దిగి దిగి దిగి రావా నాగన్నా
స్వామి శివుని మెడను వీడి రావా నాగన్నా
కోటి కోటి వందనాలు నాగన్నా
స్వామి అందుకొనగ రావయ్యా నాగన్నా
నాగుల చవితి రోజు తలంటు స్నానమాడి
నూతన వస్త్రాలను ఇంటిల్లపాది కట్టి
నిష్ట తోడను స్వామి ఉపవాసమును చేసి
నీ పుట్టను చేరినాము పిల్లా పాపలతోను
నీ పుట్టలో పాలను పోసి నాగన్నా
నిన్ను భక్తి తోడ మ్రొక్కినాము నాగన్నా
నీ నోమును నోచినాము నాగన్నా
నిన్ను శరణు కోరి వేడినాము నాగన్నా
తంగేడు జిల్లేడు గుమ్మడి మందార
బంతి చామంతుల పూలతో పూజించి
చలిమిడి చిమ్మిలి వడపప్పు బెల్లాలు
కదళీ ఖర్జూరాలు నైవేద్యమర్పించి
ఆరగించ రమ్మనుచు నాగన్నా
నిన్ను కోరి పిలిచినామయ్యా నాగన్నా
వడి వడిగా రావయ్యా నాగన్నా
మా సేవలందుకోవయ్యా నాగన్నా
భూమాతను నమ్ముకుని రైతన్నలున్నారు
పంట చేను గట్ల తిరుగుతునుంటారు
కోపము బూని నీవు కాటు వేయకు తండ్రి
అన్నదాతను దేవా చల్లంగ కాపాడు
కరుణ చూప రావయ్యా నాగన్నా
మా కోర్కెలన్ని తీర్చవయ్యా నాగన్నా
అప్పన్న దాసుని బ్రోవ నాగన్నా
నీ వరము నీయ వేగ రావా నాగన్నా