ
మనందరి తరపునా అర్జునుడు, కృష్ణా! సాకార(భగవంతునికి ఒక రూపం కల్పించి) ఉపాసన గొప్పదా? నిరాకార(భగవంతునికి ఒక రూపం కల్పించకుండా) ఉపాసన గొప్పదా? అని ప్రశ్నించేడు.
వెంటనే శ్రీకృష్ణుడు, అర్జునా! సాకారమైనా, నిరాకారమైనా, సగుణమైనా, నిర్గుణమైనా ఎవరైతే పరమాత్మను సంపూర్ణంగా విశ్వసించి, అత్యంత భక్తిశ్రద్ధలతో నిరంతరము దానినే ధ్యానిస్తూ వుంటారో వారే గొప్ప! అని ఠక్కున సమాధానమిచ్చేడు.
ఇది మనుజులందరికి సాధ్యమే. ఈ విషయంలో జాతి, కుల, మత, సాంప్రదాయములకు తావులేదు. పుణ్యాత్ముడు పాపాత్ముడు అన్న భేదభావం కూడాలేదు. సాధనే ముఖ్యం. నిజమైన భక్తునికి వుండవలసిన లక్షణములను వివరిస్తాను, శ్రద్ధగా విను.
ఎవడు, సమస్త జీవరాశులందు సమభావం కలిగియుండునో, అహంకారము లేకుండా వుండునో, సుఖదుఃఖములను ఒకేరీతిలో పరిగణించునో, ఓర్పుతో దృఢనిశ్చయంతో ఎల్లప్పుడూ సంతృష్టుడై వుండునో, నిర్భయుడై వుండునో, దేనియందునూ కోరికలేక వుండునో, నిర్మలత్వం కలిగియుండునో, సమర్ధత కలిగియుండునో, ద్వందరూపములైన శుభాశుభములను త్యజించునో, లభించినదానితో సంతృష్టుడై వుండునో, నిందాస్తుతులందు సమభావం కలిగియుండునో, ఎల్లప్పుడూ స్థిరమైన బుద్ధి కలిగియుండునో అట్టివాడు భగవంతునికి అత్యంత ప్రియుడు.
ఎవరైతే మదిలో ఇంకో ఆలోచనలేక, భక్తివిశ్వాసాలతో నన్నే ఆశ్రయించునో, వారి యోగక్షేమములను నేనే స్వయంగా చూసుకుంటాను. ఆ జీవుడు చేసిన సర్వకర్మలను నేను స్వీకరించి మోక్షాన్ని ప్రసాదిస్తాను. ఇది నా వాగ్దానమని భరోసా ఇచ్చేడు భగవానుడైన శ్రీకృష్ణుడు. కాబట్టీ ముక్తి కావాలంటే భక్తి వుండాలి. భక్తి పొందాలంటే పై గుణములను అలవరచుకోవాలి.
భక్తి అలబడితే చేసే కర్మలలో, ఆలోచించే విధానంలో మార్పువస్తుంది. ఇందులో సంశయం లేదు. ఈ విషయాన్నే "శ్రద్ధ" మరియు "సబూరి" అన్న రెండు పదాలతో సులువుగా తేల్చేశారు సమర్ధ సద్గురువు శ్రీ సాయినాథుడు. అలానే పరమహంస రామకృష్ణులవారు, మనుజులు ఆధ్యాత్మికంగా ఉన్నతస్థితి చేరుటకు, నాలుగు అనుగ్రహములు పొందాలని బోధించారు - 1. భగవంతుని అనుగ్రహము, 2. గురుని అనుగ్రహము, 3. భక్తుల అనుగ్రహము, 4. తన సొంత అనుగ్రహము. మొదటిమూడింటిని పొందికూడా చివరిది లేకపోతే, అనన్యభక్తి పొందుట అత్యంత దుర్లభమని సూచించేరు.
ఈ భాగంతో భగద్గీతలోని రెండవ షట్కము (6వ అధ్యాయము నుండి 12వ అధ్యాయము వరకు) పూర్తయింది. దీనినే "భక్తిషట్కము" అని కూడా అంటారు. వచ్చే భాగంనుండి "జ్ఞానషట్కము" లోకి అడుగుపెడదాము..!! 🪷⚛️✡️🕉️🌹