శ్రీ మహాశాస్తా చరితము - 45 కాళికేయాసురుని వధ*

P Madhav Kumar

*కాళికేయాసురుని వధ*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి  (ABADPS)*

అసురకులమునందు జన్మించిన వారికి మొండితనము , మూర్ఖతనము ఎక్కువే. ఒక్కొక్కమారు
ఆ మొండితనము , మూర్ఖత్వము మంచికి కూడా దారితీయును.

రక్కస కులము నందు జన్మించిననూ , పరమశివుని యందు భక్తి భావము కలిగియుండి , సదా స్వామినే స్మరించు చుండినది సుగంధిని యను రాక్షసకన్య. కుల సంప్రదాయము ప్రకారము
స్థూలకర్ణుడు అను రాక్షసుని వరించినది. కొంత కాలమునకు గర్భము దాల్చినది.

*విధిని ఎదిరింప ఎవరి తరము ?* పరమభక్తురాలైన సుగంధిని భర్త అయిన స్థూలకర్ణుడు
అన్నింటా ఆమెకి వ్యతిరేక స్వభావము కలిగిన వాడు అసలు సిసలు రాక్షస గుణములు కలిగినవాడు.

ఒకనాడు అడవిలో ఆడుకొనుచున్న ముని బాలకుడు  వానిని చూచిన స్థూలకర్ణునునికి ,
నరమాంసము రుచి చూడవలెనను కోరిక కలిగి , ఆ బాలకుని తినుటకై బంధించి కొనిపోయెను.

ఎంత వెతికిననూ , తన కుమారుని జాడ తెలియని మునివుంగవుడు కడకు తన కుమారుడు
రాక్షసుని కబంధ హస్తముల నుండుట చూచి మిక్కిలి దుఃఖించెను. బాలకుని వదలివేయుమని
దీనముగా ప్రార్థించెను. తన మూర్ఖపు పట్టుదలతో , పైశాచికత్వము అధికమైయున్న ఆ రాక్షసునికి
మునివుంగవుని ఆక్రందనలు చెవికెక్కక పోయెను. ఎంత ప్రార్థించిననూ రాక్షసుని మనస్సు కరుగకుండుట చూచిన , ఆ ముని పుంగవునకు కోపము వచ్చి , చేయునది లేక పరమశివుని విభూతిని మంత్రించి ఆ రాక్షసునిపై చల్లగా అతడి తల ఛేదింపబడి , బాలకునితో ముని తన నెలవుకు పోయెను.

భర్త మరణముతో సుగంధిని ఎంతగానో దుఃఖించసాగినది. తన జీవితము ఇట్లైపోయినదే యని వేదన చెందసాగెను. సుగంధిని భర్త అయిన స్థూలకర్ణుని సోదరుడైన *'సుముఖుడు'* అనువాడు , తన
వదిన గారిని ఓదార్చు చుండెను. ఆమెకు పక్కబలముగా యుండి ఆమెను కాపాడుచుండెను.

కొంతకాలమునకు సుగంధిని ఒక మగ శిశువును ప్రసవించెను. అతడికి *'కాళికేయుడు'* అని నామమునిడి అల్లారుముద్దుగా పెంచుకొనసాగెను అతడు పెరిగి పెద్దవాడై తన తండ్రికి కలిగిన
దుస్థితి నెరిగి మిక్కిలి కోపము బూనెను.

ఋషులకు , దేవతలకు గల శక్తికి ఆధారభూతమైన మంత్ర శక్తులను నశింపజేయుదునని
ప్రతినబూనెను. అందులకై బ్రహ్మదేవుని గూర్చి కఠిన తపస్సు చేయబూనెను. కఠోరమైన తపస్సు
ఫలించి బ్రహ్మదేవుడు సాక్షాత్కరించెను.

మూర్ఖునికి బుద్ధిబలము తక్కువ అను మాట నిజమగునట్లే , భవిష్యత్తున జరుగబోవు శాస్తా ఆవిర్భావమును తెలిసికొను జ్ఞానము లేనివాడై , ఇరువురు మగపురుషులైన దేవతలకు సంతానము
కలుగుట అసాధ్యమని తలచిన వాడై , లోకనాయకుడైన పరమేశ్వరునికి , పాలకడలి యందు
శయనించిన వాడైన పరంధామునికి ఇరువురి మేలు కలయిక వలన కలిగిన శక్తికి తప్ప వేరెవరి
వలననూ తనకు మరణము కలుగకుండునటుల వరమును పొందెను.

బ్రహ్మదేవుడు వరమును అనుగ్రహించి అంతర్జానమయ్యెను.

తన తల్లియైన సుగంధిని యొక్కయూ పినతండ్రియైన సుముఖుని యొక్క ఆదరాభిమానములు
పొందుచూ తన సైన్యమును బలోపేతము చేసికొనుచూ , ఎదురులేని వీరునిగా పాలన చేయసాగెను. బలగర్వముచే అతడు మరింత మూర్ఖముగా వర్తించసాగెను.

బలపరాక్రములందు దేవతలకు ఏ మాత్రమూ తీసిపోని తాము రహస్యజీవనము గడుపు వారిలా భీరువులుగా జీవించుటను అతడు ఎంత మాత్రమూ సహింపజాలక పోయెను. దేవతలకు ,  బుషులకు గల గర్వమునకు కారణము వారు చేయు హోమములు , మంత్రశక్తులే కదా , వాటిని మనము నాశనము చేయుటయే ప్రధాన కర్తవ్యము అని తలచెను.

తాను పొందిన వరములను గూర్చి , కుల గురువైన శుక్రాచార్యునితో సంప్రదించి , దేవతల పై
తాను యుద్ధము చేయబూనిన విషయమును తెల్పెను విషయమును విన్న భార్గవుడు మిక్కిలి
సంతసించి , యుద్ధమునందు అతడికి తోడుగా కాళికాదేవి అనుగ్రహము పొందిన వాడైన *'ఉగ్రవీరుడు'*
అను వానిని సహాయముగా తీసుకొని పొమ్మని చెప్పెను. గురువుగారి మాటలను మన్నించిన వాడైన
కాళికేయుడు. ఉగ్రవీరుని తన సేనా నాయకునిగా చేసికొని దేవతలపై ఘోరమైన యుద్ధమునకు
తలపడెను. దేవతలకు , అసురులకు మధ్య భీకరమైన యుద్ధము కొనసాగెను. అనేక తలలు
తెగిపడిపోవుచుండెను. రక్తము ఏరువలె ప్రవహింపసాగినది. చివరకు యుద్ధమునందు దేవతలు ఓడిపోయిరి.

అహంకార గర్వము తలకెక్కిన కాళికేయుడు అంతటితో ఆగక , త్రిమూర్తులపై ధ్వజమెత్తి , వారు నివసించు లోకములకు తరలి వెళ్ళెను. తనను మెప్పించిన భక్తుడు గాన , బ్రహ్మదేవుడు కాళికేయునికి పూర్ణ కుంభముతో స్వాగతమిచ్చెను. ఇక విష్ణుమూర్తి , కాళికేయుడు పొందిన వరమును ఎరింగినవాడై , అతడిని ఎదుర్కొనలేక , అతడి పరాక్రమమును వేనోళ్ళ కొనియాడుచూ , పలువిధములైన ఐశ్వర్యముల నిచ్చిమరీ పంపెను. చివరిగా కైలాసమును చేరిన కాళికేయుడు , తన తల్లి అనుదినమూ కొలుచు
దైవము కదా అని తలచినాడో ఏమో , శివునికి నమస్కరించి ఆశీర్వదింపుమని ప్రార్థించెను.
*“ఘోర తపస్సు చేసి పొందిన వరబలముచే దేవలోకపు ఆధిపత్యము పొందితివి. ఇకపై ధర్మముగా తప్పక పాలించుము. అట్లు పాలించునంత వరకూ నా ఆశీస్సులు తప్పక ఉండును”* అని
హెచ్చరించి పంపెను. శుక్రుచార్యుని ఆశీస్సులతో దేవేంద్రుని యొక్క సింహాసనమును అధిష్టించి , ములోకాధిపత్యము పొందినవాడైన కాళికేయుడు రాక్షస పాలన చేయుచుండెను. లంకావురికి దక్షిణ
దిశగా , అసురశిల్పిమైన మయునిచే నిర్మింపబడిన అందమైన నగరమును రాజధానిగా చేసికొని
గర్వము తలకెక్కి యుండిన వాడయ్యెను.

తాను ముందే శపధము చేసినట్లుగా , ఋషిపుంగపులను చెరబట్టి. బాధింప సాగెను. వేద మంత్రములను నశింపజేయసాగెను. నాస్తికత్వము ప్రబలునట్లుగా చేసెను. ముల్లోకములందు
అరాచకత్వము రాజ్యమేలసాగినది. అధర్మము తలెత్తినపుడు , సజ్జనులు బాధింపబడుచుండునపుడునూ , భగవంతుడు చూచి ఊరకుండునా ?

అసురుని అంతము చేయుటకు శాస్తా అవతారమూర్తిగా ఆవిర్భవించు సమయము ఆసన్నమైనది. అసురుని వలన కడు బాధలు పొందుచున్న ఋషులు , దేవతలు బ్రహ్మదేవుని శరణుజొచ్చిరి , రాక్షసుని అసుర పాలనలో చేయునది లేక , ఏమి చేయుటకూ తోచక దేశ దిమ్మరులై తిరుగాడు తమ యొక్క బాధలు తీరు ఉపాయమును సెలవిమ్మని ప్రార్థించిరి. వారి యొక్క ఈ దీనస్థితికి , కాళికేయునికి తాను ఇచ్చిన వరము వలన తాను కూడా కారకుడే కదా యని బ్రహ్మదేవుడు బాధపడెను. కాళికేయుని వరగర్వము అణగు సమయము ఆసన్నమైనదని తెలుసుకొన్న వాడైన
బ్రహ్మదేవుడు దేవతలతో సహా కైలాసమునకు ఏగెను.

*కైలాసనాధా ! కాళికేయుని అట్టహాసము మితిమీరిపోవుచున్నది. అతడిని సంహరింపనిచో ధర్మము నశించు స్థితి ఏర్పడును”* అని హెచ్చరించెను.

*“అహంకారగర్వముతో మితిమీరి ప్రవర్తించు కాళికేయుడు , దేవలోకపు వాసులను నిరంకుశముగా పరిపాలించుచున్నాడు. అతడిని అణచివేయగల శక్తి నా కుమారుడైన దేవశాస్తాకే చెల్లును. కాబట్టి మనమంతా అతడిని ప్రార్థింతుము”* అని పరమశివుడు తెల్పెను. హరి , హరుల యొక్క శక్తుల కలయికయే కదా మహాశాస్తా , తండ్రి మనోభావమును ఎరిగినవాడై దేవతల నుద్దేశించి *“దేవతలారా ! మీ కోరిక మేరకు కాళికేయుని సంహరింపబూనితిని. యుద్ధమునకు సన్నాహములు చేయుడు"* అని
యుద్ధమునకు బయలుదేరెను. స్వామి అధిరోహించుటకై , అతిసుందరమైన , బ్రహ్మండమైన కాంచన
సౌధము వంటి రధము తయారు చేయబడగా , దేవసేన ముందు నడయాడుచుండగా స్వామి యుద్ధమునకు తరలి వెళ్ళెను.

యుద్ధ మర్యాదను పాటించు సంప్రదాయము కలిగినవాడై , ముందుగా కాళికేయుని వద్దకు
సేనాధిపతియైన మహావీరుని రాయబారిగా పంపెను. శాంతి సామరస్యము కూర్చుకుందుమని వార్త
పంపెను. స్వామి యొక్క గొప్పదనము తెలియని కాళికేయుడు హేళనగా మాట్లాడెను. సహించలేని
మహవీరునికి కోపము వచ్చిననూ , రాయబారిగా వచ్చినందువలన కోపమును అణచుకొని , అతడిని హెచ్చరించెను. బలగర్వము మితిమీరియున్న కాళికేయునికి , అతడి హెచ్చరికలు తలకెక్కక ,
యుద్ధమునకు సన్నద్ధుడయ్యెను.

తిరిగివచ్చిన మహావీరుడు జరిగిన విషయమును వివరింపగా , స్వామి ఇక ఆలసింపక *“యుద్ధమునకు తయారుకండ"* ని తన సేనలకు ఆజ్ఞ జారీచేసి తన రధముతో యుద్ధ భూమికి తరలివెళ్ళెను. ఒకపక్క కాళికేయుని నివాస స్థలమున అనేక దుశ్శకునములు గోచరించసాగెను. తన
మంత్రులతో అత్యవసర సమాలోచన గావించినాడు కాళికేయుడు.

*“గతిలేని దేవతలు , ఎవరో తమ్ము ఉద్ధరింపగోరి వచ్చినట్లుగా కేవలము ఒక బాలుని నమ్మి మనతో యుద్ధమునకు తలపడి వచ్చితిరి. దేవతలు అతడినే నమ్ముకుని వచ్చినవారు. సాక్షాత్తు విష్ణుమూర్తిని ప్రసన్నునిగా చేసుకొనిన నేను , ఈ బాలునితో యుద్ధమునకు తలపడుటయా నాకు అది అవమానకరము. నా ఉపసేనాధిపతియైన దీర్ఘనేత్రుని పంపిన చాలును. ఆ బాలుని అణచుటకు అతడు చాలును”* అని దీర్ఘనేత్రుని యుద్ధమునకు పంపెను.

రాక్షసులను ఎదిరించుటకై దేవతలు సమరమున దూకిరి. బాలుడే కదా అని ఉపేక్షించబడిన శాస్తా , కాళికేయుని సేనల దుమ్ము దులపసాగెను. వచ్చిన వేగములోనే రాక్షస సేనల తలలు
తెగిపడసాగెను. దళాధిపతియైన దీర్ఘనేత్రుడు శాస్తా యొక్క వేగము చూసి దిగ్ర్భాంతి చెందిన వాడాయెను. అంతలోనే సంబాళించుకుని యుద్ధమును కొనసాగించెను. ముందుగా అతడిని
ఎదిరించుటకు వచ్చినవాడు మహాకాళుడు. ఎంతో ఆర్భాటముగా , అట్టహాసముగా యుద్ధభూమికి వచ్చిన దీర్ఘనేత్రుడు చివరకు మహాకాలుని కరవాలమునకు ఎర అయేను.

కాళికేయుడు భయభ్రాంతుడాయెను. తన ఉపసేనాని మరణమునకు పగ తీర్చుకొనదలచిన వాడై , తన మిత్రుడు. సేనాధిపతి అయిన ఉగ్రవీర్యుని యుద్ధమునకు పంపెను. ఉగ్రరూపము దాల్చినవాడైన ఉగ్రవీర్యుడు శాస్తా సైన్యముపైకి దూకెను. దైత్యసేన , దేవసేనల పోరు అతి భీకరముగా సాగెను. మహావీరుని కరవాలమునకు తల వాల్చిన వాడాయెను ఉగ్రవీర్యుడు.

దేవతలు సంతోషముతో ఉప్పొంగిపోయిరి. స్వామి రధము వచ్చు దారి అంతయూ రాక్షసుల
మృతదేహములతో నిండియుండెను.

తండ్రిని ఓదార్చు నిమిత్తము కాళికేయుని పండ్రెండు వేల పుత్రులు యుద్ధమునకు తరలివచ్చిరి. వారికి , దేవతలకు ఘోరమైన పోరు జరిగెను. వారి వీరోచిత ప్రదర్శనలకు మెచ్చిన శాస్తా , కొంతసేపు వారితో వినోదము సలుపుచూ యుద్ధము చేసిన పిమ్మట తన చేతనున్న ఛండాయుధమును
వారిపై ప్రయోగింపగా వారందరూ మరణించిరి.
తన పుత్రులు మరణించిన వార్త విన్న కాళికేయుడు ఉగ్రరూపము దాల్చి మరుక్షణమే తన
సేనలతో ప్రత్యక్షముగా యుద్ధమునకు ఏతెంచెను. భీకరముగా ఘర్జించుచూ రాక్షససేన యుద్ధమునకు
బయలుదేరి వచ్చెను. తమ రాకకు సంకేతముగా భీకరధ్వనిగావించిరి.

రాక్షస రాజు సంధించిన బాణములకు తన వంతుగా స్వామి శరములను అతి వేగముగా ప్రయోగింపసాగెను. స్వామి యొక్క శరసంధానము ముందు కేవలము ఒక రాక్షసరాజు నిలువగలడా ? పోరు ఉగ్రరూపము దాల్చెను. స్వామి యొక్క శర పరంపరల ధాటిచూసిన దేవతలు సైతము
భయపడి పారిపోసాగిరి.

యుద్ధమునకు నాంది పలికిన స్వామి , ఆ యుద్ధమునకు ముగింపు చేయగోరి తన చేత నున్న చర్నాకోలుని కాళికేయునిపై దులపగా , ఆ వేగమునకు రాక్షసుని తల తుంచబడినది. పదునారు లోకములు హర్షధ్యానము చేసినవి.

దేవతలు స్వామి ముందు మోకరిల్లి జయ జయ ధ్యానము గావించిరి. పుష్పవర్షము కురిసినది.
స్వామికి మంగళ హారతులు ఈయబడినవి. త్రిమూర్తులు , ఇంద్రుడు మొదలగు దేవతలందరూ
స్వామిని వేనోళ్ల స్తుతించిరి.




*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat