_*అయ్యప్ప సర్వస్వం - 69*_*యుగాతీతుడు అయ్యప్ప - 3*

P Madhav Kumar



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*యుగాతీతుడు అయ్యప్ప - 3*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️



తన కర్తవ్యాచరణకు అడ్డుపడిన లీలావతిని మహిషియై పొమ్మని దత్తుడు శపించెను. పరాశక్తి అంశయైన లీలావతి *"నేను మహిషి అయినచో నీవు మహిష మౌదుగాక"* యని మరుశాపమిచ్చెను. రంబాసురుడు , కరంబాసురుడను ఇరువురు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి తపసు చేసి వరము పొందిరి. వారిలో రంబాసురునికి ఒక యక్షికి మహిషాసురుడు జన్మించెను. వాని సోదరుడగు కరంబాసురునకు లీలావతి మహిషి రూపమున జన్మించెను. మహిషాసురుని దుర్గాదేవి హతమార్చెను. మహిషిని శ్రీశాస్తావారు మదించి చంపెను. ఆ మహిషియే మాళికా పురత్తమ్మగా శబరిమలపై కోవెల గొనియున్నది. కనుక శ్రీరాముడు , పరశురాములవారి కాలము నుండియే శాస్తా ఆరాధన యుండినదని పురాణరీత్యా గోచరించుచున్నది.


పై చెప్పబడిన పరశురాముని అవతారమునకు ముందుగానే శ్రీమహావిష్ణువు మత్స్య , కూర్మ , వరాహ , నరసింహ , వామన అను అవతారములు దాల్చినపుడు కూర్మావతారం సమయాన దేవతలు క్షీరసాగర మథనము చేసిరి. అప్పుడు దానవులను మోసగించి , దేవతలకు అమృతమును పంచి యిచ్చుటకు శ్రీ మహావిష్ణువు  'మోహిని' అవతారము దాల్చినారని పురాణములో చెప్పబడి యున్నది. విష్ణువు మరల మోహిని అవతారమెత్తినది పరమేశ్వరుడు భిక్షాటన మూర్తిగా దారుకావన ఋషుల దర్పము అణచుటకు బయలుదేరు వేళ వారితో మోహినీ అవతారము దాల్చిన శ్రీహరి కూడా వెళ్ళినారని పురాణములో కలదు. భస్మాసురుడను రాక్షసుడు పరమేశ్వరుని వద్ద వరము పొంది దానిని పరీక్షించుటకు వారి శిరస్సుమీదే కరమెత్తినాడనియు , పలాయనమైన పరమేశ్వరుడు రుద్రాక్షపుగింజలో దాక్కున్నాడనియు , అదిగాంచిన మహావిష్ణువు మోహినీ అవతారము దాల్చి చాతుర్యముగా భస్మాసురుని భస్మము గావించెననియు ఒక గాథ కలదు. ఈ మూడవ పర్యాయపు మోహిని అవతారములోనే - భస్మాసురుని గాథలోనే - శాస్తావారు హరిహర పుత్రునిగా అవతరించినారని చెప్పబడుచున్నది. మొదటి రెండు పర్యాయముల మోహనీ అవతారములో శ్రీ శాస్తావార్ని గురించి చెప్పబడలేదు. కాని క్షీరసాగర మథనము వేళ ఆవిర్భవించిన ధన్వంత్రి అను దైవము శాస్తావారే అని చెప్పబడుచున్నది. అనగా దేవాసురులు మందరగిరిని కవ్వముగాను , వాసుకి అనుసర్పమును తాడుగాను చేసి క్షీరసాగరమును చిలికినప్పుడు 

1. హాలాహల విషము , 

2. వారుణీదేవి , 

3. చంద్రుడు , 

4. ఉచ్చైశ్రవమను తెల్లగుర్రము (రెక్కలతో కూడుకున్నది), 

5. ఐరావతమను తెల్ల ఏనుగు , 

6. పారిజాతము , 

7. కల్పవృక్షము , 

8. కామధేనువు (స్త్రీ ముఖముతో రెక్కలు గల ఆవు) , 

9. రంభ మున్నగు అప్సరస్సులు , 

10. కౌస్తుభము , 

11. మహాలక్ష్మీ 

12. ప్రాణమును రక్షించే వనమూలికలు , 

13. ధన్వంతరి అను దైవము (శాస్తా), 

14. చివరగా అమృతము ఆవిర్భవించినట్టు చెప్పబడి పదునాలుగును మిక్కిలి మహిమలు గాంచినవని అందురు.


కావుననే క్షీరసాగర మధనమువేళ ఆవిర్భవించిన ధన్వంతరి అను - శాస్తా వారిని దేవాది దేవునిగా (అపర ధన్వంతరిగా) రోగములు తీర్చే దైవముగా స్వీకరించి, ఆరాధించిరనునది ఇందుమూలముగా గోచరించుచున్నది. జంబూ ద్వీపం (భారతదేశం) మరియు కుశద్వీపము (ఈజిప్టు దేశము) నందును అనాదిగానే శ్రీశాస్తా ఆరాధన అలవాటులో యున్నట్లు పలు గ్రంథముల ద్వారా తెలియ వస్తున్నది.


పైన చెప్పబడిన కూర్మావతారము మరియు వరాహ , నరసింహావతారము మున్నగు నవి ఏడవ మనువగు వైవశ్వత మన్వంతరమునకు ముందు జరిగిన వగును. వామన , భార్గవ , రామ , కృష్ణ అవతారములు ఏడవ మన్వంతరమున జరిగిన వగును. ఏడవ మనువునకు ముందుగా (1) స్వాయంభువ , 

(2) ఉత్తమ , 

(3) తామస , 

(4) సాక్షీస , 

(5) స్వరోచిన 

(6) రైవత మున్నగు ఆరు మన్వంతరము లలో మొదటిదగు స్వాయంబు మన్వంతరమున ప్రచయతన్ అను రాజునకు తదుపరి దక్షుడు అను రాజు గొప్ప యాగమొకటి సలిపెను. అందున తన అనుమతి లేక కూతురు పరిణయమాడిన పరమేశ్వరునికి ఆవిర్భాగము ప్రసాదించలేదు. దాక్షాయణి తండ్రి వద్ద ఇది నేరమని ఎంత చెప్పినను కన్న కూతురిని సైతము కించపరచి యజ్ఞమును కొనసాగించెను. ఓర్వలేని దాక్షాయణి యజ్ఞగుండము నకు ఆహుతి అయ్యెను. ఇది గాంచి కోపాక్రాంతుడైన పరమేశ్వరుడు వీరభద్రుని పంపించి దక్షయాగమును నిర్మూలము గావించి దక్షుని హతమార్చెను. తదుపరి ఈ వీరభద్రుడే శాస్తావారి అవతారముగా ఎంచి పూజింపబడు చున్నారు. ఈ సంఘటనకు తదుపరి గూడా దాక్షాయణి హిమవంతునికి , మేనకకు పుత్రికయై పార్వతీయను పేరిట అవతరించి మరల పరమేశ్వరుని గూర్చి తపము చేసెను. ఈ సమయమున సూరపద్ముడు , సింహముఖుడు , తారకుడు , మున్నగు రాక్షసులు జన్మించి దేవతలను హింసించి దేవలోకమును ఆక్రమించుకొనిరి. అపుడు దేవేంద్రుడు తన భార్యయగు సచీదేవిని తమిళనాడులోని సీర్కాళ అను గ్రామమునకు సమీపమునందు గల వెదురు తోపులో దాచిపెట్టి శాస్తా అను దైవమును తన భార్యకు రక్షగా యుండుటకు తరలి రమ్మని ప్రార్థించినారనియు , అపుడు ప్రసన్నమైన భీకరావతారమూర్తియగు శ్రీ శాస్తావారిని చూచి భయపడిన ఇంద్రాణి యొక్క భయమును తొలగించమని వేడిన ఇంద్రుని కోర్కెమేరకు శ్రీ శాస్తావారు శాంతస్వరూపులుగా మారినారనియు శ్రీ శాస్తా ఎవరు అని అడిగిన ఇంద్రాణితో హరిహరపుత్రుని అవతారము గూర్చి చెప్పే సన్నివేశము స్కాంధ పురాణములో వివరింపబడియున్నది.


పైన చెప్పబడిన వివరణల నుండి తెలియవచ్చిన దేమనగా శ్రీ సుబ్రహ్మణ్య , పరశురామ , రామకృష్ణ అవతారములకు ముందుగానే ఏర్పడినదనియు స్వయంభు మన్వంతరమునకు మునుపటి నుండియే శాస్తా ఆరాధన యున్నదను విషయము వేదవ్యాసుల వారు రచించిన పురాణముల ద్వారా గోచరించుచున్నది. పైగా స్కాంధ పురాణములో తారకాసురుని వధించిన షణ్ముఖుడు , వాన్ని ఏనుగుగా మార్చి శ్రీ శాస్తావారికి వాహనముగా యొసంగినారనియు చెప్పబడియున్నది.


*(సశేషం)*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat