శ్రీ మహాశాస్తా చరితము - 26 స్వామి యొక్క అష్టవిధ లీలలు

P Madhav Kumar

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*స్వామి యొక్క అష్టవిధ లీలలు*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*“పన్నగం తన్నిల్ ఉరె పద్మనాభ కడవుళ్*
*పరమనరుళ్ బాలగనుం నీ - పన్నగ శయనుడైన*
*శ్రీ మహావిష్ణువునకు అనుంగు పుత్రుడవు నీవు భక్తుల హృదయములందు నిత్యము వసియించు పరమార్ధ స్వరూపుడవు నీవే. మహారాజులు, అష్టదిక్పాలురు సైతము నీకు వందనము చేయువారే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడవు నీవే.”*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*ప్రభావతి పరిణయ ఉత్సవము*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


వాగ్గేవి యొక్క వరము పొందిన మహారాజు
పుణ్యనది అయిన గంగాదేవి ఉత్తర దిశగా పయనించుతూ మానవకోటి యొక్క పాపములను
ప్రక్షాళన చేయు పుణ్యతీర్థము కాశి. ఈశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపుడై , లోకమునందలి ప్రజలందరికీ నాయకుడుగా , విశ్వనాధ నామధేయుడై విలసిల్లు పుణ్యక్షేత్రము కాశి , జగజ్జనని , అన్నపూర్ణ
నామధేయురాలై కొలువైయుండు స్థలము. గతితప్పని ప్రకృతి పరిసరములు , మహారాజు యొక్క నీతి
తప్పని సత్ పరిపాలన , చతుర్వేదములు సదా ప్రతిధ్వనించు పుణ్య స్థలము. అటువంటి పుణ్యస్థలమైన కాశీ క్షేత్రమును పరిపాలించు మహారాజు పేరు హంసధ్వజుడు. అతను కళింగదేశపు రాకుమారి
అయిన హేమవతిని వివాహమాడి , నీతి తప్పని పరిపాలన చేయుచూ , భక్తితత్పరతతోనూ , కీర్తి
ప్రతిష్ఠలతోనూ మెచ్చదగిన విధముగా జీవించుచుండెను. అతడు వాగ్గేవియైన సరస్వతి యందు అపారమైన భక్తి కలిగియుండెను. అనుదినము ఆమెను త్రికరణ శుద్ధిగా పూజించుచుండెను.

ప్రజలందరూ మెచ్చువిధముగా పరిపాలించుచున్ననూ , ఏ కొరత లేని జీవితము గడుపుచున్ననూ అతడికి ఒక్కటే లోటు. అతడికి సంతానము లేకపోవుటయే. ఎన్ని ఆలయములు దర్శించిననూ , యాగములు హోమములు ఎన్ని చేసిననూ మహారాజు లోటు తీరనే లేదు. కడకు తన ఇష్టదైవమైన సరస్వతీ దేవిని ప్రసన్నము చేసికొనుటకై కఠోర తపస్సు చేయబూనెను. హంస ధ్వజ మహారాజు
భార్యా సమేతుడై అడవికి బోయి కడు దీక్షతో తపస్సు చేసెను. అతడి తపమునకు మెచ్చిన
హంసవాహిని సరస్వతీ దేవి అతడికి ప్రత్యక్షమాయెను.

తన ఇష్టదైవము కనులముందు సాక్షాత్కరించినది చూసిన మహారాజు ఉప్పొంగిపోయి పరిపరి
విధములు స్తుతించెను. భక్తుని అంతరంగము దైవమునకు తెలియనిది కాదు కదా ! అతడు అడుగక ముందే ఆమె వరమును ప్రసాదించెను.

*“హంసధ్వజా ! అపారమైన నీ భక్తికి మెచ్చి నీయందు ప్రత్యక్షమైతిని. నీకిక ఏ కొరతయూ ఉండను. నీ సత్ ప్రవర్తనకు నీ భక్తికి మెచ్చితిని. రాత్రనక పగలనక తపమాచరించిన నీకు త్వరలోనే నా అంశతో ఒక కుమార్తెయు , తరువాత వంశోద్ధారకుడైన కుమారుడు కలుగుదురు”* అని
వరమును ప్రసాదించెను.

కరుణా సముద్రురాలైన చదువుల తల్లి ఇచ్చిన వరమునకు రాజదంపతులు సంతోషముతో పొంగిపోయిరి. తమకు ఇంతటి భాగ్యమును ప్రసాదించిన దేవికి మరొకమారు నమస్కరించి
రాజధానికి తరలిపోయిరి.

వాగ్గేవి యొక్క వాక్కు త్వరలోనే ఫలించినది. రాజుతో సహా ప్రజలందరూ సంతోషించునట్లుగా
శారదాదేవి అంశతో వారికి ఒక కుమార్తె జన్మించినది. భారతీదేవి అవతారము కావున *ప్రభావతి* యను నామకరణము చేసి అల్లారుముద్దుగా. ఆనందముగా పెంచుకొనసాగెను. సరస్వతీ దేవి చెప్పినట్లు తరువాత కొంతకాలమునకు ఒక కుమారుడు కలిగెను. అతడి పేరు హిరణ్యవర్మ.
*అతిరూప సుందరియైన ప్రభావతి* ముద్దు ముద్దు మాటలాడు చిరుప్రాయము నుండియే మహాశాస్తా యందు అపారమైన భక్తి కలిగియుండెను. ఆమె మనస్సున ఎల్లప్పుడూ స్వామియొక్క రూపు ,
మాటలయందు సదా అతడి నామమే ప్రతిఫలించుచుండెను. వయస్సుతో పాటు స్వామియందు భక్తి
కూడా దినదిన ప్రవర్థమానమయ్యెను. యుక్తవయస్కురాలైన ఆమె స్వామితోనే తన వివాహము జరుగవలయునని నిశ్చయముతోనే సదా అతడినే తలచుకుంటూ పూజించుచుండెను. తాను
స్వామికి మాత్రమే చెందవలయునను భావము ఆమెలో గాఢముగా ఉండెను. ఆమె ఆరాధన , ఆలోచన అంతయూ అతడిని ఎట్లు చేపట్టుటయా అన్నట్లుండెను.




*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat