అయ్యప్ప సర్వస్వం - 49 *స్వామి దర్శనమునకు అర్హతలు - 3*

P Madhav Kumar


*స్వామి దర్శనమునకు అర్హతలు - 3*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*మనఃశుధ్ధి - చిత్తశుద్ధి*


చిత్తశుద్ధిలేని శివపూజలేలరా ? అని యోగి వేమన సూటిగా ప్రశ్నించారు. అట్టి పూజ చేయుటవలన శ్రమ ఒక్కటియే మిగులును గాని అయ్యప్ప అనుగ్రహం మిగలదు. మరి చిత్తశుద్ధి ఎట్లు కలుగును ? అనేక పాపకృత్యములచేత పంకిలమైన ఈ మనస్సు , చిత్తమునకు ఈశ్వర ప్రణిదానము ఒక్కటియే శుద్ధిపరచు మార్గము. విషయ వాసనలు మరింత చిత్త విక్షేపము కలుగజేయునే కాని చిత్తశుద్ధిని కలుగజేయజాలవు , దుశ్చింతలతో చిత్తము మరింత మలినము కాకుండా మనము జాగ్రత్తపడవలెను. పరద్రోహ చింత , పరదారాగ మనము , చౌర్యము , విషయాశక్తి మొదలగు అనేక దుష్కృత్యములకు , దుష్ట తలంపులకు తావీయక ఎల్లప్పుడు పరమేశ్వర తత్త్వ విచారణ చేయుచూ , తన పొట్టకోసమై ఎటువంటి వృత్తిని నమ్ముకొని యున్ననూ మనస్సును మాత్రము పరమాత్మ పాదపద్మముల యందే నిలిపి , సజ్జన సంపర్కము చేయుచూ , సత్ప్రవృత్తులతోనే ఉదర పోషణము చేసికొనుచూ , సత్కాలక్షేపము , సద్గ్రంథ పఠనము చేయుచూ , విధించుకొనిన సమయములను మీరక శ్రీస్వామిసేవ చేసికొనుచూ ఆయన కథలనే వినుచూ , ఆయన కీర్తనలనే పాడుచూ , ఆయన నామమునే స్మరించుచూ , లిఖిస్తూ సర్వమనోప్రాణములను ఆయన చరణారవిందముల యందు సమర్పించిన చిత్తశుద్ధి కలుగక యుండునా ?  ఉండనే ఉండదు. *“సాధనమున పనులు సమకూరు ధరలోన", "అభ్యాసముచే మనస్సునకు వైరాగ్యము కల్గించవచ్చును"* అన్న మహాత్ముల వాక్యములు రిత్తపోవునా ? పోవు. చిత్తశుద్ధియే ఆత్మజ్ఞాన లాభమునకు అత్యంత దగ్గర మార్గము. ఈ క్షణము నుండే మన మనోమాలిన్యము కడిగివేయుటకు ప్రయత్నించుదము. లెండు. త్వరపడుడు.


*మితాహారము - అన్నదానము*


మితహారమే వ్రతానుష్టాన విధికి ఆలంబనము. అతిగా తిని ఎగబోసిననూ, అసలు ఆహారము తీసుకొనకున్ననూ , వ్రతమాచ రించుట కుదరదు. కావున వ్రతము ప్రారంభించిన క్షణమునుండి ఐననూ మితాహారమును స్వీకరించవలయునని నిబంధన ఏర్పర్చుకొనవలయును. కంటికి కనబడిన వన్నియునూ , చేతికి అందినవన్నియు ఈ ఉదరమున పడవేసి భుక్తాయాసముతో శరణములు పలుకలేక మరణమునకు దగ్గర పడకుండునట్లుగా యుండుటకు ప్రయత్నించవలెను. ఒకపూట భుజించినవాడు యోగి. రెండు పూటల భుజించువాడు భోగి , మూడు వేళల భుజించువాడు రోగి. మరి నాలుగు మాట్లు తినువాడు....... ఏమో. ఏమందురో ! ఆతడేమగునో ! కావున ఒకపూట ఆహార స్వీకరణతో తృప్తి చెందుట ఉత్తమలక్షణ మగును. ఆహార నియంత్రణ (Diet Control) ఉన్నచో శరీరము ధ్యాన పూజాదులకు మిక్కిలి సహకరించును. లేనిచో నిద్రాదేవినే వరించును. తాను స్వయముగా వండి తినినచో మిక్కిలి విశేషము. ఉత్తమము. మద్యమాంసాదుల యందు , మద్యపానాదులు యందు అణుమాత్రం ఆశక్తుడు కావలదు. ఒక్క పగటిపూట మధ్యాహ్న కాలమున తీసికొనెడి అన్న ఆహారము సరిపోకపోయినచో ప్రాతః కాలము నందు, అనగా ఉదయం వేళ , రాత్రివేళ యందు పాలు , పండ్లు తీసికొనవచ్చును. అంతకన్నా ఘనపదార్థమైనచో ముందే చెప్పినట్లు శరీరము మన స్వాధీనములో నుండక సోమరిపోతులుగా తయారు చేయును. అందుకే ఈ దీక్షలో మిగిలిన నియమాల నిబంధనలను ఒక్కొక్క మాటలో చెప్పేసి ఆహార నిబందనను మాత్రం ఆరువిధములా , నియమిత ఆహారం - పరిమిత ఆహారం - సాత్విక ఆహారం శాఖాహారం - సకాల ఆహారం - ధర్మార్జన ఆహారం అని విధించి యున్నారు. కావున ఆహార నియమము పాటించని దీక్ష నిష్ప్రయోజన మని నొక్కి వక్కాణించి చెప్పియున్నారు మన పెద్దలు.


ఇక మిక్కిలి శ్రద్ధతోను , దయార్ద్రహృదయముతోను భక్తితోనూ చేయవలసిన కార్యము అన్నదానము. వ్రతదీక్షా కాలమందు కనీసము ఒక రోజైననూ ఒక సాధువునకైననూ భోజనమిడుట ఆవశ్య కర్తవ్యము. ఒకవేళ అంతమాత్రముకూడా భోజనమిడు శక్తి లేకున్నచో , ఆహారము పెట్టగల స్థలమైననూ ఆకలిగొన్నవానికి చూపవలెను. అంతేకాని ఆకలిగొన్నవాడు వచ్చి *"భిక్షాందేహి"* అన్నచో లేదు అని చెప్పకూడదు. బంగారము , వెండి , వస్త్రము , వస్తువులు ఏవి దానంచేసిననూ ఏ ఒక్కరినీ తృప్తిపరచజాలము కాని భోజనము పెట్టి ఎంతటివారినైననూ తృప్తిపరచగలము. అన్నదానము చేయుటకు శక్తి కలిగిన వారు వారి వారి శక్త్యానుసారము ఒకరు - ముగ్గురు - ఏడుగురు - 9-11-21 31-101-1001 మందికి అన్నదానము చేసినచో ధర్మశాస్తాయైన శ్రీ అయ్యప్పస్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందుదురనుటలో ఏమాత్రమూ సంశయము లేదు.


*"అన్నదాన ప్రభువే శరణమయ్యప్పా"* అని శరణములు మాత్రమే పలుకుటలో ప్రయోజనము లేదు. అన్నదానము చేసి చూపించుటలోనే ఆత్మ తృప్తి యున్నది. *“అన్నదానాత్ పరం నాస్తి"* అను పెద్దల మాటలను నిజము చేయు విధముగా శబరిగిరికి మాల ధరించిన ప్రతిఒక్కరూ ఈ అన్నదాన కార్యక్రమములో ఉత్సాహముతో పాల్గొనవలయును. కుల , మత , పాటించనివారై , అందరూ ఏక పంక్తిన కూర్చుండి భోజనము చేయుట స్వామి వారికి మిక్కిలి ఇష్టమైన కార్యము. సమత్వ మంత్రము సంతతం వినబడు శబరీ గిరిమీద - సాహోదర్యము సముజ్జ్వలించును శబరీ గిరీమీద - సద్ధర్మమను శంఖము మ్రోగును శబరిగిరి మీద - సమస్త భాగ్యక్కారకుడైన అయ్యప్పా ! శరణం శరణం అయ్యప్ప అనునట్లు సర్వమతముల , కులముల సమానత్వమే శ్రీ అయ్యప్పస్వామి వారి ఏకైక లక్ష్యం.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat