*జలంధర సంహారం*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి (ABADPS)*
ఒకానొక సమయమున దేవేంద్రుడు పరమేశ్వరుని ముందు నాట్యమాడి శివుని రంజింపజేసెను.
సంతసించిన శివుడు దేవేంద్రునితో ఏదైనా వరమును కోరుకొమ్మనెను. పరమశివునితో సమానమైన బలశాలి తనను ఎదిరించిననూ అతడినే జయించగల శక్తి సామర్థ్యములు ప్రసాదింపుమని కోరుకొనెను. పరోక్షముగా తననే ఎదిరించగల శక్తిని ప్రసాదింపమని కోరుకొనుటలోని దురాశ ,
అహంకారమును పరమశివుడు గుర్తించి అగ్రహావేశములతో ఊగిపోయెను. అధికమైన కోపము కారణముగా శరీరమంతయూ స్వేదముతో నిండిపోయెను. ఆస్వేదములోని ఒక బిందువు సముద్రమున
కలసిపోయెను సముద్రమున కలసిన ఆ బిందువు ఒక శిశువు రూపము దాల్చెను. ఈశ్వరుని కోపమునుండి జనించిన ఆ శిశువు ఈశ్వరునికి సమానమైన శక్తివంతమైన రూపము దాల్చి యుండెను.
సముద్రజలము నుండి వచ్చిన ఏడుపు విన్న బ్రహ్మదేవుడు అచటికి వచ్చి ఆ శిశువుని చూచి
మురిపెముగా ముద్దు చేయసాగెను. ఇంతలో ఊహించని విధముగా ఆ శిశువు బ్రహ్మదేవుని
కంఠమును తన చేతులతో బిగించసాగెను ఆ బిగింపువలన కలిగిన బాధతో బ్రహ్మదేవుని కనుల వెంబడి అశ్రువులు కారసాగెను. అతికష్టముపై శిశువు యొక్క పిడికిలి నుండి తప్పించుకొనెను.
సముద్రమునుండి జనించినందువలనూ , బ్రహ్మదేవుని కంటినుండి జాలు వారిన అశ్రువుల
కారణముగానూ ఆ శిశువు జలంధర నామధేయుడాయెను.
శుక్రాచార్యులవారి పెంపకమున సముద్రరాజ కుమారునిగా పెరిగిన జలంధరుడు త్వరలోనే
తనకు తానే ఒక సామ్రాజ్యమును ఏర్పరచుకొనెను. త్రిమూర్తుల చేత నున్న ఆయుధముల వలన
కూడా తనకు మరణము ప్రాప్తింపకుండునట్లు వరమును పొందెను. అంతేగాక తాను సముద్రము నుండి జనించుటవలన , సముద్రమును మధించునపుడు లభించిన వస్తువులన్నియూ తనకు
మాత్రమే చెందవలెనను పట్టుదలతో దేవేంద్రునిపై పగబూని ఎదిరించసాగేను.
దేవతలను ముప్పుతిప్పలు పెట్టసాగెను. వారిపై యుద్ధమునకు దిగెను.
భీకరమైన పోరు జరిగెను. ప్రాణనష్టము సంభవించిననూ , పోయిన ప్రాణములను తిరిగి ప్రసాదించు మూలికలు కలిగిన ద్రోణగిరి పర్వతముల నుండి లభించిన సంజీవని వలన దేవతలు తిరిగి పునరుజ్జీవితులు కాసాగిరి అట్లు బ్రతికి వచ్చిన వారు మరల యుద్ధమునకు తలపడిసాగిరి. ఈ విషయమును గుర్తించిన జలంధరుడు , వరుసగా సంధింపబడిన తన బాణసముదాయముచే ,
ద్రోణగిరి పర్వతమంతయూ జలమునందు మునిగిపోవునట్లు చేసెను. దేవతలను చీల్చి చెండాడసాగెను. దేవతలు వైకుంఠవాసుని శరుణుజొచ్చిరి. కానీ అంతకు మునుపే మహాలక్ష్మి దేవికి నారాయణుడు ఒక అభయమిచ్చి యుండెను. అదేమనగా తన వలెనే జలంధరుడు కూడా సముద్రమునుండి
జనించుటచే , అతడు తనకు సోదరసమానుడు గావున అతడిని సంహరింపవలదని లక్ష్మీదేవి కోరగా విష్ణుమూర్తి సమ్మతించియుండెను.
విష్ణుమూర్తి తన నిస్సహాయతను వెలిబుచ్చగా , జలంధరుని సంహరించుట తమవలన కాని పని యని దేవతలు జంకసాగిరి. జలంధరుడు పరమశివుని అగ్రహావేశములనుండి జనించిన వాడగుటచే
పరాక్రమవంతునిగా రూపొంది యుండెను. దేవతలు భయపడి పారిపోగా , అమరావతిని ఆక్రమించిన
జలంధరుడు తానే అదిపతినని ప్రకటించుకొనెను. ఆపై అసురుల అట్టహాసము ఇనుమడించినది.
నిస్సహాయ స్థితిలో నున్న దేవతలు పరమశివుని శరణుజొచ్చిరి. తమను కాపాడుమని ప్రార్థించిరి.
దీనికంతటికీ కారణము దేవేంద్రుని అహంకారమేకదా. వానిని ఎదిరించగల శక్తి , త్రిమూర్తులు మూవురూ కలసి ఆవిర్భవించిన శక్తి వలననే సాధ్యమగునని ఈశ్వరుడు తెలిపెను.
మదగర్వముతో తిరుగాడు జలంధరుడు అందమైన యువతులను చెరబట్టసాగెను. ఈతడి దుష్ట చేష్టలకు అందమైన యువతులెందరో బలి అగుచుండిరి. ఒకనాడు అమ్మల గన్న అమ్మ పార్వతీదేవి అతడి కంట బడినది. ఆమె లోకనాయకి అన్న సంగతిని మరచిన మూర్ఖ్యుడాయెను.
పార్వతీదేవికి నాధుడగు అర్హత , ఎప్పుడూ తపస్సమాధియందుండు శివునకు కాదు , తనకు
మాత్రమే కలదను మదము కలిగి యుండిన వాడాయెను.
అమ్మవారిని చెరబట్టు నిమిత్తమై, తన సేనను సమకూర్చుకుని శివునిపై దండెత్తి వచ్చెను. వారి
మధ్య ఘోరమైన పోరు జరిగెను. త్రిమూర్తుల యొక్క ఆయుధములచే తనకు ఎటువంటి మరణమూ సంభవింపనటుల వరము పొందియున్న కారణముగానే ఇంతటి సాహసమునకు జలంధరుడు ఒడిగట్టెను. కానీ త్రిమూర్తుల కలయిక అయిన భూతనాధుని సైన్యములు జలంధరుని ఎదిరించెను. భూతనాధుని సైన్యమును చూచి అసురులు భయకంపితులై పారిపోసాగిరి. పారిపోయిన వారు
పిమ్మట పార్వతీదేవి శాపమునకు పాత్రులగుదురని శివుడు వారిని శపించెను.
జలంధరుడు మాయోపాయము పన్ని యుద్ధము చేయసాగెను. ఈశ్వరుని సైన్యము అతడి మాయవలన చిక్కుకొనెను. సాక్షాత్తూ పరమశివుడే జలంధరునితో యుద్ధమునకు తలపడిననూ , రాక్షసుని మాయవలన , అతడు పొందియున్న వరము కారణముగానూ అతడిన ఏమియూ చేయలేక
పోయెను.
మాయకు విరుగుడు మాయయే అని పరమ శివుడు నిశ్చయించుకొన్న వాడయి *“త్వద్ రూపేణా వధీర్ణాంస్మ బ్రహ్మ విష్ణు అహం సుత”*
*“బ్రహ్మ విష్ణు శివులమైన మేము మూవురమూ ఒక్కటిగా ఆవిర్భవించిన శక్తివే సుమా నీవు”*
అంటూ పరమశివుడంతటివాడే శాస్తాని పొగడెను అంతటి మహిమాన్వితుడు శ్రీశాస్తా.
పరమేశ్వరుడు విష్ణుమాయచే జనించిన శాస్తాని అభ్యర్థించెను. తమ అనుంగు పుత్రుని
అనుగ్రహించుమని ఆదేశించెను.
యుద్ధరంగమున అంతవరకూ ఆయుధముల బారినుండి అతడి యొక్క వరప్రభావము జలంధరుని
కాపాడుచుండెను. అందులకై శివుడు ఒక ఉపాయమును పన్నెను. ఒక వయోదకుని రూపుదాల్చి జలంధరుడు వచ్చు దారిలో అమరియుండెను. ఇసుకపై ఒక చక్రమును చిత్రించెను. ఆ
చక్రము త్రిమూర్తుల ఏకశక్తి అయిన మహాశాస్తాగా రూపు దాల్చెను. జలంధరుని అడ్డగించిన
పరమేశ్వరుడు *“ముందుగా ఈ చక్రమును ఎత్తి నీ బలమును చూపుము. ఆపైన యుద్ధమును కొనసాగింతుము”* అని సవాలు విసరెను. తనను ఎదిరించు శక్తి సాహసము ఎవరికీ లేదను ధైర్యము , మొండి తనము వలన అహంకార పూరితుడైన జలంధరుడు ఆ చక్రమును పైకి లేపప్రయత్నించెను. కానీ లేపలేక పోయెను. ఎంతయో ప్రయత్నించిన పిదప , తుదకు ఆచక్రము
జలంధరుని శరీరమును రెండుగా చీల్చి వైచెను. శాస్తా మూలముగా పరమశివుడు జలంధరుని
అంతమొందించెను.
*“జంధర నిహంతాచ షోణాక్ష షోణ వాససః"*
*(హరి హరపుత్ర సహస్రనామము)*
జలంధర సంహార అనంతరము శాస్తా కొంతకాలము సహ్యాద్రి పర్వత ప్రాంతమున ఏకాంత వాసము చేసెను.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*