*పూర్ణాదేవితో పరిణయం*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి (ABADPS)*
దైవబలమునకు ప్రకృతి ప్రశాంతత తోడైన *'వంజి'* దేశమును పరిపాలించు వాడు పించకవర్మ నామధేయుడు. నీతినిజాయితీపరుడై , దైవభక్తి కలవాడై నీతి తప్పని విధముగా పరిపాలన చేయుచుండెను , అతడి ప్రజలందరూ చాలా దైవభక్తి పరులై యుండిరి. లక్ష్మీ కటాక్షం సమృద్ధిగా కలిగినవాడై వంజి దేశమును ఎంతో సమర్ధవంతముగా పరిపాలించుచుండెను.
పించకవర్మకు తన కుమార్తె అయిన మనోజ్ఞను ఇచ్చి వివాహము గావించినాడు సింధుదేశ మహారాజు. ధర్మము ఉన్నచోటే మహాలక్ష్మి నివాసము కదా ! కైలాసనాధుని ఆశీర్వాదము చేత.
కమలాసని అయిన శ్రీమహాలక్ష్మి అంశయై, దైవభక్తిపరులైన దివ్య దంపతుల కుమార్తెగా (మునుపటి
జన్మమున సత్యపూర్ణుని కుమార్తె అయిన) 'కమల' నామధేయురాలై జన్మించెను.
ఏ కొరతలూ లేని విధముగా జీవితమునందు పరిపూర్ణత్వము పొందిన పింఛుకవర్మ, తన
కుమార్తెను 'పూర్ణ' అను పేరు పెట్టుకొని ఆనందించెను. తన పాలిటి పెన్నిధిగా భావించి
అల్లారుముద్దుగా పెంచుకొనసాగెను. పూర్ణాదేవి దినదిన ప్రవర్ధమానముగా సుందర స్వరూపిణిగా
పెరుగుచుండెను.
చిన్ననాటినుండే , అఖిలాండ నాయకుడైన మహాశాస్తా యొక్క దివ్య మహిమలను వింటూ
పెరిగిన పూర్ణాదేవి మనస్సునందు మహాశాస్తానే తన భర్తగా ఊహించుకొనుచుండెను. కుమార్తె యుక్త వయస్కురాలైన పిదప మహారాజు ఆమెకై తగిన వరుని వెదకసాగెను. ఆమె మనస్సులోని కోరికను తండ్రికి ఎరుకపరచెను.
*ఊహ తెలియని వయస్సు నుండియే నా మనస్సు మహాశాస్తా యందు లగ్నమై యున్నది. అతడిని తప్ప , మరల మరల చావుపుట్టుకులతో మగ్గిపోవు మానవ మాత్రులను వరించబోను'* అంటూ తన అభిప్రాయమును బలపరిచెను. స్వామిని పరిణయమాడుటకై ఆమె ఎన్నియో వ్రతములను
ఆచరించుచుండెను. మానవ జన్మ పొందిన తన కుమార్తె దేవదేవుని వివాహమాడుట ఎట్లు సాధ్యము అంటూ మహారాజు చింతించసాగెను. అతడి అంతరంగము గ్రహించినట్లుగా ఒకనాడు నారద మహాముని ఏతెంచెను. అతిథి సత్కారములు గావించిన పిమ్మట తన మనసులో మాట నారద మహామునికి విన్నవించెను. నారదముని అది విని , నీ కుమార్తె మామూలు మానవ కన్య కాదు. జగన్మాత అంశయే ఆమె. స్వామిని చేరుకొను నిమిత్తమై మానవకన్యగా నీకు కుమార్తెగా జన్మించినది అని దేవరహస్యమును వివరించెను.
*తగిన సమయమునకై వేచియుండుచూ , నీవు స్వామిని పూజించి , ఆరాధింపుము అతడి ఆశీస్సులు అనుగ్రహము కలుగు తరుణము త్వరలోనే ఆసన్నమగునని”* సెలవిచ్చి వెడలెను.
మహారాజు సత్కార్యములను ఎన్నిటినో చేయుచూ , ప్రజలను మంచి విధముగా పరిపాలించు
చుండెను. ఒకసారి అడవిలో ఉండు వన్యమృగములు రాజ్యము పొలిమేరలలో నానా భీభత్సములు
చేయుచుండెను. ప్రజలు విన్నపాలు విన్న మహారాజు మృగములను సంహరించుటకు స్వయముగా తానే కదలివెళ్ళెను. ఒక్కపులిని వెంట తరుముతూ అడవిలోకి వెళ్ళసాగెను. చీకట్లు కమ్ముకున్న
సమయమును కూడా గమనించని వాడయ్యెను. పులి మీదనే దృష్టి కేంద్రీకరించి యుండుటచే పులి వెంబడి వెళ్తున్న మహారాజు అనుకోని విధముగా తన పరివారమును వదలి వేరొక దిశగా వెళ్ళసాగెను. అలా చాలా దూరము వరకూ వెడలిపోయెను. కారడవిలో చిక్కుకున్న
అతడు దిక్కుతోచని వాడయ్యెను. ఎటూ పాలుపోని పరిస్థితిలో చిక్కుకొన్న మహారాజు దట్టమైన కారడవిలోకి
ప్రవేశించినవాడాయెను.
అతడు ప్రవేశించిన ప్రదేశము భూత , పిశాచములు వికటాట్టహాసము చేయు స్థలము. దారి తప్పి వచ్చు మానవులను భక్షించుటయే వాటి పని. అలా వచ్చిన మహారాజుని చూచినంతనే విందు
భోజనమని తలచి అతడిని ఆత్రముగా చుట్టుముట్టినవి. అతడిని సంహరించి భుజించుటకై
ఆత్రపడసాగినవి. ఈ దీన పరిస్థితి నుండి తప్పించుకొనుట మానవమాత్రులకు సాధ్యము కాదని
మహారాజు గ్రహించి , అభయ హస్తములతో కొలువైయుంచు స్వామిని తన్ను కాపాడుమని మనస్సున ధ్యానించెను.
*భూతనాధా అభయం , అభయం'* అంటూ స్వామిని అభయము కోరెను. శరణాగత వత్సలుడైన శాస్తా మరుక్షణమే నేనున్నానంటూ ప్రత్యక్షమాయెను. అతడిని చుట్టుముట్టి , మాంస భక్షణకై వేగిరపడు భూత , ప్రేత పిశాచములు స్వామిని చూచినంతనే గడగడ వణుకుచూ పారిపోయినవి.
పింఛుకవర్మ తనను కాపాడి రక్షించిన భూతనాధునికి నమస్కరించెను. జగన్మోహినీ పుత్రుడైన
మోహనరూవుని చూచి ఆనంద తన్మయుడయ్యెను. పూర్ణ బ్రహ్మ స్వరూపుడైన స్వామికి తన కుమార్తె
అయిన పూర్ణాదేవితో వివాహమాడగోరెను.
*“భూతపిశాచముల బారినుండి నన్ను కాపాడిన భూతనాధా !అన్నంతమాత్రమునే లభ్యము కాని నీ దివ్య దర్శనమును ప్రసాదించిన నీకు నేనేమి ఇచ్చుకొనగలను ? దీనికి బదులుగా నిన్ను తప్ప వేరు ఎవరిని వివాహమాడునని భీష్మించుకొని , నిన్నే సదా కొలుచు నా కుమార్తెను పరిణయమాడుము”*
అంటూ మహారాజు వేడుకొనెను. అందులకు శాస్తా *"మహారాజా ! మునుపటి జన్మలో ఆమె చేసిన పుణ్యము , తపస్సుకు ఫలితముగానే ఈ జన్మలో నీకు కుమార్తెగా జన్మించినది. సంప్రదాయ రీతిలో ఆమెను నేను వివాహము చేసుకొనెదనెను”* అంటూ బదులిచ్చెను.
నటన సూత్రధారి అయిన స్వామికి ఇవన్నీ మామూలే కదా ? తనకొరకై తపస్సు చేయుచున్న పూర్ణాదేవి వద్దకు స్వామి వృద్ధ శివభక్తుని వేషముబూనివెళ్ళెను. అతడికి సకల ఉపచారములు గావించిన ఆమె స్వామితో తనకు వివాహము కాగల ఉపాయము తెలుపమనెను. *“సకల లోకములకు సృష్టి , స్థితి , లయకారకుడైన శాస్తా అను పరబ్రహ్మ స్వరూపుడు నాకు అందని మాట నిజమే. కానీ అతడినే భర్తగా వరించు ఇచ్ఛతో బాల్యము నుండియే భక్తి శ్రద్ధలతో తపస్సు చేయుచుంటిని. అతడు నన్ను వరించు ఉపాయము తెలిపి “నన్ను ఆశీర్వదింపుము”* అనెను.
వృద్ధుని వేషములో నున్న స్వామి ఆమెతో *“అమ్మా ! నీవు కోరినట్లే ఆశీర్వదించుటకు మనస్సు అంగీకరించటం లేదు. అతిరూప లావణ్యములతో అలరారు నీకు అతడు తప్ప మరొకరు దొరకలేదా ? అతడు హరిహరపుత్రుడు. హరి , హరుడు అను ఇరువురు మగవారికి పుట్టినవాడు , సద్గుణవతియై , మంచి కులమున పుట్టిన నీకు అతడు ఎట్లు తగినవాడగును ? అదీగాక అతడికి ఇదివరకే నేపాళ యువరాణి పుష్కలతో వివాహము జరిగినది. నీకెందులకీ కోరిక”* అంటూ పరిహాసమాడుచూ చిరునవ్వుతో ఆమె ఆంతర్యము గమనించసాగెను.
ఈ మాటలతో పూర్ణాదేవికి మిక్కిలి కోపము కలిగెను. ఆమె మండిపడుచూ *"అయ్యా ! దైవలీలల పరమార్ధమును తెలిసికొనలేని నీవేమి శివభక్తుడవు ! నారాయణుడు , పరాశక్తి ఇరువురూ ఒక్కరే కదా. ఒకే శక్తిగా , స్త్రీరూపిణి పార్వతిగానూ పురుషరూపునిగా పరంధాముడు భాసిల్లలేదా ? అటుల మహావిష్ణువు , శక్తిరూపిణితో లీనమై ధరించిన మోహిని అవతారము నుండి జనియించినవాడు కదా మహాశాస్తా అతడు ధరించిన అవతారములలో ఇదియు ఒకటి కదా !*
*ఆ పరబ్రహ్మ స్వరూపుని చేరుటయే జీవిత పరమార్ధము. అంతియేగాని సామాన్య మానవుని వలె అతడితో గృహస్థ ధర్మమును , ఆచరించుటకు కాదు.”* అని ఆవేశముగా బదులిచ్చెను.
వెంటనే తన నాటకమునకు తెరదింపు విధముగా , దివ్యమంగళ తేజస్వరూపుడై ప్రత్యక్షమయ్యెను.
*“పూర్ణాదేవీ ! నిన్ను పరీక్షించుటకై నేనిట్లు వేషముబూనితిని. నీ భక్తికి మెచ్చితిని. త్వరలోనే సంప్రదాయ రీతిలో నిన్ను పాణిగ్రహణము చేయుదునని తెల్పి అంతర్ధానమయ్యెను.*
జరిగినదంతయూ తెలిసికొన్న హరి , హరులిరువురూ వివాహము చేయుటకు ఒక మంచి శుభదినమును నిశ్చయించిరి. బ్రహ్మదేవునిచే లిఖింపబడిన శుభలేఖను తీసికొని , భార్యా సమేతుడై నందీశ్వరుడు పయనమై వెళ్ళి పింఛుకవర్మను చేరి , అతడిని ఆశీర్వదించి , వివాహం జరుగు
శుభదినమును సూచించెను. పెళ్ళిపనులు ఆరంభమయ్యెను.
*'వంజి'* దేశమంతయూ పెండ్లి కోలాహలము కానవచ్చెను. పదునాలుగు లోకముల వారునూ
వివాహము చూచుటకై తరలివచ్చిరి. వచ్చినవారు బస చేయుటకై సుందరమైన హర్మ్యములు ,
భవనములు , గోపురములు , మండపములు , తటాకములు నిర్మించబడినవి.
పెండ్లి కొడుకై తరలివచ్చు దైవాంశ సంభూతునికి ఆహ్వానము పలుకుటకై రాజ్యమంతయూ
పూజా గృహము వలె గోచరించినది. రాజ్యములోని ప్రజలందరూ , అరుదైన ఈ అవకాశమును
ఆస్వాదించుటకై తరలివచ్చిరి. స్వామిని తలచిన మాత్రముననే తమ లోపములు తొలగిపోయిన చెవిటివారు , గ్రుడ్డివారు , మూగవారు సైతము మహాశాస్తా యొక్క మంగళకరమగు ఈ వివాహమును దర్శించుగోరి ఎంతో ఆనందముగా వచ్చిరి.
దేవదానవులు , ఋషిగణములు , మునివర్యులు అందరూ హాజరైనారు. పరమశివుడు ,
పరంధాముడు వెంటరాగా , మహాకాలుడు శక్తివంతమైన ఖడ్గమును చేతబూని వచ్చుచుండగా , దేవతా స్త్రీలు మంగళహారతులు ఈయగా , బ్రహ్మదేవునిచే ఆశీర్వదింపబడి , ఈయబడిన పూర్ణకుంభమును చేత ధరించి , కల్యాణమండపమునకు చేరుకొనిన శాస్తా నవరత్న ఖచిత సింహాసనమును
అధిరోహించెను.
నంది దేవుని భార్య అయిన సుయశ , బ్రహ్మ పత్ని అయిన సరస్వతీ దేవి ఇరువురూ పూర్ణాదేవిని అతి సుందరముగా అలంకరించి , పెండ్లికుమార్తెను చేసిరి.
ముల్లోకాధిపతులందరూ ఆశీర్వదించగా , పరాశక్తి , పరమశివుడు మొదలగు వారందరూ వివాహ
కార్యమును వీక్షించుచుండగా పింఛుకవర్మ *“నా ప్రియ పుత్రిక అయిన పూర్ణాదేవిని నీకు కన్యాదానము చేయుచున్నాము. నీవు ఆమెను పరిగ్రహించి, పరిణయమాడుము”* అంటూ కన్యాదానము చేసెను. పిమ్మట పెద్దలందరూ ఆశీర్వదించుచుండగా స్వామి పూర్ణాదేవి మెడలో మూడు ముళ్లు వేసి
పరిణయమాడి తన భార్యగా చేసికొనెను.
*పూర్ణా ఫింఛుక సంభూతా శాస్త్రు దక్షాంగ మాశితా*
*సహస్ర కిరణాత్ వుల్ల పంకజాభా ననా వతు*
*(పూర్ణాదేవి ధ్యానశ్లోకం)*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*