*శ్రీదేవీభాగవతము - 50*

P Madhav Kumar



*చతుర్థ స్కంధము - 10*    

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 50*


*నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా!*

*దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........* 


*"శుక్రాచార్య తపోభంగానికి ఇంద్రుని ఎత్తుగడ"*

*మాయా శుక్రాచార్యుడు* చదువుకున్నాము.


*అమ్మ దయతో......*  ఈ రోజు

*"అరిషడ్వర్గాలకు అతీతులు లేరు"*  చదువుకుందాం.

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


🌈 *అరిషడ్వర్గాలకు అతీతులు లేరు* 💐


*జనమేజయా!* త్రిమూర్తులేమిటి, ఇంద్రబృహస్పతులేమిటి, దేహధారి అయితే చాలు ఎవరికైనా ఈ వికారాలు తప్పవు. విష్ణుమూర్తి రాగి. శివుడు రాగి. బ్రహ్మకూడా రాగసంయుతుడే. రాగవంతుడు చెయ్యని అకృత్యమంటూ ఏమి ఉంటుంది! కాకపోతే, చాతుర్యం ఉన్నవాడు పైకి విరాగిగా (జనకమహారాజులా) కనిపిస్తాడు.  గొప్పగా నటిస్తాడు. అయితే ఇది అట్టేకాలం సాగదు. సంకట పరిస్థితి వచ్చినప్పుడు అసలు రంగు బయటపడుతుంది. స్వగుణం వెల్లడి అవుతుంది. దాగదుకదా !


కారణరహితంగా కార్యం ఉండదనీ, కారణగుణాలు కార్యానికి సంక్రమిస్తాయనీ నీకు చాలాసార్లు చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను. బ్రహ్మాదుల ఉత్పత్తికి కారణమైన గుణాలు వారి ప్రవృత్తులలోనూ ప్రతిఫలిస్తాయి. దేహం ఉన్నంతవరకూ ఇది తప్పదు. అయితే - పరోపదేశవేళలో విస్పష్టంగా అందరూ శిష్టులే. తమదాకా వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కరూ కచ్చితంగా జారిపోతారు.


కామ క్రోధ లోభ ద్రోహ మాత్సర్యాహంకారాలను వదిలి పెట్టగలిగిన దేహధారి ఒక్కడూ నాకింతవరకూ కనిపించలేదు. ఈ సృష్టి, ఈ ప్రపంచం ఎప్పుడూ ఇలాగే ఉంది. మరోలా ఉండదు కూడా. అంతా శుభాశుభమయం కదా!


విష్ణుమూర్తినే చూడు. ఒక్కొక్కప్పుడు దారుణమైన తపస్సు చేస్తుంటాడు. మరొకప్పుడు వైకుంఠంలో లక్ష్మీదేవితో క్రీడిస్తుంటాడు. ఇంకొక్కప్పుడు రాక్షసులతో యుద్ధం చేస్తుంటాడు. కరుణాసింధువై లోకక్షేమంకోసం శరాఘాతాలూ తింటూ ఉంటాడు. జయాపజయాలు రుచిచూస్తుంటాడు. సుఖదుఃఖాలు అనుభవిస్తుంటాడు. ఒకప్పుడు శేషశయ్యపై హాయిగా నిద్రిస్తుంటాడు. సమయం వచ్చినప్పుడు తనంత తానే మేల్కొంటాడు.


ఇంద్రుడూ అంతే ఒకప్పుడు యజ్ఞాలు చేస్తూంటాడు. మరొకప్పుడు యుద్ధాలు చేస్తుంటాడు. శివుడు, బ్రహ్మ ఇంకా దేవతలూ మునులూ వీరందరూ తమ తమ ఆయుర్దాయం మేరకు ఆయా వినిర్మాణాల్లో సంచరిస్తూంటారు.  రాత్రి అయ్యేసరికి స్థావరజంగమాత్మకమైన ప్రపంచం చైతన్యాన్ని కోల్పోతుంది. సూర్యోదయంతో మేల్కొంటుంది. అల్లాగే బ్రహ్మాదులు కూడా తమ ఆయుష్షు తీరేసరికి నశిస్తారు. మళ్ళీ ప్రభవిస్తారు.


అందుచేత *"దేహధారులందరికీ కామాదిభావాలు సహజం. ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. పరమార్థాన్ని తెలుసుకుని ఈ కామక్రోధాలనుంచి విముక్తి పొందిన పురుషుడు ఈ సంసారంలో ఎక్కడా కనపడడు. అది చాలా దుర్లభం."* 


బృహస్పతి భార్యను చంద్రుడు స్వీకరించాడు. మళ్ళీ చంద్రుడినుంచి బృహస్పతి స్వీకరించాడు. 


*ఇలాగే ఈ సంసారచక్రంలో లోభమోహాదులకు లొంగిపోయి మునుగుతూ తేలుతూ ఉంటారు అందరూ. గృహస్థాశ్రమంలో ఉండి సర్వసంగ పరిత్యాగిగా విముక్తుడై స్వేచ్ఛగా సంచరించగలగడం అసంభవం. అందుచేత సకలప్రయత్నాలూ చేసి, సంసారం నిస్సారమని తెలుసుకుని, దాన్ని విడిచి పెట్టి, సచ్చిదానందరూపిణియైన జగజ్జననిని ఆరాధించడం ఉత్తమోత్తమం. ఈ జగత్తు అంతా ఆ మాయాశక్తితో ఆచ్ఛాదితమై ఉంది. ఉన్మత్తుడిలా మదిరాపానమత్తుడిలా నరుడు ఈ మాయలోపడి కొట్టుకుంటూ ఉంటాడు.*


ఈ మాయనుంచి బయటపడాలి అంటే ఆ మహామాయను ఆరాధించడమొక్కటే తరణోపాయం. మాయను సృష్టించినది ఆవిడే కనక దీని నుంచి విముక్తిని కలిగించవలసినదీ ఆవిడే. మరొక మార్గం లేదు. ఆవిడకు దయ కలిగేంతవరకూ మనం ఆరాధించవలసిందే. ఆవిడకన్నా దయామయులు లేరు. ఆ కరుణాసాగరాన్ని మాయామర్మంలేని భక్తితో ఆరాధిస్తే వెంటనే కరుణిస్తుంది. దుఃఖాలు తొలగి సుఖాలు కలుగుతాయి. జీవన్ముక్తి లభిస్తుంది. అతిదుర్లభమైన మానవజన్మను పొంది జగదీశ్వరిని సేవించుకోలేనివారు నిచ్చెన పై కొసనుంచి నేలకు రాలిపడ్డవారితో సమానం.


అహంకారావృతమై గుణత్రయసమన్వితమై అసత్య సంబద్ధమైన ఈ సంసారంనుంచి మరొక మార్గాన ముక్తి లభించడం కల్ల. అందుచేత అన్నింటినీ విడిచి పెట్టి అందరూ భువనేశ్వరిని అర్చించాలి.


వ్యాసుడు చేసిన ఈ ఉపదేశం జనమేజయుడికి నచ్చిందో లేదో కానీ మళ్ళీ కథలోకి వచ్చాడు.


శుక్రాచార్యుడి రూపం ధరించి రాక్షసుల మధ్యకు వెళ్ళిన బృహస్పతి ఏం చేశాడు? శుక్రుడు ఎప్పుడు తిరిగివచ్చాడు? ఏమి జరిగింది? ఆ వివరాలు చెప్పమని అర్థించాడు. వ్యాసుడు వివరించాడు.


*జనమేజయా!* బృహస్పతి శుక్రాచార్యుడి రూపం ధరించి వెళ్ళాడుగదా! రాక్షసులంతా నిజంగా గురువే అనుకున్నారు. అతడినే నమ్మి మంత్రోపదేశం కోసం కాళ్ళు పట్టుకున్నారు. లోభగుణం ఎవరినైనా ఎంతకైనా సమ్మోహితుల్ని చేస్తుందికదా! దానితో మోసపోయారు. బృహస్పతి ఏ మంత్రోపదేశమూ చెయ్యలేదు. కాలం గడుస్తోంది.


జయంతితో సంసారం పదేళ్ళ గడువు ముగింపుకి వచ్చింది. శుక్రాచార్యుడికి శిష్యులు జ్ఞాపకం వచ్చారు. ఆశగా నా రాకకోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉంటారుగదా అనుకున్నాడు. వెంటనే వెళ్ళి వాళ్ళను చూడాలి. పాపం, భయాతురులై ఇంతకాలం ఎలా గడిపారో! వాళ్ళు నా భక్తులు. వాళ్ళకి దేవతలవల్ల భయమనేదే ఇక ఉండకూడదు - అనుకున్నాడు. కర్తవ్యం గుర్తుకి వచ్చింది.


జయంతితో చెప్పాడు.


అందమైన కన్నులున్న ఓ చిన్నదానా! (చారులోచనే!) మన పదేళ్ళ గడువు పూర్తి అయ్యింది. నేను బయలుదేరుతున్నా. నా శిష్యుల్ని చూడాలి. త్వరలోనే తిరిగివస్తా. నీ దగ్గరికే వస్తా. జయంతి అంగీకరించింది. నీ ఇష్టం, వెళ్ళు అంది. ఇక్కడే నీకోసం ఎదురుచూస్తూ ఉంటా. ధర్మలోపం జరగనివ్వను. నిశ్శంకంగా వెళ్ళిరా.


జయంతి మాటలకు సంతోషించాడు శుక్రుడు. వెంటనే బయలుదేరాడు. హుటాహుటిని శిష్యుల్ని చేరుకున్నాడు. వారిని వారి ప్రక్కన బృహస్పతినీ చూశాడు. తన రూపం ధరించి బృహస్పతి తన శిష్యులకు వేదనిందాపరాలైన జైనధర్మాలను ఉపదేశిస్తున్నాడు. రాక్షసులారా! మీకు నిజం చెబుతున్నాను. హితం చెబుతున్నాను. అహింసా పరమో ధర్మః. అందుకని ఎంతటి ఆతతాయిలనైనా సరే చంపకూడదు. యజ్ఞయాగాలలో పశుహింస చెయ్యవచ్చని వేదాలు చెప్పేమాట కేవలం భోగపరాయణులైన బ్రాహ్మణులు కల్పించినది. దాన్ని నమ్మకండి. అహింసయే ఉత్తమోత్తమ ధర్మం - ఇలాంటి సూక్తులను ప్రబోధిస్తున్నాడు శుక్రరూపధారి బృహస్పతి. ఆ రూపానికీ ఆ ఉపదేశానికి ఆశ్చర్యపోయాడు (రాక్షసగురువు) ఆ భృగుపుత్రుడు.


వీడు దేవగురువు బృహస్పతి. నా ప్రథమ శత్రువు. నా రూపంలో వచ్చి నా శిష్యులను వంచించాడు. ఛీ ఛీ! లోభ గుణం ఎంత చెడ్డది! ఎంతటి అకృత్యాన్నైనా చేయిస్తుంది. నిజానికి నరకద్వారం ఇదే. దీని ప్రేరణకు లొంగి గురువుకూడా పాపచింతాపరుడై అనృతాలు పలుకుతాడు.


దేవతలకు గురువై ధర్మశాస్త్ర ప్రవర్తకుడైన బృహస్పతి ఇలా పరరూపధారణ చేసి పరప్రతారణకు {పరవంచన) పూనుకున్నాడంటే, పాషండమతాన్ని ప్రబోధిస్తున్నాడంటే, లోభంతో మనస్సు కలుషితమైనవాడు ఎంతకైనా దిగజారతాడు, ఏమైనా చేస్తాడు అన్నమాటేకదా! (వేదప్రామాణ్యాన్ని అంగీకరించని మతాలను పాషండ మతాలు అంటారు). శైలూషుడిలా (నటుడు) నా వేషం ధరించి నా శిష్యుల్నే నమ్మించి వంచించాడంటే నన్ను వంచించినట్టే. ఔరా! ఎంతటి నేర్పరి! 


*(అధ్యాయం - 13, శ్లోకాలు - 62)*


*(రేపు.... "రాక్షసులకు శుక్రాచార్యుడి శాపం" )*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat