*కాల శాస్తా*
*యమునికే యముడైన శాస్తా*☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి (ABADPS)*
ధర్మమునకు మారు పేరుగా భాసిల్లు నేపాళ దేశమునందు శాస్తా యొక్క పరమ భక్తులైన *'సోమశర్మ'* యను బ్రాహ్మణుడు నివసించుచుండెను. శీలవతియైన అతడి భార్యపేరు సుకళ , వారికి *'కళాధరుడు'* అను కుమారుడు కలిగెను. జాతక సంస్కారములు పిమ్మట తన కుమారుని భవిష్యత్తు తెలిసికొనగోరి , జ్యోతిష్కుల నడుగగా , బాలకుని ఆయువు పండ్రెండు సంవత్సర కాలము మత్రమే నని తెలిసినది.
తల్లి దండ్రులు మిక్కిలి దుఃఖించిరి. విధిని తప్పించ ఎవరి తరము అని తమకు తామే సమాధానము చెప్పుకొనిరి. కాలము గడచి , ఉపనయన సంస్కారములు చేసిరి. సోమశర్మ అంతటితో వదలక. తన కుమారునికి మహాశాస్తా యొక్క మూలమంత్ర జపమును ఉపదేశించెను. కళాధరుడు కూడా తండ్రికి తగిన తనయుడై మహాశాస్తా యొక్క మూల మంత్ర జపమును నిత్యమూ చేయుచూ శాస్తాన్ని ఆరాధింపసాగెను.
ఒకనాడు తపస్సంపన్నుడైన భృగుమహర్షి వారి గృహమునకు ఏతెంచెను వారిని సాదరముగా ఆహ్వానించిన సోమశర్మ దంపతులు వారికి అతిధి మర్యాదలు జరిపిన పిమ్మట , తమ కుమారుని అల్పాయువును గురించి తెలిపి. దాన్ని తప్పించుటకు ఏదైనా మంచి మార్గమును చూపుమని ప్రార్ధించిరి. భృగుమహర్షి వారిని ఆశీర్వదింపగోరి , ఎంతటి దుస్థితి నైననూ మార్చగలుగు గొప్పవ్రతము ఒకటి కలదనియూ , ఆ వ్రతమును ఆచరించు వారిపట్ల సదా అభయముద్రను కలిగియుండు శాస్తా ప్రీతియై యుండుననియూ తెల్పెను. అది ఏమనగా ప్రతి శనివారమూ ఆచరింపబడు శనివారవ్రతము. కోరిన కోరికలను నెరవేర్చు కల్పవల్లి వంటి ఈ వ్రతమును దంపతులు ఇరువురూ భక్తిగా ఆచరించినచో వారి దుఃఖము తొలగునని చెప్పెను.
ముని యొక్క మాటలను ఆలకించిన సోమశర్మ దంపతులు అతడి ద్వారా వ్రతవిధానము నెరింగి శనివార వ్రతమును ఆచరించసాగిరి.
ఇంతలో కళాధరునికి పండ్రెండేళ్ల వయస్సు వచ్చినది. ఎప్పటివలెనే కళాధరుడు ఎంతో నియమ నిష్టలతో శాస్తా యొక్క పూజ యందు నిమగ్నుడై యుండెను. ఆ సమయమున , విధి నిర్వహణకు పేరు గాంచిన యమధర్మరాజు , యమపాశముతో కళాధరుని గొనిపోవుటకై వచ్చి , మంచి చెడ్డలు మరచిన వాడై , పూజయందు నిమగ్నుడై యున్న కళాధరుని మెడలో పాశము వేసెను.
సదా భక్తులను కరుణతో కాచు దయాపరుడైన శాస్తా ఊరకుండునా ? పూజయందు నిమగ్నుడై
యున్న విషయమును చూచియూ , యమపాశము వైచిన యముని చూచి కోపోద్రేకుడై భీకరరూపుడై
ప్రత్యక్షమాయెను.
అతడి రూపము ఎట్లుండెననగా దట్టమైన నల్లని కురులను కలిగియూ , కాలుమేఘము వంటి
నల్లటి ఛాయను కలిగి , కర్పూరము మొదలగు వాసన ద్రవ్యములను మేనియందు పూసుకొనిన
ఆకృతికలిగి , నాలుగు చేతుల యందునూ దండము , అంకుశము , పాశము , శూలము అను
ఆయుధములను ధరించిన కాలశాస్తాగా రూపుదాల్చెను. అది చూచిన యమధర్మరాజునకే దడ
పుట్టెను. యమునికే యముడైనట్లుగా తన పాశముతో యముని పడవైచెను. యమధర్మరాజు
మరణించెను.
కళాధరుడు , అతడి తల్లి దండ్రులు ఎంతగానో సంతోషించి. ఆనంద భాష్పములు కురియుచుండగా ,
పలువిధములుగా స్వామిని స్తుతించిరి. భగవానుడు ప్రీతిచెంది శనివార వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన ఫలితముగా తాను మిక్కిలి సంతుష్టుడైన విధమును తెలుపుచూ , ఆ వ్రతకారణముగా
అల్పాయుష్కుడైన కళాధరునికి పరిపూర్ణ ఆయువునొసంగి , జీవించి యున్నంత కాలము తన
యందున్న భక్తి శ్రద్ధల కారణముగా ఏ కొరతయూ లేక జీవించి , అంతమున తమ సన్నిధిని చేరు మార్గమును సూచించెను. ఈ వ్రత ఫలితముగా కళాధరుడు. అతడి తల్లి దండ్రులు సంతతి యావత్తు ఉన్నతిని పొందునట్లుగా స్వామి ఆశీర్వదించెను.
యమధర్మరాజు మూర్చిల్లుటతో భూమియందు మరణించువారే లేక భూభారము అధికమాయెను.
భారము మోయలేని భూదేవి బ్రహ్మతో మొరపెట్టుకొనెను. విషయమును గ్రహించిన బ్రహ్మదేవుడు శాస్తు లోకమునకు తరలివెళ్ళెను. అచట సభయందు , తేజోమూర్తిగా , పరంజ్యోతి స్వరూపునిగా
వెలుగొందు శాస్తాని చూచి *"ప్రభూ ! భూభారం పెరిగిపోవుచున్నది. ఈ దుస్థితి నుండి కాపాడుటకు గానూ , యమ ధర్మరాజుని మరల పునరుజ్జీవితుని చేసి సృష్టికార్యమును కాపాడుము”* అని
ప్రార్థించెను.
కరుణా సముద్రుడైన శాస్తా యముని మరల పునరుజ్జీవితుని చేసెను. తప్పును తెలిసికొన్న
యమధర్మరాజు తనను మన్నింపు మనియూ ఇటువంటి తప్పులను మరల చేయబోవుననియూ
ప్రార్థించెను.
స్వామి అతడితో *“యమధర్మరాజా ! పుట్టిన ప్రతి ప్రాణీ , గిట్టక తప్పదు. అదియే ధర్మము. నీవు ధర్మమును నెరవేర్చనెంచుట మెచ్చదగినదే. కానీ నాయందు అపారమైన భక్తి శ్రద్ధలు కలిగి యుండు వారిని బాధింపకుము. వారు సదా నా అనుగ్రహమునకు పాత్రులైనవారు”* అంటూ హెచ్చరించి
పంపెను.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*