అయ్యప్ప సర్వస్వం - 103 | ముంబాయిలో ఒక శబరిమల | Ayyappa Sarvaswam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

అయ్యప్ప సర్వస్వం - 103 | ముంబాయిలో ఒక శబరిమల | Ayyappa Sarvaswam

P Madhav Kumar

ముంబాయిలో ఒక శబరిమల*


కేరళలోని శబరిమలకు వెళ్ళడానికి వీలుకాని మహారాష్ట్ర ముంబాయి వాసులు మాలధరించి , మండలదీక్షపూని , ఇరుముడిదాల్చి , పాదయాత్రగా వెళ్ళి , ధర్మశాస్తాను దర్శించి , తరించే దివ్యారామం ముంబాయిలోని మిని శబరిమల. మిని (చిన్న) శబరిమల అను పేరుకు తగినట్లు పరిసరమంతా దట్టమైన అడవి ప్రాంతంగాను కొండలు కోనలు నిండియున్న స్థల మధ్యభాగాన ఉండు చిన్న గుట్టపైన ఉన్నది శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం. ఈ కొండ చుట్టూ యొక జలపాతం ఉన్నది. దీనినే పంబఅని సూచించుచున్నారు. శబరిమలలాగానే ప్రతి మాసము కొన్ని దినములు మాత్రమే తెరచియుంచక సంవత్సరం పొడవునా అను నిత్యం ఉదయ సంధ్య వేళలలో ఈ ఆలయం తెరవబడి విధిగా పూజా ఆరాధనలు సలుపబడుచున్నది. మండల కాలమున ముంబాయి నివాసులే కాక పూనె , నాసిక్ , గుజరాత్ మున్నగు స్థలముల నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు ఇరుముడి దాల్చి ఈ ఆలయమునకు విచ్చేసి , నెయ్యభిషేకాదులు చేసి , తరించిపోవు చున్నారు. అనునిత్యం ఉషఃకాలపూజ , ఉచ్చికాలపూజ , అత్తాళపూజ అని మూడుపూటల విశేషపూజలు నిర్వహించబడుచున్నది. ఉదయం 5.00గం. మొదలు 10.30 ని. వరకును , సాయంత్రం 5.00గం. నుండి 8.30గం.ల వరకును ఇచ్చటి సన్నిధానం తెరచియుండును. ఆస్బెస్టాస్ సీటుతో కప్పబడిన ఆ ప్రదేశమున భక్తులు దిగి నిలబడి శ్రీస్వామివారిని దర్శించుకుని ఇరుముడి విప్పి , నెయ్యటెంకాయను అభిషేకమునకు పంపించే ఏర్పాట్లు చేసుకునేట్లు ఈ స్థలమున్నది. శబరిమలైలో ఉన్నట్లే ఇంచుమించు అదే కొలత గల పంచలోహ విగ్రహం ప్రతిష్టించబడియున్నది. విగ్రహము చూడముచ్చటగాయున్నది.




శబరిమలలో లాగానెట్టిపడేయడాలు లేక ఎంత సేపు కావలయునన్నా నిలబడి ఇచ్చటి శ్రీధర్మశాస్తావారిని దర్శించి తరించవచ్చును. గర్భగృహము చతురస్రాకారంలో యున్నది. పై కప్పు కేరళ పెంకులతో కప్పబడి అగ్రభాగమున స్వర్ణకలశములు ధగధగా మెరుస్తున్నది. మూలవిరాట్టుగు శ్రీ శాస్తావారి కిరువైపులా ఊగులాడే అలంకార దీపములు నేల పైన ఏడు దీపములు వెలిగించబడి నేత్రానందము కలిగించుచున్నది. ఐదురూపాయలు పెట్టి ఒక అర్చన టిక్కెట్టు కొంటే దేవస్థానం వారే ఒక పండుతో నైవేద్యం చేసి , పూలతో సావధానముగా అర్చన చేసి , మనకు ప్రసాదముగా చందనం , కుంకుమతో అరటిపండును ఇస్తున్నారు. శాస్తావారికి ఎడమప్రక్కన ఒక ప్రత్యేక సన్నిధిలో గణపతి అమరి అనుగ్రహించుచున్నారు. ఇంకొక ప్రత్యేక సన్నిధిలో భగవతి దర్శనమిచ్చుచున్నారు. ఆకారంలేని భంగిమ నాసి , కన్నులు , బొట్టు ఇవి మాత్రము పంచలోహములతో చేయబడి ఇమడ్చబడియున్నది. ఇచ్చటి భగవతిని భువనేశ్వరిగా ఆరాధించుచున్నారు. ప్రక్కన్నే ఓంకారేశ్వరర్ ఆలయము అందులో ఒక అందమైన లింగము ప్రతిష్టించబడినది. మరొకచోట షిరిడీ సాయినాథుని విగ్రహము కలదు. ఆలయమునకు కించిత్ దూరాన *'సర్పక్కావు'* ఉన్నది. ఇచ్చట నాగరాజు విగ్రహములు ప్రతిష్టించి యున్నారు.


కేరళలాగానే అడవిలోని ఆలయముల ఈ ఆలయము కనిపించుచున్నది. ఆశ్లేషానక్షత్రపూజ ఈ సర్పరాజు సన్నిధిలో గొప్పగా సలుపబడుచున్నది. ప్రతి శనివారము స్వామి అయ్యప్పకు అశేష భక్తజనులు విచ్చేసి నీరాజన ఆరాధన సలుపుచున్నారు. మండల మకర సమయాన వేల సంఖ్యలో ఇరుముడులు వచ్చి శ్రీస్వామి అయ్యప్పకు నెయ్యభిషేకాదులు , విశేషపూజలు , భజనలు , అన్నదాన కైంకర్యములు జరుగుచున్నట్లు ఇచ్చటి నిర్వాహకులు తెలిపిరి. పూజా ఆరాధనలన్నియు కేరళ ఆచార ప్రకారం తాంత్రయుక్తముగా శ్రద్ధా భక్తులతో నిర్వహించబడుచున్నది. పంగుణిఉత్తరం నాడు పంబ ఆరాట్టు జరుపుచున్నారు. ముంబాయి మినీ శబరిమలలోని శ్రీధర్మశాస్తాను దర్శించువేళ మనసున ప్రశాంతత , అలౌకికానుభూతి లభించుచున్నదని ఇచ్చట దర్శించుకున్న భక్తులు పారవశ్యముతో తెలుపుచున్నారు. మీరుకూడా ఓమారు ముంబాయి వచ్చి ఇచ్చటి కంజర్ మార్క్ ని శ్రీధర్మశాస్తావారిని దర్శించి తరించుటకు తరలి రమ్మని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ముంబాయిలోని కంజర్మార్క్ అను స్థలమునకు పశ్చిమభాగాన గల మనోహరమైన అడవి ప్రాంతమున ఎన్.సి.హెచ్.కాలనీ యందు ఈ మినీ శబరిమల గలదు. ముంబాయి బస్టేషన్ నుండి ఇచ్చటికి గంటకొక బస్సు నడుపబడుచున్నది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow