కార్తీక వనభోజనాల విశిష్ఠత

P Madhav Kumar


*వనభోజనాం*


‘వనము’ అంటే అనేక వృక్షముల సముదాయము. ముఖ్యంగా రావి, మఱ్ఱి, మారేడు, మద్ది, మోదుగ, జమ్మి, ఉసిరి, నేరేడు, మామిడి, వేప, పనస, ఇత్యాది వృక్షాలతో.., తులసి, అరటి, జామ, కొబ్బరి, నిమ్మ, మొక్కలతో., రకరకాల పూల మొక్కలతో కూడివుండాలి. దాహము వేస్తే దప్పిక తీర్చడానికి ఓ సెలయేరు ఉండాలి. ఇవి ఉన్నచోట  జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు, చిలుకలు మొదలైన సాదు ప్రాణులు తప్పకుండా ఉంటాయి. దానినే ‘వనము’ అంటారుగానీ..., అడవిని ‘వనము’ అనరు. ‘వనము’ అంటే, వసించడానికి అనువైన ప్రదేశము అన్నమాట. వేటకు, క్రూరత్వానికి తావులేనిది ‘వనము’. అట్టి వనము దేవతా స్వరూపము. ఎందుకంటే.. పైన చెప్పిన వృక్షాలు, మొక్కలు.., దేవతలకూ, మహర్షులకూ ప్రతిరూపాలు. ప్రశాంతతకు, పవిత్రతకు ఆలవాలమైన తపోభూమి. నిర్భయంగా విహరించడానికి అనువైన ప్రదేశము. అట్టి వనాలను యేడాదికి ఒక్కసారైనా., ప్రత్యేకించి కార్తీకమాసంలో దర్శించండి అని మన పూర్వులు నియమం పెట్టారు. అందుకు ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఆనందకరమైన కారణాలు ఎన్నో ఉన్నాయి. అవి ఏమిటంటే....


- కార్తీకమాసం నాటికి... వానలు ముగిసి, వెన్నెల రాత్రులు ప్రారంభమౌతాయి.  చలి అంతగా ముదరని సమశీతోష్ణ వాతావరణంతో మనసుకు ఆనందాన్ని., ఆహ్లాదాన్ని కలిగించే మాసం.... ఈ కార్తీకమాసం. 

- ఆధ్యాత్మికపరంగా.,శివ,కేశవులకు ప్రీతికరమైనది ఈ కార్తీకమాసం. అందుచేత శివ, కేశవ భక్తులు ఒకచోట చేరి,  ఐకమత్యంతో ఆనందంగా గడపడానికి అవకాశం కల్పించే మాసం.... ఈ కార్తీకమాసం.

- పైన చెప్పిన వృక్షాలు, మొక్కలు, చెట్లు పచ్చగాచిగిర్చి,పరిశుద్ధమైన, ఆరోగ్యకరమైన ప్రాణవాయువును ప్రకృతిలో విహరింపజేసే మాసం.. ఈ కార్తీకమాసం.  


పుణ్యప్రదమైన ఈ కార్తీకమాసంలో ‘వనవిహారం చేసిరండి’ అంటే ఎవరూ వెళ్ళరు. ఎందుకంటే.. ఆకలేస్తే.. అక్కడ  వండి, వార్చి పెట్టేవారెవరు? అందుకే ‘వనభోజనాలు’ ఏర్పాటు చేసారు మన పెద్దలు. ‘దేవుడి మీద భక్తా?  ప్రసాదం మీద భక్తా?’ అంటే.. పైకి అనక పోయినా...‘ప్రసాదం మీదే భక్తి’ అనే రకం మనవాళ్ళు. కనీసం భోజనంమీద భక్తితోనైనా వనవిహారానికి వచ్చేవారున్నారు. స్వార్ధంలో పరమార్ధం అంటే ఇదే.


ఇక వనభోజనం అంటే... కేవలం తిని, తిరగడమే కాదు. దానికో పద్ధతి, నియమం ఉంది. కాలకృత్యాలు, స్నానాలు పూర్తి చేసుకున్న తర్వాత..అందరు బంధు, మిత్రులు, పరిచయస్తులు, ఇరుగు, పొరుగు కలిసి, జాతి, మత, కుల వివక్షత లేకుండా.., వీలయితే ఒకే వాహనంలోగానీ., లేదా రెండు వాహనాలలోగానీ వారు ఎంచుకున్న వనానికి సూర్యోదయానికి పూర్వమే చేరుకోవాలి. ముందుగా ఓ వటవృక్షం క్రింద ఇష్టదేవతా విగ్రహాలను ఉంచి పూలదండలతో చక్కగా అలంకరించాలి. ఆనందం పంచుకోవాలంటే వంటవాళ్ళను తీసుకెళ్ళ కూడదు. మగవారు పాటలు పాడుతూ కూరలు తరుతూంటే.. ఆడవారు చీరకొంగులు నడుముచుట్టి., అందరూ తలోరకం వంట వండుతూంటే...ఉన్న ఆనందమే వేరు. పిల్లలంతా కలిసి చేసే అల్లరిలోని మజాయే వేరు. చాటుమాటు కన్నెచూపుల, కుర్రచూపుల కలయికలోని ఖుషీయే వేరు. కొత్తజంటల గుసగుసల తమాషాల వాడే వేరు. అనుభవంతో తలపండిన పెద్దల ఛలోక్తుల చురకల వేడే వేరు. ఇన్నిరకాల ఆనందాల మధ్య., ఆచారాలకూ, నియమాలకూ అంత ప్రాధన్యత లేదు. అన్ని రకాల సాంప్రదాయాలకూ., సంస్కృతులకూ సమాన వేదిక ఇధి.


సామూహికంగా కలసి చేసిన శాకాహార వంట పూర్తి అయిన తర్వాత., ఆ వండిన పదార్థాలను పూజాస్ధలానికి చేర్చి..,అందరూ కలిసి దేవతారాధన చేసి., నివేదన సమర్పించి, ఆ ప్రసాదాన్ని అందరూ కొసరి కొసరి వడ్డించుకుంటూ తింటూంటే., ‘అబ్బ...సామూహిక సహజీవనంలో ఇంత రుచి ఉందా!’ అని అనిపించక మానదు. అమ్మయ్య.. సమిష్టి భోజనాలయ్యాయి. మరి తిన్నది అరగాలి కదా! ఇక ఆటపాటలదే ప్రముఖస్థానం. అంతరించిపోతున్న ప్రాచీన సాంప్రదాయ ఆటలకు సమాన వేదిక ఈ ‘వనభోజనాలు’. ఈ ఆట పాటల్లోనే కొత్త స్నేహాలు, కొత్త పరిచయాలు కలుగుతాయి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. కార్తీకంలో కలిసిన ఈ కొత్తసంబంధం..బంధుత్వంగా మారడానికి., మాఘ, ఫాల్గుణాల ముహూర్తాలు మనకోసం మనముందే ఉన్నాయి.

🙏🏻🙏🏻🙏🏻

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat