*పుష్కలా పరిణయం*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి (ABADPS)*
జగద్రక్షకుడై పశువుల కాపరియై , పశుపతినాధుడైన పరమేశ్వరుడు కొలువైయుండు నేపాళ
దేశమును ఫళింగ వర్మయను రాజు పరిపాలించుచుండెను. జగదంబికయైన పార్వతీ దేవి యొక్క పరమభక్తుడై సదా ఆమె అనుగ్రహమును పొందియుండెను. మహాకాళికా స్వరూపురాలై కొలువైయుండు
ఉజ్జయిని దేశపు యువరాణి శాంతాదేవిని వివాహమాడెను.
కాళికాదేవిపై అమిత భక్తిగలిగిన రాజు , రోజులు గడిచిన కొద్దీ అమ్మవారిని సులభప్రసన్నురాలిని
చేయు యుక్తులను ఆలోచింపసాగెను. క్రూరమార్గము అత్యంత సులభము. తద్వారా అమ్మవారు అనుగ్రహించునని నమ్మసాగెను. అందులకై శాంతస్వరూపిణియై దయా సముద్రురాలై యుండు జగదంబికకు సాధుజంతువులను బలి ఇచ్చుచుండెను.
అందులకు కలత చెందిన మహారాణి శాంతాదేవి పరమేశ్వరునికి విన్నవించుకొనెను. ఆమెకు శివుడు స్వప్నమున సాక్షాత్కరించి *“మహారాణీ ! కలత చెందకుము. నీ భర్తను సరిదిద్దుటకై నా పుత్రుడు వచ్చు సమయము ఆసన్నమైనది. పార్వతీదేవి యొక్క అంశగా నీకు జనించబోవు కుమార్తెకు శివస్వరూపుడైన నా పుత్రుడు భర్త కాగలడు. అతడు నీ భర్తను చెడు మార్గము నుండి మళ్ళించి సరిదిద్దగలదు'* అని చెప్పి అంతర్ధానమయ్యెను.
ఎంతైనా రాజు దేవియొక్క పరమభక్తుడే కదా. పరమేశుని వరము ప్రకారము సత్యపూర్ణుని
కుమార్తె అయిన విమల , పార్వతీదేవి అంశలో ఫళింగ రాజుకు కుమార్తెగా జన్మించినది. దేవి యొక్క
అంశగా జన్మించిన కుమార్తెకు *'పుష్కల'* అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచసాగెను.
కాలచక్రము పరిభ్రమించుచూ మహారాజు పుత్రిక వివాహ వయస్సురాలయ్యెను.
రాజు ముసలివాడయ్యెను. కానీ ముసలితనమును ఎంతమాత్రము అంగీకరించక , ఎప్పటికీ యౌవనవంతునిగా యుంచు ఇచ్చ కాలవాడైయుండెను. కాలక్రమమును తప్పించుట కాలునికి కూడా సాధ్యము కాదని
పెద్దలు ఎంత చెప్పినను విననివాడయ్యెను. నరబలులు జంతుబలులతో అమ్మవారిని కొలుచు
కొందరు దుష్టులు రాజుకు ఇష్టులైరి. ఆ కూటమిలో నుండు అశ్వసేనుడను వానిని గురువుగా
భావించి అతడు చెప్పినట్లే చేయసాగెను.
సర్వలక్షణ సంపన్నుడైన 108 మంది యువతులను అమ్మవారికి బలి ఇచ్చినచో అమ్మవారు
ప్రసన్నమై , మహారాజు కోరు నిత్యయౌవనత్వమును ప్రసాదించునని మహారాజుకి దుర్బోధలు
చేసెను. ఆతడు చేసిన ప్రతిపాదనను మహారాజు సంతోషముగా అంగీకరించెను.
మహారాజు అంతకుమునుపు వరకు తాను ఎంతో ప్రీతిగా , దయార్ద్ర హృదయుడై , సాధుమార్గమున తాను అమ్మవారిని సేవించిన వైనము మరచి , దుర్బోధలకు లొంగి తక్షణమే వారు చెప్పినట్లే చేయ నిశ్చయించెను. సత్ పరిపాలనలో ప్రజలను కాపాడి రక్షించవలసిన మహారాజే ! తన అధికార
బలగర్వముతో 107 మంది కన్యలను చెరపట్టెను. చివరగా 108వ కన్యగా ఒక యువతిని చెరబట్టెను. ఆమె పరమశివుని భక్తురాలు. కాపాడి రక్షించవలసిన మహారాజే తన్ను చెరబట్టిన విధానము ఆమెకు అత్యంత దుఃఖము కలిగించెను. మానవమాత్రులు ఎవరూ తన్ను కాపాడలేరు.
దేవుడే దిక్కు అని తలచి ఆమె పరమేశ్వరుని ప్రార్థించినది. మహారాజు పాపం పండిన సమయము ఆసన్నమైనదని తెల్సుకొన్న శివుడు , తన భక్తురాలిని కాపాడగోరి , శిష్ట రక్షణ చేయమని తన పుత్రుని పంపెను.
108 మంది కన్యలను బలి యిచ్చు సమయమున స్వామి బలిపీఠమునందు ప్రత్యక్షమై జరుగబోవు కార్యమును అడ్డుకొనెను. కన్యలను బంధియున్న వాళ్ళు వాటంతట అవే విడిపోయినవి . తాను జరుపబోవు హోమమునకు భంగము వాటిల్లుట చూచిన మహారాజు కోపోద్రేకుడయ్యెను.
వచ్చినది తన శత్రువుగా నెంచి స్వామితో. హోరాహోరీ పోరాడెను. స్వామి తన బల పరాక్రమములతో
మహారాజుని ఓడించి ఆ యువతిని కాపాడెను. మొదట్లో తాను పోరు సల్పుచున్నది. మహాశాస్త్రాతో నన్న విషయమును ఎరుగని మహారాజు , తన ప్రయోగములన్నియూ నిష్ఫలము అగుటతో చివరకు వచ్చినది. భగవంతుడైన భూతనాధుడే నన్న సత్యమును గ్రహించెను. స్వామి గజారూఢుడైన
భూతనాధునిగా తన దివ్యమంగళ స్వరూపమును మహారాజుకి చూపించెను. స్వామి యొక్క
దర్శనభాగ్యము వలన అజ్ఞాన అంధకారములోనున్న ఫళింగ వర్మకు జ్ఞానోదయమయ్యెను. సాష్టాంగ ప్రమాణముగావించెను. స్వామి ఆదేశానుసారము మిగతా 107 మంది కన్యలను విడిచి పెట్టెను.
అమ్మవారి అనుగ్రహము పొందుటకు సాధుభక్తి జ్ఞానమార్గమే ఉన్నతమైనదని మహారాజు గ్రహించునటుల చేసి సన్మార్గమునకు మళ్ళించెను. స్వామికి సాష్టాంగ ప్రమాణముల నాచరించిన మహారాజు మరల కాలమును జయించనెంచెను. కానీ అతడు ఇప్పుడు కోరినది నరబలి కాదు. తన
కుమార్తె అయిన పుస్కళాదేవిని భూతనాధునికి వివాహము గావించి ఎన్నటికీ తన పేరు
నిలచియుండునటుల కోరెను. అందులకు అంగీకరించిన మహాశాస్తా అటులే కానిమ్మనెను.
పార్వతీ పరమేశ్వరులు , లక్ష్మీనారాయణులు అంగీకారముతో సాక్షాత్తు బ్రహ్మ దేవుని చేతనే
వివాహ ముహూర్తము నిర్ణయించబడినది. స్వామి యొక్క పరమ భక్తునిగా పేరుపొందిన
మంత్రధ్రువుడను మహర్షిచే పరమశివుడు వివాహ శుభలేఖను పంపెను. స్వామియొక్క వివాహ శుభలేఖను అందుకున్న మహర్షి నేపాళ దేశమునకు వచ్చి శుభవార్తను వినిపించెను.
అనుకున్న శుభ ముహూర్తము రానే వచ్చినది. ముల్లోక ప్రజలందరూ తమ జన్మ ధన్యమైనదని సంతోషముగా గుమిగూడిరి.
అష్టవసువులు , నవగ్రహములు , ఇంద్రాది అష్టదిక్పాలుల ఏకాదశ రుద్రులు , అష్ట భైరవులు , సప్తఋషులు , పితృదేవతలు , సప్తసముద్రములు , సప్తద్వీపములు , పర్వతములు , వృక్షములు ఇవన్నీ
కూడా మానుషరూపులై స్వామియొక్క దివ్యమహోత్సవము చూడవచ్చిరి. లోకమున ఇంతకు ముందు
కనీవిని ఎరుగని విధముగా వివాహ మహోత్సవ ఏర్పాట్లు జరిగినవి. సర్వాభరణ సర్వాలంకార భూషితునిగా స్వామి స్వర్ణరధముపై ఊరేగుతూ వచ్చుచుండెను. ఇరుప్రక్కలా శివపార్వతులు ,
లక్ష్మీనారాయణులు వచ్చుచుండిరి.
నందీశ్వరుని భార్య అయిన *'సుయశ',* మంత్ర ధృవమహర్షి భార్య అయిన మాలతి ఇరువురూ పుష్కలాదేవికి పెండ్లికూతురి అలంకారము చేయ బాధ్యత చేపట్టిరి.
స్వామియొక్క శివగణములకు అధిపతులైన మహాకాళుబు , మహావీరుడు ఇరువురూ భూతనాధుని
పెండ్లికుమారుని అలంకారము గావించి స్వర్ణరధముపై కూర్చుండబెట్టిరి.
దేవతలు , మునులు , త్రిమూర్తులు శుభాసీస్సులు కురిపించుచుండగా , మహారాజు పుళింగవర్మ ,
*'నా అనుంగు పుత్రిక అయిన పుష్కలను శాస్త్రు దేవుడైన భూతనాధునికి పాణిగ్రహణము కావించుచున్నాను. అని చెబుతూ తన కుమార్తెను స్వామికి కన్యాదానము గావించెదను. జయ జయ ధ్వనులు మ్రోగుచుండగా స్వామి పుష్కలాదేవిని పరిణయమాడెను.*
*నేపాళ నృప సంభూత శాస్త్రు వామాంగమాశ్రితా*
*తనోతుభక్త లోకస్య పుష్కలా పుష్కలాంశ్రియం*
*(పుష్కలాదేవి యొక్క ధ్యాన శ్లోకం)*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*