పల్లవి :
మా స్వామి మారుతి రాయా - నీవేలే ఓ హనుమయ్యా
రావయ్య అంజని తనయా - కాపాడుమయా
|| మా స్వామి ||
చరణం 1:
నీ పూజకు పూలను తెచ్చి నీ సేవలు చేయగ వచ్చి
నీ వాకిట నిలబడి యుంటిమి దేవా నిను చేరి
నీ చరణ సేవలు చేయ - నీ భజన భక్తితొ చేయ
నీ సన్నిధి చేరితిమయ్యా కానర హనుమయ్యా
|| మా స్వామి ||
చరణం 2:
సింధూర తిలకము దిద్ది నీమేనున గంధం పూసి
మందార మాలలు తెచ్చి నీమెడ వేసితిమి
సంపెంగ పువ్వులతోనా ఈ తమల పాకులతోనా
మెండుగ పూజలు చేయ వరముల నీయుమయా
|| మా స్వామి ||
చరణం 3:
శ్రీ రాముని దూతవు నీవు మాపాలిట పెన్నిధి వీవు
ఓ భక్త మందారుడా నిన్నే స్మరియింతు
వీరాధి వీరుడవయ్యా - శూరాధి శూరుడవయ్యా
నీ కోసం వేచితిమయ్యా కాపాడగ రావా
|| మా స్వామి ||
చరణం 4:
నీ దివ్య రూపము గాంచి మా మదిలో నిన్నే తలచి
నీ మధుర నామము పాడెద స్వామి మనసారా
నీ పేరు పలికిన చాలు - మా భవములన్నియు తీరు
నీ పాటలే ప్రాణము దేవా అప్పన్న దాసునకు
|| మా స్వామి ||