*బ్రహ్మదేవుని అహంకారమును అణచిన వైనము*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి (ABADPS)*
*ముల్లోకములను పరిపాలించు స్వామి యొక్క ఆశీర్వాదములను గొనుటకై ఒకమారు ఇంద్రాది దేవతలు ఏతెంచిరి. స్వామిని పలు పలు విధముల స్తుతించగా సులభ వల్లభుడైన స్వామి వారిని ఆశీర్వదించెను అంతలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అచటకు వచ్చెను. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సృష్టి రహస్యమంతయూ తనకు మాత్రమే తెలుసునన్న అహంకారములో యుండినవాడై మిగతా వారందరూ నమస్కరించిననూ , తాను మాత్రము నమస్కరించు ఇచ్చలేనివాడై నిలబడి యుండెను. త్రిమూర్తులలో నొకడినై , సృష్టికార్యమును చేయునేను. మొదటివాడినై యుండి పలువురు నన్ను స్తుతించి , తపముచేసి నాచే వరములందుకొనుచుండగా , శివకేశవులకు జన్మించిన ఈ బాలకునికి నేను వందనము చేయుటయా"* అని మిన్నకుండెను.
సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా విధివశమున పడిన వాడయ్యెను. నేను అను అహంకారము అతడిని కూడా లొంగదీసుకునినది. మౌనముగా మిన్నకుండిన అతను సభ నుండి వెడలిపోయెను.
సత్యలోకమును చేరిన బ్రహ్మదేవుడు సృష్టికార్యమును మరల ప్రారంభించెను. కానీ అతడి పని సజావుగా సాగకుండెను. ఎన్ని విధముల ప్రయత్నించిననూ అవరోధము కలుగుచునే యుండెను. ఈశ్వరుని ప్రార్థించి , తనను ఈ స్థితినుండి కాపాడుమని కోరుటకు అతడికి తన చేత సృష్టింపబడినవే వేదములు సైతము జ్ఞప్తికి రాకుండెను. మనస్సున అలజడి పొడసూపగా చేయునదిలేక కైలాసమునకు వడివడిగా బోయెను. అచట పార్వతీ దేవితో కొలువైయున్న సదాశివుని శరణుగోరెను.
*"పరమేశ్వరా ! చతుర్వేదములు నాకు జ్ఞప్తికి రాకయున్నవి. సృష్టికార్యము సజావుగా సాగుట లేదు. కారణమేమై యుండునో తెలియకున్నది. ఏదైనా రాక్షస మాయ నన్ను ఆవరించి యుండునని భయముగా నున్నది. తమరే ఈ దుస్థితి నుండి నన్ను కాపాడుదురుగాక”* అని పరిపరి విధముల ప్రార్ధించెను.
అంతకు మునపే జరిగిన విషయమును ఎరిగియున్న పరమేశ్వరుడు *"చతుర్ముఖా ! నీకు కలిగిన ఈ దుస్థితి కారణము రాక్షసమాయకాదు , నీలోనే దాగియున్న అహంకారమాయమే. త్రిమూర్తులకన్ననూ , గొప్ప స్థానమున నున్న మహా శాస్తా యొక్క గొప్ప దనము తెలియక , అతడిని అలక్ష్యపరచితివి. అతడు సేవలను నాయొక్క పుత్రుడై కదా అని మిన్నకుంటివి. ఒకానొక కల్పమున హరిహరులమైన మాకు పుత్రునిగా దైవాంశ సంభూతిగా జన్మించవలసి వచ్చినది. అతడు కారణజన్ముడు. అందరి చేతనూ నమస్కరింప దగినవాడు అతడిచే సృష్టించబడిన ప్రపంచము. సృష్టి , స్థితి , లయ కారకత్వములతో పాటు మాయ చేయుటయూ , కాపాడి ఆశీర్వదించుటయూ అతడి పనియే.*
*ఇది గ్రహించని నీవు , అతడిని తక్కువగా అంచనావేసి , అవమానించుట వలననే నీకు ఈ దుస్థితి కలిగినది. శక్తి స్వరూపుడై , పరబ్రహ్మ స్వరూపుడైన శాస్తాని శరుణుకోరుట తప్ప నీకు వేరు దారిలేదు" అనగా* , తప్పు తెలిసికొన్న వాడైన బ్రహ్మదేవుడు శాస్తాని ధ్యానించి స్తుతించెను. భూలోకమున నున్న జాప్యేశ్వర క్షేత్రమున స్వామి కొలువై యున్న స్థలమునకు పోయి , ఒక మండలము పాటు పూజించిన పిమ్మట తేజస్వరూపుడైన స్వామి అతడి ముందు సాక్షాత్కరించెను. బ్రహ్మదేవుడు తన తప్పు మన్నింపుమని పలు విధముల క్షమాపణ కోరి , సృష్టికార్యమునకు ఎట్టి ఆటంకమూ కలుగ కుండునటులు చేయుమని ప్రార్థించెను.
కరుణా సముద్రుడైన భగవానుడు *"అహంకారమును వదలి , నీవు చేసిన ప్రార్థనలకు మెచ్చితిని. చతుర్వేద మూర్తి వైన నీవు మరల నీయొక్క సృష్టికార్యమును చేపట్టుము."* అని ఆశీర్వదించెను.
స్వామి ఆశీర్వాద అనంతరము , తన యొక్క సత్యలోకమునకు తిరిగి పోయిన బ్రహ్మదేవుడు , మధ్యలో ఆగిపోయిన సృష్టి కార్యమును మరల ప్రారంభించి సదా స్వామి యొక్క ధ్యానములో మునిగియుండిన వాడయ్యెను.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*