*దీపదానం అనేది ఎవరైనా, ఎప్పుడైనా చేయవచ్చు. అయితే విశేషించి కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల అనంతమైన పుణ్యాన్ని పొందగలం అని కార్తీక పురాణంలో పేర్కొన్నారు. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు కృత్తికా నక్షత్రానికి దగ్గరలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి “కార్తీకమాసం” అని పేరు వచ్చింది. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం కాబట్టి ఈమాసంలో దీపారాధన, దీపదానం లాంటి వాటికి మిక్కిలి ప్రాధాన్యత ఉంది.*
*ఈ మాసంలో ఆలయాల్లో, తులసి దగ్గరా నెయ్యి దీపం వెలిగించడం, దీప దానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని శాస్త్ర వచనం.*
*అసలు దీప దానం ఎందుకు చేస్తారు? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.*
*జ్ఞానోదయాన్ని కలిగించే దీపం:-*
*కార్తీకమాసంలో దీపం దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. దీప దానం ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందింస్తుంది. జ్వాల మనలోని జ్ఞానాన్ని సూచిస్తుంది. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ప్రసాదించమని కోరుకుంటూ దీప దానం చేస్తారు. శివాలయంలో కాని విష్ణు ఆలయంలో కానీ నెయ్యి దీపాలు దానం చేయడం వల్ల అంతర్గత శాంతి పెరుగుతుంది.*
*శ్రేయస్సు, అదృష్టాన్ని ఇచ్చే దీపదానం:-*
*కార్తీకమాసంలో దీప దానం చేయడం వల్ల శ్రేయస్సు, అదృష్టం వృద్ధి చెందుతాయి. తలపెట్టిన అన్ని పనుల్లో విజయం చేకూరుతుంది. ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుంది.*
*తొలగిపోయే ప్రతికూలతలు:~*
*కార్తీకమాసంలో దీప దానం చేయడం వల్ల తరతరాల నుంచి వస్తున్న పాపాలు తొలగిపోతాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతల నుంచి విముక్తి కలుగుతుంది. దీపదానం వలన పాపపరిహారం కలిగి మనసు, శరీరం, ఆత్మ శుద్ధి అవుతుంది.*
*ఆరోగ్య కారకం దీపదానం:~*
*కార్తీకమాసంలో ఆలయాలలో దీపం దానం చేయడం వలన అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభించి స్వస్థత చేకూరి, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది.*
*మనోభీష్ట సిద్ధి:~*
*కార్తీక మాసంలో చేసే దీపదానం వలన దైవానుగ్రహంతో తెలిసీ తెలియక చేసిన పాపాలు నశించిపోయి, సానుకూల శక్తులు పుంజుకుంటాయి. ప్రతి పనిలో అనుకూలత లభించి సకల మనోభీష్టాలు నెరేవేరుతాయి.*
*ఇక దీపదానం ఎలా చేయాలంటే.. బియ్యంపిండిని గానీ, గోధుమపిండిని ఆవుపాలతో కలిపి దీపంకుందిలా చేసి, అందులో పూవ్వొత్తి వేసి, ఇవేవీ లేదంటే చివరకు రెండు మట్టి ప్రమిదలలో నూనె కానీ, నెయ్యి కానీ వేసి పూవ్వొత్తి వేసి, దానిని పసుపు, కుంకుమ, పుష్పాదులతో అలంకరించి పూజించి దాన్ని తగిన దక్షిణ తాంబూలంతో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సాయం సమయంలో దీపదానం చేస్తే ఇంకా మంచిది. స్తోమత ఉంటే వెండి ప్రమిదలలో బంగారు వత్తి వేసి కూడా దానం చేయవచ్చు.*
*ఇక చాలామంది దీపదానం అనగానే ఉసిరికాయ మీద పూవొత్తి పెట్టి దానం చేస్తుంటారు. ఇది దీపదానం కాదు. ఒక పాత్రలో ఉసిరికాయలని తీసుకుని దాని పక్కన దీపాన్ని ఉంచి, బియ్యంతో, పప్పులాంటి ధాన్యం ఉంచి.. వాటితో సహా దానం చేయాలి. దీపదానాన్ని శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ ఇవ్వాలి. దీన్ని కూడా మన గోత్రనామాలతో సంకల్ప పూర్వకంగా దానం ఇస్తే ఇంకా మంచిది.*
*విశేషించి పంచ మహా పర్వాలు అంటే కార్తీక శుద్ద ఏకాదశి నుంచి కార్తీక పూర్ణమి వరకు ఉండే ఐదు రోజులలో దీపదానం చేయడం చాలామంచిది.*
*దీపదానం చేసేటప్పుడు పఠించాల్సిన మంత్రం:~*
*సర్వజ్ఞానప్రదం దీపం*
*సర్వ సంపత్ సుఖావహం*
*దీపదానం ప్రదాస్వామి*
*శాంతిరస్తు సదామమ।*
*అనగా సర్వ జ్ఞాన స్వరూపమైన, సర్వ సంపదలు, ఐహిక సుఖములు కలిగించే ఈ దీపమును నేను దానం ఇస్తున్నాను. దీని వల్ల నాకు ఎల్లప్పుడూ శాంతి కలుగుగాక. అని శ్లోక భావం. పై శ్లోకాన్ని చెబుతూ దానం చేయాలి. ఇలా స్త్రీలుగాని, పురుషులుగానీ, విద్యార్థులు ఎవరైనా సరే దీపదానం చేస్తే సకల శుభాలు కలగడంతో పాటూ, మోక్షప్రాప్తి లభిస్తుంది. దీపదానాన్ని కార్తీకమాసంలో చేస్తే తెలిసిగానీ, తెలియక గానీ చేసే పాపాలు తొలగిపోతాయి. దీని ప్రాశస్తాన్ని తెలిపే కథ కూడా కార్తీక పురాణంలో ప్రస్తావించారు.*
*అయితే దీపదానం ఇవ్వడం వీలుకాకుండే స్వచ్చమైన నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ దానితో పాటూ వత్తులను దేవాలయంలో దీపారాధన చేయడానికి ఇచ్చినా దానితో సమానమైన పుణ్యాన్ని పొందగలం.*
*శుభం భూయాత్॥*
*ఓం నమః శివాయ!*
*ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః।*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔