*స్వామి యొక్క దివ్య నామములు - 2*
*విప్రపూజ్యుడు*
సదా బ్రాహ్మణులచే పూజింపబడువాడు. ఈనాటికీ అనేక విప్రకులములందు ప్రధాన దైవముగాకొలువబడువాడు శాస్తాయే.
వారిచేత సదా *'శాస్తా ప్రీతి'* అను వైభవమును పొందుచుండును.
*ఆహితీగ్నిత్ విజైర్ మంత్ర సంపూజితాంఘం (శాస్తు స్తవము)*
*విప్రపూజ్యం విశ్వ వంద్యం విష్ణు శంభో ప్రియం సుతం*
(శాస్తా నమస్కార శ్లోకము)
*ఛండుడు (ఛండము)*
ఆ ఛండమును చేతియందు ఆయుధముగా ధరించినందువలన అయ్యనార్ ఛండుడు అనియూ ,ఛండాయుధుడు అనియూ పిలువబడుచున్నాడు.
పురాతన తమిళభాషా యందలి గానములందు ఈ మాట వినబడుచున్నది.
*రైవతకుడు*
ఎనిమిది దిక్కులను పరిపాలించు అష్టదిక్పాలకుల చేత పరివేష్టింపబడియుండి , భక్తుల కోరికలనుఅభీష్ట దాయకునిగా రైవత గిరియందు వాసము చేయబడువాడు గావున రైవతకుడైనాడు.
*ఆపదుద్దారకుడు*
లోకోద్ధరణ చేయు స్వామికి అందరూ బిడ్డలే. తనను మనస్సునందు ధ్యానించువారికి , ఎంతటిఆపదలు వాటిల్లిననూ , దుఃఖసాగరము నుండి , క్షణమాత్రమున ఒడ్డుకి చేర్చువాడు.
*ద్రాతారం ఆపత్సు నిత్యం*
*భక్త వృందాయ సర్వం ప్రదాతారమిష్టం.*
(శాస్త్రుస్తవం)
*కుక్కుటమును ధ్వజమునందు కలవాడు వారణధ్వజుడు*
కోడిపుంజు వీరత్వమునకు చిహ్నము. అజ్ఞానమను చీకటిని పారద్రోలుటకై , ఉదయసూర్యునివంటి వాడైన స్వామి యొక్క రాకను కుక్కుటము తన కూత ద్వారా తెలియజేయుటచేత ,
కుక్కటమును తన పతాకమునందు కలవాడయ్యెను.
*'వారణధ్వజుడు , రక్తకూట ధ్వజుడు'* ఇట్లు పిలువబడుచుండును.
శాస్తా కొలువై యున్న కొన్ని ముఖ్యమైన ఆలయములు
శాస్తా యొక్క గొప్పదనములు తెలియజేయునట్టి మహాత్మ్యములు అనేక పురాణములందు , అనేకవిధములుగా వర్ణించబడినవి. పలు మార్పులుగావింపబడిన అనేక ఆలయములు అనేక విశేష
చరిత్రములతో ప్రకాశించుచున్నవి.
*స్వామి కొలువైయుండు ముఖ్యమైన కొన్ని ఆలయములు*
మనలను సృష్టించి , కాపాడునట్టి భగవంతునికి మరల మన కృతజ్ఞతను తెలియజేయుస్థలములే ఆలయములు.
అంతటా నిండియున్న దైవశక్తిని , మానవ ప్రయోజనము కొరకు బహిర్గతము చేయుచూ కొలువబడు ప్రదేశమే ఆలయము. మానవ ప్రయోజనమునకై మునులు , ఋషులు , అంతటా నిండియున్న
దైవసాన్నిధ్యమును విగ్రహములందు పొందు పరచినవారైరి. తరువాతి కాలమందు కట్టడ నిర్మాణము
అనునది వృద్ధిచెందబడి, ఆ విగ్రహముల చుట్టూ ఆలయములు నిర్మించబడినవి.
పురాతన కాలమునుండియే ఆలయ సంప్రదాయము అనునది మన జీవన స్రవంతితో
కలసియుండిన భాగమే. సమస్యల వలయమైన ఈ లోకము నందు భవబంధాలను వదలి , ఒక్క క్షణమైననూ భగవంతునిలో లీనమై మనో వేదనలను తొలగించుకొనుటకు ఆలయము
అవసరమైయున్నది.
ఒక ఆలయముగాని , మూర్తిగాని , స్థలముగాని , తీర్థముగాని , వీటిలో ఏ ఒక్క దానిచేతనైననూ
ఆ ఆలయము ప్రసిద్ధిచెందిననూ చరిత్రలో స్థానము కల్పించుకున్నదగును.
ఆయా స్థలములందు కొలువైయున్న భగవంతుని యొక్క ముఖ్యత్వము , భగవంతుడు ఆ స్థలము
ఎంచుకొనుటకు గల కారణము , ఆ ఆలయమునకు నేత్రమువంటిదైన తీర్థము యొక్క ప్రాశస్త్యము
అను మూడు విషయములు ఆ ఆలయము ప్రసిద్ధి చెందుటకు కారణభూతములగును.
ఆది అంతములేని , పరంజ్యోతి అయిన స్వామిని పలురీతులుగా , పలువిధములైన
స్థలములందు
మన పూర్వీకులు పూజించినవారై యుండిరి. ముల్లోకములను రక్షించువాడైన శాస్తా మన పుణ్య భూమి యందు విలసిల్లిన పలు ఆలయములందు గ్రామపాలకునిగా కనిపించుచున్నాడు.
స్వామియొక్క
ఆలయము లేని గ్రామము మనకు కనిపించదు.
స్వామి కొలువైయున్న ఆలయములు చాలావరకు అపారమైన దైవశక్తిని ప్రతిఫలించునట్టి ప్రకృతి సిద్ధమైన రమణీయతను పొందినవే. దేశమంతట వ్యాపించియున్న స్వామి యొక్క ఆలయములను
లెక్కించి చెప్పనలవికాదు.
స్వామి కొలువై యుండి ప్రసిద్ధి గాంచిన కొన్ని ఆలయములు , చారిత్రాత్మక విశేషములను , ప్రత్యేకతను పొందుపరచుకొనియున్నవివాటిలో కొన్నిటిని పరిశీలింతును.
*కుళతుపుళై*
బాలశాస్తా కొరకు పరశురామునిచే నిర్మించబడిన స్థలము. ఇక్కడ బాలకునివలె దర్శనమిచ్చును.ఇచట స్వామి స్వయంభువుగా కొలువబడుచున్నాడు. ఆ కారణమున చిన్నదిగా కనపించు శిలామూర్తిగానూ , ఏడు చిన్న చిన్న రూపములను ధరించిన స్వయంభువుగా దర్శనమిచ్చును. దీనితో బాటు అలంకార , ఆరాధనలను అందుకొనుచూ , మన మనస్సులు రంజింపజేయునట్లు
బాలునివలె ఉండి , చేత విల్లంబులు ధరించిన విగ్రహ మూర్తిగానూ దర్శనమిచ్చును.
*ఆరియంగావు*
తమిళనాడు , కేరళదేశమునకు సరిహద్దుగా నుండు దక్షిణగిరికి సమీపమునగలది ఈ స్థలము. ఇచట ఎడమ ప్రక్క పుష్కలాదేవి యుండగా స్వామి కొలువైయుండుట విశేషము. *'యువానాం సుందరం సౌమ్యం'* అన్నట్లుగా కుమార రూపమున , సుందరమూర్తిగా , గజపీఠమునందువెలసియున్నాడు. ప్రతి సంవత్సరమూ పుష్కలాదేవితో స్వామికి కల్యాణోత్సవములు జరుపుబడును.
