శ్రీ మహా శాస్తా చరితము - 28 | స్వామి యొక్క ఆవిర్భావము | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహా శాస్తా చరితము - 28 | స్వామి యొక్క ఆవిర్భావము | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

*స్వామి యొక్క ఆవిర్భావము*

దిక్కులేని వారికి దేవుడే కదా దిక్కు ? మహారాజే నీతి తప్పి ద్రోహానికి తలపడినప్పుడు , తనకు
జరిగిన అన్యాయమును గురించి సర్వలోక శరణ్యుడైన మహాశస్తాకి మొరబెట్టుకొనెను. నీతికి
మారుపేరైన మహాశాస్తాతో తమ గోడు విన్నవించుకొనెను. ధర్మపరిపాలకుడైన స్వామి ఒక్క క్షణం కూడా వృధా కానివ్వలేదు. ఆకాశవాణిగా ఇట్లు పలికెను. *“భక్తా ! నీపట్ల అనుచితముగా ప్రవర్తించిన రాకుమారుడు , న్యాయపరిపాలన చేయవలసిన మహారాజు అవినీతిగా ప్రవర్తించిన కారణంగా మహారాజు , అతడికి తోడుగా నిలచిన మంత్రులు , ఇతర పరివారము అందరూ తప్పక దండింపబడుదురు. నా భక్తుడైన నీవు చింతింపవలదు. నా అనుగ్రహము వలన అన్యాయముగా బలి అయిపోయిన నీకుమారుడు మరల బ్రతికివచ్చును”* అని పలికెను. స్వామి యొక్క అనుగ్రహము
వలన మరుక్షణమే అతడి కుమారుడైన దేవమిత్రుడు పునరుజ్జీవితుడై మునుపటి కన్నా సుందరరూపుడై
ప్రత్యక్షమాయెను.

భగవంతుని యొక్క అపారమైన కరుణకు ధన్యవాదములు తెలుపుకుంటూ , తన కుమారుని యొక్క ఉపనయమును ఘనముగా నిర్వహించెను.

పండితుని యొక్క బాధని తొలగించిన స్వామి , నీతి తప్పి ప్రవర్తించిన మహారాజు. అతడి యొక్క పరివారమును దండించు నిమిత్తమై , తన కొరకు తపస్సు చేయు ప్రభావతిని వివాహమాడుటకై
అవతారము దాల్చెను. దుష్టశిక్షణ , శిష్టరక్షణ చేయుటకై క్రొంగొత్త అవతారము దాల్చెను. కారుమేఘం వంటి రూపు కలిగి , సింహగర్జన చేయుచూ ఉరుముల వంటి గంభీరమైన గొంతు కలిగి ఒక కిరాత రాజుగా రూపుదాల్చెను.

అష్టదిక్కులు పులి తోలుగా (అతడు) మారిపోయినవి. చతుర్వేదములు కాలి నూపురములుగానూ ,
అష్టాదశ పురాణములు అతడికి పాదుకలుగాను మారినవి. విల్లంబులు చేత ధరించి , జటాజూటమును గట్టిగా బిగియించి అందు చామంతి పూమాలను ధరించి యుండెను. నల్లని పర్వతములను బోలు బాహువులు , చెవులకు అడవి వెదురుతో చేయబడిన ఆభరణములు , కరములయందు ఏనుగు
దంతములతో నగిషీలు దిద్దబడిన కంకణములు , వ్రేలికి ఇంద్ర నీలామణి ఉంగరములు , ఛాతీపై
పులిగోర్లతో చేయబడిన హారములు ధరించి యుండెను. ముఖానికి విశాలమైన మీసములు శోభ తెచ్చెను. స్వామి యొక్క భూతగణములు , పలు భయంకర ఆయుధములు ధరించిన వేటగాండ్రుగా రూపుదాల్చియుండిరి. మేలు జాతి గుర్రమును అధిరోహించి , విల్లు , బాణములు , కత్తి , గద ఇత్యాది పదునైన ఆయుధములు ధరించినవాడై , వేటగాండ్రు పరివేష్టింపబడి యుండగా , కిరాత రాజు
రూపమున నున్న స్వామి కాశీరాజు యొక్క రాజభవనము వైపుగా వచ్చుచుండెను.

సముద్రపు జలమే పొంగి పొరలినట్లు అతివేగముగా తన పరివారముతో స్వామి ఏతెంచుటను
దూరము నుండియే గ్రహించిన చారులు వెనువెంటనే విషయాలను మహారాజుకి విన్నవించిరి.
మహారాజుకి నమ్మశక్యము కాకుండెను.

తన రాజ్యముపై వేటగాండ్రు శత్రువులై దండెత్తి వచ్చు విషయము మహారాజునకు మింగుడుపడలేదు. *"మూడుతరముల నుండియు శత్రువులను మాటయే లేకుండు రాజ్యముపై దండెత్తి వచ్చుటయా ? అదియూ వేటగాండ్రు ?”* అంటూ విస్మయమునంది , చేయునది లేక తన
సైన్యముతో యుద్ధమునకు సన్నద్ధమాయెను.

వేటగాండ్ర ధాటికి మహారాజు సైన్యములు నిలువలేకపోయినవి. రాజు సైన్యము వేలకొలది
మంది నేలకూలిరి. బ్రతికి బట్టకట్టిన కొద్దిమంది వీరులు కూడా స్వామి చేత హుంకారనాదము
చెవులబడినంతనే భీతితో మరణించసాగిరి.

చివరిగా మహారాజు కిరాతరాజుతో పోరుకి దిగెను. ఈ సమయమునకై ఎదురుచూచుచున్న
స్వామి మహారాజుతో *“కాశీరాజా ! మూడు తరముల పాటు శత్రుభీతి లేని వంశమునందు పుట్టిన నీవు , ఇష్టము వచ్చిన రీతిని రాజ్యపాలన చేయుదువా ? నీకు తగిన బుద్ధి చెప్పుటకొరకే నేనిటకు వచ్చితిని”* అంటూ గర్జించసాగెను.

రాజు తెప్పరిల్లి , వేటగానిపై బాణములు కురిపించెను. వచ్చిన వేగముతోనే వాటిని వేటగాడు తిప్పికొట్టెను. దిగ్ర్భాంతి చెందిన రాజు మరిన్ని దివ్య అస్త్రములను సంధించెను. కనురెప్పపాటులో అవన్నియు స్వామి పాదములపై పడినవి. మరుక్షణమే కిరాతరాజు తన బాణముతో రధసారధిని పడగొట్టి , రధముపై ఎగురు జెండాలని చింపి పారవైచి , రథమును నుగ్గునుగు చేసి మహారాజుని నేలపాలుజేసెను.

మహారాజుని అతడి పరివారమును తాళ్ళతో బంధింపచేసి , రాజసభకు ఈడ్చుకుని వచ్చునట్లు
ఆజ్ఞాపించెను. మహారాజు , అతడి కుటుంబ సభ్యులు , మంత్రులు , అధికారులు బంధింపబడి అవమాన భారముతో తలలు దించుకుని యుండిరి. విజేతయై ప్రకాశించు కిరాతరాజు అశ్వముపై
గంభీరముగా వెళ్లి రాజసభను చేరి , మహారాజు సింహాసనమును అధిరోహించెను. ధర్మదేవత రూపుదాల్చిన కిరాతరాజు న్యాయవిచారణ మొదలు పెట్టెను. పలు కిరాత కార్యములు చేసిన హిరణ్యవర్మను కారాగారమున బంధింప ఆజ్ఞాపించెను. న్యాయము తప్పి పరిపాలన చేసిన రాజును , అతడిని వారింప యత్నింపమని అతడి భార్యను చెరసాల యందు పడవైచెను.

రాజుకి సహకరించిన మంత్రులు , ఇతరులకు కూడా ఇదే గతియే పట్టింది. మహారాజు కుమార్తె ప్రభావతిని చూచినంతనే మైమరపుతో కనురెప్ప వేయ మరచినవాడెయెను , వెనువెంటనే లేచి *“ఈ సుందరిని మాత్రము విడిచి పెట్టుము. మరియు ఆమెను సకల సౌకర్యములు కలిగిన భవంతిలో బలమైన కట్టుదిట్టములతో కాపలా ఉంచుము”* అనెను.


ఎల్లప్పుడూ మిగతా రాజులందరూ ప్రశంసించు విధముగా పరిపాలన చేయువానిగా పేరొందిన
మహారాజు *“నా పుత్రునిపై నున్న మమకారమే , నాయొక్క ఈ దుస్థితికి కారణము”* అంటూ తాను చేసిన తప్పును పదే పదే మననము చేసుకొనసాగెను. అంతఃపురములో కాపలాదారుల మధ్య నున్న ప్రభావతి మహాశాస్తాని తప్ప వేరొకరిని వివాహమాడనని నిశ్చయముతో నున్న తనకు కేవలము ఒక
కిరాతరాజు రెప్పవేయక చూచినది ఆమె భరించలేకపోయెను.


ప్రభావతి యందు మక్కువ కలిగిన కిరాతరాజు ప్రతిరోజూ అంతఃపురమున కేగి తనను వివాహము చేసికొనట్లు నిర్బంధించసాగెను. కానీ ఆమె అందులకు సమ్మతించకయుండెను. పరిపరి విధముల బ్రతిమాలిననూ కనికరించని ఆమెను సమ్మతింపనిచో జరుగబోవు ఘోర పరిణామములను
చెప్పి భయపెట్టెను , కానీ ఆమె కించిత్తు కూడా భయపడకయుండెను. రోజు రోజుకూ తనను
వివాహమాడుమని ఒత్తిడి తెచ్చుట , ఆమె నిరాకరించుట , ఇదియే దినచర్యగా ఉండెను.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow