శ్రీ మహాశాస్తా చరితము - 27 రాకుమారుని దుష్టచర్యలు

P Madhav Kumar

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*రాకుమారుని దుష్టచర్యలు*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి  (ABADPS)*

ప్రభావతికి తరువాత జన్మించిన రాకుమారుడైన హిరణ్యవర్మ అందగాడు , అన్ని విద్యలందు
ఆరితేరినవాడు. కానీ అతనికొక దుర్గుణము ఉండెను. ఇతరులను ఏడిపించుచూ ఆనందించు
పైశాచిక ప్రవృత్తి కలిగియుండెను. మహారాజు కూడా తన తరువాత రాజు కావలసినవాడు ,
వంశాంకురమైన కుమారుడే కదా యని పెద్దగా పట్టించుకొనకపోయెను. దీనితో అతడి ప్రవర్తన
హద్దుమీరిపోయెను. ఒకనాడు తన సహచరులతోనూ , సేవకులతోనూ వేటకై అడవికి పోయెను.
చాలసేపు వేటలో మునిగియున్న కారణముగా వారికి అమితముగా దాహము వేయసాగెను. నీటికై
వెదకునంతలో వారికి ఒక గృహము కనిపించెను. అది *'యజ్ఞమిత్రుడను'* బ్రాహ్మణుని గృహము
మహాపండితుడైన అతను శాస్తాయందు అపరిమితమైన భక్తి కలవాడై యుండెను. అతడి గృహము చుట్టూ ఉన్న తోటలన్నియు స్వామికొరకై పెంచబడినవే. అందుండు మొక్కలు , పుష్పములు ,
ఫలములు అన్నియు స్వామికొరకు వినియోగింపబడునవే. రాకుమారుడు , అతడి పరివారము యజ్ఞమిత్రుని గృహము చేరుకున్న సమయమున అతడి గృహావరణ అంతయూ మిగుల కోలాహలముగా
ఉండెను. కారణము అతి త్వరలో జరుగబోవు అతడి కుమారుని ఉపనయన మహోత్సవ సంరంభ వేడుకలతో కోలాహలముగా ఉండెను. గృహమంతయూ రుచికరములైన తినుబండారములతోనూ ,
ధాన్యరాశులతోనూ , శాకపాకములతోనూ నిండియుండెను.

తమ గృహమునకు ఏతెంచిన అతిథులకు యజ్ఞమిత్రుడు సకల మర్యాదలు గావించెను. కానీ కుత్సితులైన రాకుమారుడు , అతడి పరివారము యజ్ఞమిత్రుడు గృహములోనికి అడుగు పెట్టిన వెంటనే అతడు ఊహించని విధముగా ఉపనయన వేడుకలకై తయారుచేయబడిన తినుబండారములను
తినుచూ , పూజా సామగ్రులను విసిరివేయుచూ తమ ఇష్టానుసారము ప్రవర్తించుచుండిరి. గృహ
యజమాని , అతడి పరివారము ఆందోళన చెందుట చూచిన రాకుమారునికి పైశాచిక ఆనందము అధికమయ్యెను. తాను తినగా మిగిలినవాటిని విసురుగా బావిలో పడవేయసాగిరి.

గృహమున చేసిన దురుసుతనము చాలదన్నట్లుగా , రాజకుమారుడు , అతడి సేవకులు తోటలపై
పడిరి. తోటలో పక్వముగా పండి స్వామి పూజకై వేచియుండు ఫలములను కూడా వారు వదలలేదు.
ఆ ఫలములన్నియు కేవలము స్వామి పూజకై ఉపయోగింపబడునవే. ఫలములను తిన్నంత తిని , ఆ చెట్లను వేర్లతో సహా పీకి పారవైచిరి. తోటినంతయూ నాశనము చేసిరి. యజ్ఞమిత్రుడు , అతడి పరివారము ఈ దుష్టులను వారించబోగా , వేటకుక్కలను వారిపై ఉసికొల్పిరి. తెగించి వారింప వచ్చినవారు వేటకుక్కల కాటుకు బలియై దుఃఖించుచుండిరి.

రాకుమారుడు ఉసికొల్పిన వేటకుక్క    త్వరలో ఉపనయనము చేసికొనబోవు యజ్ఞమిత్రుని కుమారుని అతి తీవ్రముగా గాయపరిచినవి. ఊహించని విధముగా ఆ బాలుడు మరణించెను.
చూచిన అతడి కుటుంబ సభ్యులందరూ కడు దుఃఖములో ఏడ్చుటచూసిన రాకుమారునికి పైశాచిక
ఆనందము పొందినవాడై సేవకులతో తన రాజ్యమునకు తిరిగిపోయెను.

తన కనులముందరే బాలకుడు శవముగా మారుటతో పుత్ర శోకముతో కలత చెందిన
యజ్ఞమిత్రుడు మహారాజు వద్దకు న్యాయము కోరుటకై బయలుదేరెను. కుమారుని మృతదేహమును
తన భుజములపై వేసుకొని కాశీ పట్టణమునకు పయనమయ్యెను. అహోరాత్రములు నడిచి కాశీ పట్టణము చేరుకొనుటకు నాలుగు దినములు పట్టెను. ఇంతలో బాలుని శవము కుళ్ళిపోయి దుర్వాసన వీచుచుండెను. ప్రళయకల రుద్రుని వలె కోట గుమ్మము వద్ద నిలచిన యజ్ఞవర్మను చూసిన కాపలాదారులు భయభ్రాంతులై విషయమును మహారాజుకు విన్నవించిరి. యజ్ఞవర్మను పిలిపించిన మహారాజు అతడితో *'మునివర్యా ! చూచినచో జరుగరాని ఘోరము జరిగినట్లుగా తెలియుచున్నది. నీకు కలిగిన కష్టమేమి ? కారణకార్యములు తెల్పుము. నీకు తగిన న్యాయము చేయుదుము”* అని సమాధానపరచ ప్రయత్నించెను.

కోపోద్రేకుడైన వేదవిప్రుడు , *“మహారాజా ! దీనికి బాధ్యుడు నీ కుమారుడే”* జరిగినదంతయూ వివరించెను. జరిగినదానికి కారణము తన కుమారుడేనన్న సంగతి తెల్సికొన్న మహారాజు మనస్సు మారిపోయినది.

*విప్రవర్యా ! నీకు జరిగిన దుస్థితి దుఃఖింపదగినదే. ఏమి చేయుదుము ? ఒక్కొక్కసారి మనలను మీరి జరుగరాని ఘోరము జరిగిపోవును. అదంతయూ కాలమహిమ తప్ప వేరొకటి కాదు. దుఃఖింపకుము. నీకు కలిగిన దుస్థితికి మారుగా బంగారు నగలు , భోగ భాగ్యములు ఏమి కావలయునో కోరుకొనుము. ఇచ్చెదను. వాటితో సంతోషముగా జీవింపుము. నేనునూ నా  కుమారునికి బుద్ధి గరిపెదను”* అనెను.

తన కుమారుని దండించనెంచని మహారాజు స్వభావమును గుర్తించిన విప్రుడు , కోపోద్రిక్తుడై ,
*“ఇదేనా నీతితప్పని నీ పాలన నీ ప్రజల దుస్థితినెరింగి , వారి కష్టములు తీర్చవలసిన మహారాజువైన నీవు , నీ కుమారుడు చేసినది తప్పని తెలిసిననూ , అతడిని దండించక ధర్మన్యాయము చేయుటను అతిక్రమించితివి. నీవు మహారాజుగా ఉండు అర్హత లేదు. ఆ అర్హత ఈ కాశి నగరమునకు కూడా లేదు”* అంటూ మహారాజును , కాశి నగరమును నిందించసాగెను. ఇదంతయూ చూచుచున్న
మంత్రులకు , మహారాజుకు తన కుమారుని దండించుట ఇష్టము లేదన్న విషయము గ్రహించినవారై , అవినీతికి తమ వంతు సహకారము చేయబూని , మహారాజునకు తమ మద్దతు తెలుపు విధముగా , యజ్ఞవర్మను నిందించి , అతడిని కొట్టి బయటికి వెళ్ళగొట్టిరి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat