భారతీయ హిందూ క్యాలెండర్ లో తిథులకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక తిథులు ఇంటికి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయని నమ్ముతారు. అలాంటి వాటిలో ధన త్రయోదశి కూడ ఒకటి. ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకుంటారు. దీపావళికి ముందు వచ్చే ఈ ధన త్రయోదశి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని చేకూరుస్తుంది. ఈ రోజున కొన్ని వస్తువులు కొనడం వల్ల లక్ష్మిదేవి ఇంటికి వస్తుందని నమ్మకం. చాలామంది బంగారం, వెండి తో పాటు వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే ధన త్రయోదశి రోజు తెలిసి, తెలియక కొందరు వస్తువులు కొనేస్తుంటారు. కొన్ని వస్తువులు కొనడం వల్ల ఇంటికి అరిష్టమని అంటున్నారు. ఇంతకీ ధన త్రయోదశి రోజు ఏ వస్తువులను కొనకూడదు? ధన త్రయోదశి తిథి ఎప్పుడు? తెలుసుకుంటే..
ధన త్రయోదశిని చాలా ప్రాంతాలలో ధన్ తేరాస్ అని కూడా అంటారు. ఆశ్వయుజ మాస కృష్ణపక్షంలో త్రయోదశి తిథి రోజు ధన త్రయోదశి జరుపుకోవడం ఆనవాయితీ.. చాలామంది ధన త్రయోదశి రోజు బంగారం, వెండి, చీపురు వంటివి కొనుగోలు చేస్తారు.
విశ్వాసాల ప్రకారం ధన త్రయోదశి రోజున ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులను అస్సలు కొనకూడదట. అదే విధంగానే అల్యూమినియం వస్తువులు కూడా కొనుగోలు చేయకూడదని అంటున్నారు. అల్యూమినియం పాత్రలు లేదా వస్తువులు కొంటే ఇంటికి దరిద్రం తెచ్చి పెడతాయట.
పైవి మాత్రమే కాకుండా ధన త్రయోదశి రోజున మట్టి లేదా గాజుతో చేసిన పాత్రలను కూడా కొనుగోలు చేయకూడదట. ఇవి కొంటే కుటుంబంలో శాంతి, సంతోషం ఆవిరైపోతాయట.
ధన త్రయోదశి రోజు కొత్త బట్టలు కొనడం మంచిది. చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే బట్టలు పొరపాటున కూడా నలుపు రంగులో ఉన్నవి కొనకూడదు.