ఆఫ్రికాలో అయ్యప్ప ఆలయం*
కలియుగ వరదుడు , కరుణాసాగరుడు , కరిమల నివాసియగు స్వామి అయ్యప్ప తన కరుణాకటాక్షమును భారతదేశంలోని భక్తులకే కాక , ప్రపంచ వ్యాప్తంగా ప్రసరించి అచ్చటివారి పూజా ఆరాధనలను గూడా అందుకొంటున్నాడన్నందులకు నిదర్శనమే దక్షిణాఫ్రికాలోని స్వామి అయ్యప్ప ఆలయం. చూడడానికి శబరిమల ఆలయం పోలిన ఆలయంగా , ప్రకృతి రమణీయమైన వనప్రదేశమున సుమారు 15 హెక్టార్ల విస్తీర్ణ ప్రదేశమున అతి మనోహరంగా ఈ ఆలయాన్ని నిర్మించియున్నారు. ఈ ఆలయం చుట్టూ పశ్చిమ ఉత్తర దిశలలో ఐదు కొండలున్నాయి. పంచగిరీశ్వరుడైన అయ్యప్ప ఇచ్చటను పంచగిరీశ్వరుడుగానే పిలిచి కొలవబడుచున్నాడు. అచ్చట పంబా నది ప్రవహించినట్లే ఇచటను *'హెనాబ్'* అనబడు నది ఆలయానికి దక్షిణాన అతి సమీపంగా ప్రవహించుచున్నది. దక్షిణాఫ్రికా రాజధానియగు *"బ్రిటోరియా"లోని "రోసియా"* అనబడుస్థలమున నెలకొని యున్నది. బ్రిటోరియా అయ్యప్ప క్షేత్రం. నాలుగు తరాలుగా దక్షిణాఫ్రికాలో నివాసముంటున్న భారత దేశమునకు చెందిన వంశావళిలోని వారొకరు 1994వ సంవత్సరం ప్రప్రథమముగా కేరళకు వచ్చి శబరిమలై శ్రీ అయ్యప్పస్వామిని దర్శించుకొన్నారు. అపుడే వారు స్వామి అయ్యప్ప ఆరాధనకు ఆకర్షింపబడి తాను నివసించు దక్షిణాఫ్రికాలోను అయ్యప్పను తీసుకెళ్ళి ఆరాధించాలను సంకల్పం కలిగినదట. ఆమేరకు 1995న స్వామి అయ్యప్ప మాలధరించి , మండల దీక్ష పాటించువేళ బ్రిటోరియా నగరమున *"బ్రిటోరియా భజనై సంఘం"* అను పేర ఒక మండలిని స్థాపించిరి. అందరిని కలగలుపుకొని ఇచ్చట అయ్యప్ప స్వామికి అద్భుతమైన ఆలయం నిర్మించడంతోబాటు వృద్ధాశ్రమం , గ్రంథాలయంను నిర్మించి , ఈ ప్రదేశమునొక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దాలను సంకల్పముతో కఠిన కృషిచేసి , అనేక శ్రమదమలకోర్చి అధిక ధనమును వ్యజించి , ప్రస్తుతం కన్పించే బృహత్తరమైన బ్రిటోరియా అయ్యప్ప క్షేత్రమును నిర్మించుటయే కాక నాటి నుండి నేటి వరకు సదరు దేవాలయ నిర్వహణ అభివృద్ధి పనులను నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రతి ఆదివారము భక్తులందరిని ఆహ్వానించి భక్తి పారవశ్యముతో పూజలు , భజనలుచేస్తూనే యున్నారు. తమిళ , మలయాళ భాషలలోని స్వామి అయ్యప్ప భజన కీర్తనలను ఆంగ్ల భాషలో అనువదించి , అందరికీ ఇచ్చి శ్రద్ధాభక్తులతో ముగ్ధ కంఠమున పాడించే తీరు అందరినీ తన్మయులు గావించు చున్నాయని అచ్చటికి వెళ్ళి ఈ ఆలయమును , భక్తులను సందర్శించి మరలిన వారల ఉవాచ. కేరళలోని ప్రఖ్యాత స్తపతి కాణిప్పయ్యూర్ కృష్ణన్ నంబూద్రిపాద్ గారి ఆదేశానుసారం కేరళ ఆచార ప్రకారం నిర్మించబడినది ఈ ఆలయం. దక్షిణాఫ్రికాలో సుమారు 50 సంవత్సరములకు ముందునుండే అయ్యప్ప ఆరాధన జరుగుచున్నట్లు తెలియవచ్చినది. తమిళనాడుకు చెందిన ఒక భక్తుని ఇంట యుండిన ఒక చిన్న అయ్యప్ప విగ్రహమునకు పూజలు చేస్తూ , శబరిమలకు వెళ్ళి వచ్చేవారట. తదుపరి దక్షిణాఫ్రికాలోని శివ విష్ణు ఆలయములలో అయ్యప్ప , అయ్యనార్ విగ్రహములు పెట్టి , పూజలు , భజనలు జరిపేవారు. తదుపరి శబరిమల పోలిన ఈ ఆలయము నిర్మించబడినట్లు చెప్పుచున్నారు. ఇచ్చటి భక్తులు మకర విళక్కు మహోత్సవమునకు 41 దినములు ముందుగా మాలధరించి కఠిన నియమనిష్టలతో గూడిన దీక్షను ఆచరించుచున్నారు. తదుపరి సుమారు 13.5 కి.మీ. దూరాన గల *"లోడియా"* అను స్థలమున గల ఆలయము నందు ఇరుముడి కట్టుకొని శిరమున యుంచుకొని కాలినడకగా 13.5 కి.మీ. దూరము నడచి బ్రిటోరియా అయ్యప్ప క్షేత్రమునకు వచ్చి అభిషేక ఆరాధనలు చేసుకొందురు.
నడచి వచ్చే దారిలో 2 హైందవ దేవాలయములు, ఒక మసీదు మరియు ఒక చర్చిలోను అచ్చటి ఆచారం ప్రకారం పూజలు చేస్తూ , దారి పొడవునా ఎరుమేళి పేట్టతుళ్ళి నృత్యం చేస్తూ ఒక ఊరేగింపుగా అయ్యప్ప ఆలయం చేరుకుంటారు. ఇది సర్వ మత సామరస్యంగా యుండడంతో జాతి , మత , భాషా భేదం లేక సర్వులు ఈ అయ్యప్ప దీక్షను ఆదరించి ఆచరిస్తున్నారు. తన్మూలాన తదుపరి దినములలో గూడా ఒకరికొకరు మనస్పర్ధలు లేక మైత్రి భావంతో కలసిమెలసి యుండుటకు ఈ అయ్యప్ప దీక్ష దోహదం చేస్తుందని అంటున్నారు. ఇలా శబరిమల యాత్రలోని సర్వ హంగులతో ఏటేటా అధిక సంఖ్యలో భక్తులను ఆకట్టుకొని ఒక జైత్రయాత్రగా ముందుకు సాగే ఇదియు యొక శబరిమల యాత్రయేనని అన్పించుచున్నది. ఐననూ కేరళలోని శబరిమలపై కొలువుండే శ్రీ ధర్మశాస్తావారిని ఒక పర్యాయమైనా వెళ్ళి , కనులారా దర్శించుకోవాలను ఆకాంక్ష మాత్రం ప్రతివారిలోను గోచరించుచున్నది. వీరిలో కలవారు కొందరు ప్రతియేటా అచటినుండి ఇరుముడి కట్టుకొని శబరిమలకు వచ్చి , స్వామి అయ్యప్పను దర్శించుకొని వెళుతున్నారని విని మహదాశ్చర్యము కలిగినది. స్వామి అయ్యప్ప కూడా అచటి వారిపై ఎనలేని కరుణాకటాక్షమును కురిపిస్తున్నారనియు , వారందరు నిరంతర అయ్యప్ప భక్తులుగానే యుంటున్నారని , ఆఫ్రికా దేశంలో స్థిరపడిన భూపాలన్ అను తమిళ భక్తులొకరు జ్యోతి దర్శనానికని శబరిమలకు వచ్చినపుడు బ్రహ్మశ్రీ యస్. చంద్రమౌళి గురుస్వామి గారిని ఫిలిగ్రిం సెంటర్ 102లో కలుసుకొని పై వివరణలను తెలిపి గురువుగారు రచించిన తమిళ అయ్యప్ప గ్రంథమును తీసుకొని సాష్టాంగ ప్రణామములనిడి నిలబడెను. అపుడు గురువుగారు సదరు దేవాలయ ఫోటోలను పంపగోరగా వారు వారి స్వస్థలం వెళ్ళాక పంపించిరి. ఈ ప్రదేశం అయ్యప్ప క్షేత్రం నిర్మించుటకు మునుపే ఆ స్థల యజమానియగు *"విల్స్ నోరియా"* అను వారి కలలో భవిష్యత్తులో ఇచ్చట యొక బ్రహ్మాండమైన ఆలయం నిర్మితమగున్నట్లు తెలిసినదట. శంఖుస్థాపనయై చెట్లు నాటే వేళ రెండు గ్రద్దలు ఈ క్షేత్ర నిర్మాణ ప్రదేశం పై భాగాన కన్పించి ముమ్మార్లు ప్రదక్షిణ చేసి మరుగైనవట. కొంతమంది భక్తులకు వినాయకుడు , అమ్మవారు వంటి దేవతలు నేరుగా ప్రసన్నమైనట్లు , తమకు పూజా , ఆరాధనలు చేయమన్నట్లు గాను స్ఫూర్తించునట్లు చెప్పుకొనుట ఇచ్చటి అతిశయములగును. ఇలా దక్షిణాఫ్రికాలో ప్రారంభమైన అయ్యప్ప ఆరాధన అల్లనల్లన పెరిగి నేడు శబరిమల పోలిన ఆలయంగా ఎదిగి నిత్యనైమిత్త ఆరాధనలు జరిగేటట్లు చేసినదియు ఆ అయ్యప్ప అనుగ్రహమేనని అచ్చటివారు అంటున్నారు. *ఏది ఏమైనప్పటికి మనము కొలిచి ఆరాధించే అయ్యప్ప ఖండ ఖండాంతరాలు దాటి ప్రపంచ వ్యాప్తంగా గల తన భక్తులను 'అనుగ్రహించి ఆదుకుంటున్నారన్న సంగతి మనందరికీ గర్వకారణమే.*
