శ్రీ మహాశాస్తా చరితము - 35 భువనేశ్వర శాస్తా

P Madhav Kumar

*భువనేశ్వర శాస్తా*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి  (ABADPS)*

పూర్వము కావేరి తీర ప్రాంతపు దేశమున చోళ దేశమును , మహాశాస్తా యొక్క పరమ భక్తుడైన
*'సోమకాంతుడు'* అను రాజు పరిపాలించుచుండెను. ఎదురు చూడని విధముగా ఒక దండయాత్రలో ఘార్జర దేశపు రాజు వద్ద ఓడిపోయెను. తన భార్యతో సహా తన దేశపు పరిసరాలను వీడి ఘోర
కాననములలో అజ్ఞాతముగా తల దాచుకొను దుస్థితి ఏర్పడినది. ఇంతటి దుర్భాగ్య పరిస్థితులలోనూ
తన స్వామి భక్తిని మాత్రము వీడలేదు. విపత్తులనుండి తనను స్వామి ఎటులైననూ కాపాడి తీరునను
నిశ్చయముతో నుండెను. పరి పరి విధములుగా ప్రార్థించుచుండెను. ధృడమైన భక్తికి స్వామి
ఎల్లపుడూ కట్టుబడి యుండువాడే కదా ! ముందుగా కష్టములు కలుగునట్లు చేయువాడూ , ఆ పిదప
సద్గతుల కలుగజేయువాడూ ఆ స్వామియే కదా ! దుఃఖనాశకుడైన శాస్తా తన భక్తుని కాపాడుటకై
ఉద్యక్తుడైనాడు. అదే సమయమున సింధు దేశపు రాకుమార్తెలను చేపట్టు ఉపాయము పన్నెను.

శాస్తాని పలు తెరలుగ ప్రార్థించుచున్న సోమకాంతుని ముందు స్వామి ప్రత్యక్షమాయెను.
మహారాజు , అతడి భార్య స్వామిని చూసి దిగ్ర్భాంతులై ఆనంద పరవశమున ఓలలాడిరి.

వారిరువురినీ స్వామి ఆశీర్వదించి , *“సోమకాంతా ! నేటితో నీ బాధలన్నియూ తీరి పోయినవి. నీవు పోగొట్టుకున్న రాజ్యము నీకు మరల దొరకును. సంతానము లేని నీకు సత్ పుత్ర సంతాన యోగము కలుగును. కానీ నాకు మీరొక సహాయము చేయవలయును. నాయందుగల అమితమైన భక్తితో , సదా నన్ను ధ్యానించుచూ , నన్నే భర్తగా పొందవలయునన్న ధృడ నమ్మకము గల సింధు దేశపు రాకుమార్తెలను నేను పరిణయమాడవలయును. అందులకై మీరిరువురూ నా తల్లిదండ్రులుగా ప్రవర్తించవలయును”* అని కోరెను.

ఇంతటి భాగ్యము ఎవరికి లభించును ? అడిగినదే తడవుగా స్వామి యెక్క ఆజ్ఞానుసారము
నడచుకుందుము అని రాజదంపతులు సమ్మతించిరి.

ఇక సింధు దేశమున - రోజుకొక రాకుమారులు వచ్చుటయూ , మల్ల యోధుల చేత
ఓడింపబడుటయూ జరుగుచుండినది. స్వప్నమున కనిపించిన కారుణ్యమూర్తి యొక్క ఆగమనమునకై
రాకుమార్తెలు ఎదురుచూచుచుండిరి.

ఒకనాడు సర్వరక్షకుడైన భగవంతుడు , సౌందర్యము మూర్తీభవించిన ఒక అందమైన యువకుని
వేషముబూని , చోళదేశపు రాకుమారునిగా సోమకాంత దంపతులతో ఏతెంచెను.

సోమకాంతుడు , సింధు దేశపు మహారాజు చేసిన సత్కారములను గైకొని ఇట్లనెను. *“మహారాజా ! చోళదేశపు మహారాజైన నేను , విధివశాత్తూ ఘూర్జర దేశపు రాజుచేత ఓడించబడి , కాననములయందు వసియించు దుస్థితి కలిగినది. అక్కడ జన్మించిన నా కుమారుడైన ఇతడు భువనేశ్వర నామధేయుడు. సౌందర్యవతులైన మీ కుమార్తెలతో వివాహము చేసికొనుటకై వచ్చితిమి. అందులకు గానూ మీరు పెట్టిన షరతు ప్రకారము మా తనయుడు యుద్ధరంగమున మీ దేశపు మల్ల యోధులను ఓడించి మీ కుమార్తెలను వివాహమాడగలడు. మీ అంగీకారము కావలయును”* అని ప్రార్థించెను.

చూచినంత మాత్రముననే వచ్చినది. స్వామియే యని రాకుమార్తెలు గ్రహించిరి. యువకుని
చూచిన క్షణము నుండి సింధు దేశపు రాజునకు ఎంతగానో ఆనందము కలిగినది. క్షణము కూడా
ఆలస్యము చేయక మల్ల యుద్ధమునకు ఏర్పాట్లు గావించెను. కనులు మూసి తెరచునంతలో
వేలకొలది అసురులను అవలీలగా సంహరించు స్వామి ముందు ఈ మానవ మల్ల యోధులు
ఎంతమాత్రము ? చూచు వారందరూ హర్షించు విధముగా క్షణమాత్రమున మల్లురను ఓడించి
విజయుడై స్వామి ఏతెంచెను.

సింధుదేశపు మహారాజు శుభకీర్తి ఆనంద పరవశుడై *“ఏ దేశపు రాకుమారులకూ సాధ్యము కాని కార్యమును చేసి , విజయుడైన రాకుమారునికి త్వరలోనే ఒక శుభ ముహూర్తమున నా దేశములో సగ భాగమును , నా కుమార్తెలిరువురినీ ఇచ్చి వివాహము గావించెదను”* అని పలికెను.



*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat