శ్రీ చక్ర పురమందు స్థిరమైన శ్రీ లలిత
పసిమి పాదాలకు నీరాజనం
పరమేశ్వరుని పుణ్య భాగ్యాలరాశీ, ఆ
సింహమధ్యకు నీరాజనం
బంగారు హారాలు శింగారమొలకించు
అంబికా హృదయాన నీరాజనం
శ్రీ గౌరి, శ్రీ మాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీ
సింహాసనేశ్వరికి నీరాజనం
కల్పతరువుగా నన్ను కాపాడె, కరములకు
కనకాంబురాశులతో, నీరాజనం
పాశాంకుశ, పుష్ప, బాణ చావదలికి
పరమపావనమైన నీరాజనం
కాంతి కిరణాలతో, కలికి మెడలో మెరిసే
కళ్యాణ సూత్రముకు నీరాజనం
కాంతలందరి పసుపుకుంకుమలు కాపాడె
కాత్యాయనికి నిత్య నీరాజనం
చిరునవ్వులొలికించు శ్రీదేవి అధరాన
శతకోటి నక్షత్ర నీరాజనం
కలువరేకులవంటి కన్నుల తల్లికి శ్రీ
రాజ రాజేశ్వరికి నీరాజనం
ముదమార మోమున ముచ్చటగా ధరియించు
కస్తూరి కుంకుమకు నీరాజనం
చంద్రవంకను శిరమకుటంబులోదాల్చు
సౌందర్యలహరికి నీరాజనం
శుక్రవారము నాడు శుభము లొసగే తల్లి
శ్రీ మహాలక్ష్మికి నీరాజనం
శృంగేరి పీఠమున సుందరాకారిణి
శారదా మాతకు నీరాజనం
ఎల్లలోకాలను చల్లగా పాలించు
బ్రహ్మాండరూపిణికి నీరాజనం
ముగ్గురమ్మలకు మూలమైన పెద్దమ్మకు
ముత్యాల తోనిచ్చే నీరాజనం
రాగ జీవన రాగ నామ సంకీర్తనగా
రంజిల్లు కర్పూర నీరాజనం
జన్మజన్మలతల్లి జగదీశ్వరీ నీకు
భక్త జనులిచ్చేటి నీరాజనం ||శ్రీ చక్ర||