శ్రీ మహాశాస్తా చరితము -41 కిరాతార్జునీయము (కిరాతశాస్తా)

P Madhav Kumar

*కిరాతార్జునీయము (కిరాతశాస్తా)*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి  (ABADPS)*

ప్రేమకు మారుపేరైన తల్లి. తన బిడ్డల పట్ల ఎంత ప్రేమ పంచిననూ , ఒక్కొక్కమారు , వారు
చెడు మార్గమున పోవునపుడు వారిని దండించి , వారిని మంచి మార్గమునకు మళ్ళించు బాధ్యతయూ ఆమెదే కదా. అటులనే సౌమ్యమూర్తి అయిన శాస్తా మంచి వారిని కాపాడి రక్షించినట్లుగానే ,
దుష్టులను శిక్షించుటకుగానూ ఉగ్రరూపమును కూడా దాల్చుచుండెను.

మహాభారత సమయమున , కౌరవుల యొక్క మాయోపాయము వలన పంచపాండవులు తమ రాజ్యమును కోల్పోయి అడవి కేగిరి.

శత్రువులను అణచుటకు కావలసిన బల పరాక్రమములను బడయుటకై ధర్మజుని ఆనతిమేరకు , అర్జునుడు పాశుపతాస్త్రము కోరి శివునికై తపోదీక్ష పూనెను.

అర్జునుని తపస్సునకు మెచ్చిన పరమశివుడు , వరమునిచ్చుటకు ముందుగా కొంతసేపు అర్జునునితో
నాటకమాడనెంచెను. కిరాతమూర్తిగా. వేటగానిగా మారగా , పార్వతీదేవి వేటగాని భార్యగానూ ,
భూతగణములు వేట గాండ్రుగానూ మారిపోయిరి.

*"పంచవింశతి వర్దోసౌ మయూరకృత శేఖరః*
*సమావృతో బాలకైశ్చ స్వచ్ఛాబి మనోహరై ||*

అనునట్లుగా ఈశ్వరుడు ఒక అందమైన యువకునిగా మారి , తన పరివారముతో వేటకు
వచ్చెను.

అర్జునుని ఆశీర్వదించుటకై రూపుమార్చి బయలుదేరిన శివపార్వతుల వెంట , తాను కూడా ఒక
కిరాత రూపధారియై వెన్నంటి వెడలినాడు శాస్తా. అందుచేత అతడు కిరాత సూను , కిరాత శాస్తాగా పిలువబడెను.

ఇంతలో తపస్సు చేయుచున్న అర్జునునికి తపోభంగము కలిగించి , అతడిని చంపుటకై పంది
రూపము ధరించిన మూకాసురుడు అను రాక్షసుడు దుర్యోధనునిచే పంపబడెను. ఈశ్వరునికి
తోడుగా వెన్నంటి వచ్చిన శాస్తా , పంది రూపము ధరించి వచ్చిన రాక్షసుని మూలముగానే అర్జునునికి ఆశీర్వాదము కలుగనెంచెను.

సహజముగా శాంత స్వభావము కల ముళ్ళ పంది , ఎవరైననూ దాని ఉసి గొల్పినచో , క్రూరముగా మారిపోయి కయ్యమునకు కాలుదువ్వును. ఈశ్వరుని అనుమతితో , పంది రూపమున ఉన్న రాక్షసుని ఉసిగొల్పి , అర్జునుడు ఉన్న ప్రదేశము వరకు ఉగ్రముగా పరుగెత్తు విధముగా తరిమికొట్టెను.

పంది రూపమున ఉన్న అసురుడు తిన్నగా వెళ్లి అర్జునునిపై లంఘింపబోవగా , కిరాతమూర్తి తన బాణముతో పడవైచెను. ఎదురుచూడని విధముగా , జరిగిన సంఘటన చూచి తెప్పరిల్లిన అర్జునుడు కూడా ఏకసమయమున పందిని ఎదుర్కొనెను. రాక్షసుడు మరణించెను. వేటగాండ్రుగా వచ్చిన వారు తమ నాయకుని వేనోళ్ళ కొనియాడిరి. వచ్చినది సాక్షాత్తు శాస్తాయేనని తెలియని
అర్జునుడు పందిని చంపినది తానేనని గొప్పలు పోయెను. వాదప్రతివాదనలు జరపిన పిమ్మట అర్జునుడు కిరాతకునితో యుద్దము చేయసన్నద్ధమాయెను. పినాకపాణి అస్త్ర శస్త్రముల ముందు
గాండీవమే మూగబోయినది. తరువాత మల్లయుద్దమునకు ఆయత్తమాయెను. ఎంత ప్రయత్నించిననూ
కిరాతకుని మట్టి కరచునట్లు చేయలేక పోయెను. ఒక ఘట్టమున కిరాతకుని కాలుపట్టి భూమికి ఈడ్చబోయెను అర్జునుడు. తన పాదముల శరణన్న వారిని (పట్టుకొనిన వారిని) ఆశీర్వదించి ,
కాపాడు లక్షణముగల ఈశ్వరుడు తన నిజరూపముతో ప్రత్యక్షమై , అర్జునుని ఆశీర్వదించి ,
పాశుపతాస్త్రమును ప్రసాదించెను.

కిరాత శాస్తా , విజయుని యుద్ధమున ఓడించి పాశుపతాస్త్రమును ప్రసాదించెను. *“దయతో పాశుపతాస్త్రమును ప్రసాదించిన శాస్తా , శరణం శరణం !! ”*

కిరాత రూపము దాల్చిన శాస్తా కరములందు అస్త్ర శస్త్రములు ఆడుకొనసాగెను. రుద్ర
కుమారుడు , ఉగ్రరూపము దాల్చి అన్యాయముగా బాధించు రాక్షసులు పలువురిని వేటాడి మరీ సంహరించెను. కిరాత రూపుడై విల్లు బాణములు ధరించి , వీరాది వీరుడై , వేటగానిగా ధరణి
యందు అవతరించిన శాస్తా శ్లాఘనీయుడు.

*కోదండం సచరం భుజేన భుజగేంద్ర భోగ పాశావహన్*
*వామేన ఛురికాం విపక్షతలనే భక్షేణ దక్లణచ |*

*కాంత్యా నిర్జిత నిరదః పురపిత : క్రీడాన్ కిరాతా కృతే :*
*పుత్రోస్మోక మనల్ప నిర్మల యశా నిర్మాతు కర్మానిచం ||*

అడవి యందుండు క్రూర మృగములను వధియించుటయే వేట గాండ్ర పని. మన మనస్సు అను అడవియందుండు కామక్రోధములను , క్రూర మృగములను సంహరించి , మనలను ఉన్నతులను చేయగోరి , శాస్తా ఎత్తిన అవతారమే ఈ కిరాతశాస్తా అవతారము.

తనను నమ్మిన భక్త జనులకు కలుగు కష్టములను తొలగించి వారిని కాపాడు దైవము శాస్తా.




*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat