శ్రీ మహాశాస్తా చరితము - 23 *పెళ్లికొడుకైన మహాశాస్తా*

P Madhav Kumar
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*పెళ్లికొడుకైన మహాశాస్తా*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి  (ABADPS)*

*నేత్రముల నుండి ఆవిర్భవించిన యువతులు*


సదా పరంధాముని కఠోర తపోదీక్షలో సత్యపూర్ణుడు మునిగి తేలుచుండెను. అలా ఒకనాడు తపస్సులో లీనమై అలౌకిక ఆనందపరవశుడై యుండువేళ ఆనంద అశ్రువులు కనుల వెంబడి
జాలువారుగా , ఆ అశ్రువుల ద్వారా సుందరాంగులైన ఇరువురు యువతులు జనియించిరి.

తన నేత్రముల నుండి జనియించుటచే సత్యపూర్ణుడు వారిని తన కుమార్తెలుగా అంగీకరించెను. వారికి కమల , విమల అను నామధేయునిడి , స్వామి యొక్క మహిమలను సదా వారికి బోధించుచుండెను. పెరిగి పెద్దవారై , యౌవనవతులైన ఆ యువతులు ఇరువురూ పరమశివునికి , శ్రీ
మహావిష్ణువుకు జన్మించిన మహావీరుడైన శాస్తావే తమకు భర్తగా రావలయునని ఎదురుచూచుచుండిరి.
తమ కుమార్తెల అభీష్టము నెరవేరు కల్యాణవత్రమునొక దానిని తండ్రియైన సత్యపూర్ణుడు ఆ వ్రత
విధానమును తెల్పెను.

ఆ వ్రతమెట్టిదనిన - సూర్యుడు మీనరాశిలో సంచరించు ఫాల్గుణ మాసమున , చంద్రుడు దిన దిన ప్రవర్థమానుడగు శుక్ల పక్షమున , ఉత్తరా నక్షత్ర దినమున ఈ వ్రతము చేయుమని ఉద్దేశించెను.

వ్రతము నాచరించువారు సూర్యోదయమే మేల్కొని శివుని మనస్సున ధ్యానించి , స్నానపానాదులు
ముగించిన పిమ్మట పార్వతీ పరమేశ్వరుల బంగారు ప్రతిమకు అభిషేక ఆరాధనలు చేసి , పార్వతీ పరమేశ్వరులు పరిణయమాడు ఘట్టమును మనస్సున ధ్యానించవలయును. తీపి పదార్థములను దేవునికి నివేదన చేయవలయును. ఎవరికీ ఎటువంటి కీడూ తలపెట్టనివారూ , శివభక్తులైన వేద బ్రాహ్మణ దంపతులను పిలిచి వారిని సత్కరించి వారికి భోజనము పెట్టవలెను. అటుపిమ్మట శివాలయమునకు వెళ్ళి పరమేశ్వరునికి ముమ్మారు ప్రదక్షిణలు చేయవలెను. రాత్రి సమయమున
పరమేశుని ఆరాధించు భక్తులతో గూడి రుచికరములైన ఫలములను , పాయసమును
భుజింపవలయును. నక్తభుక్తము చేయవలయును అనగా నక్షత్రము చూసిన పిమ్మట అనగా రాత్రిపూట మాత్రమే భోజనము చేయవలెను. ధర్భాసనముపై మాత్రమే పరుండవలెను. మరునాడు పునఃపూజ గావించిన పిమ్మట భగవంతుని స్వర్ణవిగ్రహమును , శివభక్తునకు దానమీయవలెను.

తాము మనస్సున నిలిపిన వరుని పరిణయమాడు ఈ కల్యాణ వ్రతమును ఇరువురు కన్యలు
అత్యంత భయభక్తులతో నెరవేర్చిరి. శాస్తాని పరిణయాడు కోరికతో ఉమాశంకరులను పూజించి వ్రతమును సమాప్తినందించిరి.

వారి భక్తి శ్రద్ధలకు మెచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆ కన్యలు కోరినట్లే వరము నిచ్చిరి. అట్లు వారు మహాశాస్తా యొక్క భార్యలు కాగల అర్హత పొందిరి.

*“సత్యపూర్ణాః వయనయాస్తాం మహర్ షేర్ నేత్రయే రూపే*
*పూర్ణా పుష్కల కాఖ్యాజే పురా పుణ్యమితం వ్రతం*
*చరిత్వా కన్యకే బధ్యే మహాశాస్తుత బభూవతు:”*

ఈ వృత్తాంతము స్కంద పురాణములోనిది. కానీ మరొక చారిత్రక ఆధారము ప్రకారము విష్ణు పుత్రికలైన అమృతవల్లి , సుందరవల్లి యను ఇరువురు కన్యలు సుబ్రమణ్యస్వామిని వివాహమాడగోరి
కఠోర తపస్సు చేసిన పుణ్యఫలమువలన మరుజన్మలో వల్లిదేవసేనలుగా జన్మించి స్వామిని
పరిణయమాడినట్లే. కమల , విమల యను యువతులు కూడా ఈ వ్రత ఫలితముగా మీరు మరు జన్మయందు పూర్ణా , పుష్కళ అను నాయధేయులుగా జన్మించి , మహాశాస్తాని పరిణయమాడి
యుందురు అని తెలియుచున్నది.



*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat