శ్రీ మహాశాస్తా చరితము - 22 | చిరంజీవత్వము పొందిన సత్యపూర్ణ మహర్షి | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 22 | చిరంజీవత్వము పొందిన సత్యపూర్ణ మహర్షి | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

*చిరంజీవత్వము పొందిన సత్యపూర్ణ మహర్షి*


ఈ ప్రపంచము ఆవిర్భవించిన కాలమునందు ముందుగా కనిపించినది శూన్యము మాత్రమే. మహాశాస్తా యొక్క ఆనతి ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి కార్యమును ప్రారంభించెను.

సకల భువనములను సృష్టించిన బ్రహ్మలోకమును పలురీతులుగా విభజించెను. ఆ లోకములందు ప్రాణకోటి ఉత్పత్తి కావలయునని ప్రజాపతులను సృష్టించెను. ఆ ప్రజాపతుల యందు మొదటివాడు దక్షుడు. అతడు బ్రహ్మ యొక్క కాలిబొటన నేలి నుండి ఉత్పత్తి అయినవాడు. అతడు మనువు యొక్క పుత్రిక అయిన ప్రకృతిని వివాహమాడి అనేక కుమార్తెలను బడసెను. ఆ కుమార్తెలలో అశ్వని మొదలు రేవతి వరకూ గల 27 మంది కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహముగావించెను. మిగతా వారిని తపస్సంపన్నులైన మునివర్యులకు వివాహముగావించెను. అటుల దక్ష ప్రజాపతి కుమార్తెలు 13 మంది కాశ్యపమునికి పత్నులైరి. శాస్తా యొక్క ఆనతి , ఆశీర్వాదములతో సృష్టి ప్రారంభించిన బ్రహ్మ , ఈగ , చీమ మొదలు పెద్ద పెద్ద వన్యమృగములు , సముద్రము , పర్వతములు మొదలైన వాటిని మానుష , దేవ , అసురులను సైతము సృష్టించెను. అన్నియు స్వామి యొక్క ఆశీర్వాదబలము వలన
దినదినాభివృద్ధి నందెను.

కాశ్యపముని యొక్క 13 మంచి పత్నులలో కాంతిమతి యనునది ఒకర్తె. చిరుప్రాయము
నుండియే ఆమె స్వామిని ఆరాధించు స్వభావము కలది. కాశ్యపమునితో వివాహము అయిన
అనంతరము ఆమె తండ్రియైన కాశ్యపముని వంటి తపస్సంపన్నుడు , అఖిలాండ నాయకుడైన
స్వామియందు అపారమైన భక్తి తత్పరకతల కలిగినటువంటి పుత్రుని ప్రసాదింపుమని అనుదినము స్వామిని ప్రార్థించుచుండెడిది.

భక్తులయందు అపారమైన ప్రేమానురాగములు గల స్వామి ఆమె కోరినట్లుగానే అపారమైన
జ్ఞానము , తపశ్శక్తి , తనయందు భక్తి కలిగినటువంటి పుత్రుడు జన్మించునటుల వరమునిచ్చెను. అటుల జన్మించిన ఆ పుత్రునికి తల్లిదండ్రులు సత్యపూర్ణుడను నామకరణము చేసి అల్లారుముద్దుగా పెంచుకొనసాగిరి.

పూవు పుట్టగానే పరిమళించు విధముగా బాల్యము నుండియే ఆ పిల్లవాడు సకల సృష్టికి కారణకర్తగానూ , ఆదిమూల వస్తువుగానూ ఉండు శ్రీ మహాశాస్తా యందు అపారమైన భక్తి
భావములు కలిగియుండెను.

ముమ్మూర్తుల మేలు కలయుకమై , అఖిలాండములకు సృష్టి , స్థితి , లయ కారుకుడై విరాజిల్లు స్వామి యొక్క మహాత్మ్యమును గుర్తెరిగిన సత్యపూర్ణుడు తన తండ్రినే గురువుగా భావించినవాడు. స్వామియందు పుత్రునికి కల భక్తి భావము నెరిగిన కాశ్యపుడు స్వామియొక్క మూలమంత్రమును
ఉపదేశించెను. ఎల్లప్పుడు తపస్సునందే మక్కువగల బాలుని ఆశీర్వదించి పంపెను.

తండ్రివలన గురోపదేశము పొందిన సత్యపూర్ణుడు స్వామి యొక్క నామమును జపించుచూ
మంధర పర్వతమునందు కొంతకాలము కఠోర తపస్సు చేసెను. అరిషడ్వర్గములను జయించి , ప్రతి అణువునందూ శాస్తా యొక్క ఉనికిని గుర్తెరిగి కఠోర తపస్సు చేసిన రీతికి మెచ్చిన స్వామి తన తేజోమయ స్వరూపములో సాక్షాత్కరించి కోరిన వరము నిచ్చెదనెను.

సత్యపూర్ణుడు ఆదినాయకుడివైన నీవు తప్ప నాకు కావలసినదేదియూ లేదు అని బదులిచ్చెను.

అందుకు మెచ్చిన శాస్తా అతడిని చూచి *'భక్తా ? నీవు చేసిన కఠోర తపస్సుకు మెచ్చితిని. నీవు నా భక్తులయందు అగ్రగణ్యుడవు. ఎవరికీ లభించని విధముగా నా శక్తిస్వరూపులైన దేవేరులిరువురూ నీకు కుమార్తెలుగా జన్మించి నన్ను చేరుకుందురు'* అని వరమిచ్చెను.

నాయొక్క భక్తుడవైన నీకు ఎన్నటికీ అంతమనేది లేదు. ముమ్మూర్తులు మూవురూ నాయందు
లయులై యుందు మహాప్రళయ కాలము నంతటినీ అధిగమించి పదునెనిమిది మహా ప్రళయముల జీవిత కాలము నీకు ప్రసాదించుచున్నాను. అందరిచేతనూ కొనియాడబడుతూ , నాకు ప్రియతమ భక్తుడివై చివరకు నాలో ఐక్యమగుదువుగాక అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యెను.

మహా తప్పశ్శక్తి సంపన్న స్థితికి పొందిన సత్యపూర్ణుడు , స్వామియొక్క ఆశీర్వాద , ఆదేశానుసారము
ఎంతోకాలము జీవించెను.

*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow