అరంగేట్రం గావించిన అయ్యనార్*
*కైలాసాత్ శివసన్నిధౌ నిగదితం చేరాపిత క్షమాభృతా**త్రాక్షా మాక్షిక శర్కరా రుచిహరైః పద్యైః సుభైరుజ్వలం |*
*ఖ్యాతం ద్రావిడ వాజ్ఞ్మయం సుహృదినామ్ యో ద్రావిడామ్ ముదే*
*హ్యా హృద్యోపజహార కావ్య మవనౌ దేవస్స శాస్త్రావతు ||* *(శ్రీముత్తుస్తామి శాస్త్రిగళ్)*
ఈశ్వరునివద్ద ఎనలేని భక్తి ప్రపత్తులు నిండిన పెరుమాక్కో దైయర్ (దేవదాసులు) , తిరువంచై కళమున పరమేశ్వరుని ఆరాధించి జీవించుచుండిరి. చేర వంశమున పుట్టిన వీరు , పిదప ఈశ్వరుని అనుగ్రహముచే శేరమాన్ పెరుమాన్ అను పేరుతో చేరదేశ రాజులై కొడుంగోళూర్ అను ప్రదేశమును ఏలుచుండిరి. పరమ శివదాసుడైన సుందరమూర్తి నాయనార్ వీరికి అత్యంత ఆప్తులైరి. ఆ భక్తులిరువురు కలిసి చేరదేశమున యొక భాగమగు తిరువంచైక్కళం అను స్థలమున బసచేసి , మంచు కొండల రాయుడగు పరమేశ్వరుని స్తోత్రించుచుండిరి. ఒకనాడు (భూలోకము వచ్చియుండిన) అవతార పురుషుడైన సుందరుడు , తన భూలోక జీవితమును ముగించి మరలా తనను కైలాసపురికి పిలుచుకొనవలయునని ఈశ్వరునితో వేడుకొనెను. దానికి అంగీకరించిన ఈశ్వరుడు దేవతలను పిలిచి *"మీరు భూలోకం వెళ్ళి ఆరూరాన్ (సుందరుడు)ను తెల్ల ఏనుగుమీద ఎక్కించి నా వద్దకు తీసుకొనిరండి"* అని ఆదేశించి పంపిరి.
ఈశ్వరానతిని శిరోధార్యము గావించిన అమరులు తిరువంచెక్కళం చేరి సుందరమూర్తిగారివద్ద శివాజ్ఞను తెలిపిరి. అది వినిన సుందరులు మహదానందముచెంది , వారితో వచ్చిన ఆ తెల్ల ఏనుగుపై ఎక్కి కైలాసపురికి బయలుదేరెను. అపుడు తన ప్రాణ స్నేహితుడైన చేరమా ను మనుస్సులో తలచుకొంటూ వెళ్ళిన సుందరుడు వారినికూడా తనతో తీసుకెళ్ళవలయునని దలచిరి. సుందరులవారి కైలాస యాత్రను విని తెలుసుకొనిన చేరమాన్ పెరుమాన్ , తంబిరాన్ మిత్రుడైన సుందరుని విడిచి జీవించుటకు మనస్కరించక తన అశ్వముఎక్కి తిరువంచెక్కళం చేరుకొనెను. అపుడే తెల్లఏనుగుపై అమరి తన మిత్రుడు గగన మార్గాన వెళ్ళుట గాంచిన చేరుడు తనగుఱ్ఱము యొక్క చెవిలో పంచాక్షర మంత్రమును చెప్పెను. *“ఓం నమఃశివాయ"* అను ఆ పంచాక్షర మహిమచే ఆ గుఱ్ఱము ఆకాశమున ఎగిరే సామర్ధ్యము పొందినది. అది గగనమున ఎగురుతూ సుందరులు వెళ్ళిన దారిని పట్టివారిచెంతచేరి వారిని గగణమునందే ప్రదక్షిణచేసి నమస్కరించి వారికి ముందు వెళ్ళసాగెను. అలా చేరమాను , సుందరులు కైలాసపర్వతము చేరుకొనిరి.
ఈశ్వరాజ్ఞానుసారం వచ్చిచేరిన సుందరమూర్తి నాయనార్ను లోనికి అనుమతించిన నందిదేవుడు చేరమాన్ ను లోనికి అనుమతించలేదు. పరమేశ్వరుని దివ్యసన్నిధి చేరిన సుందరుడు కరములుజోడ్చి ఈశ్వరునికి ప్రణమిల్లెను. పిదప వారితో *"ఈశ్వరా నాతో వచ్చిన చేరమాన్ మీ అనుమతి కోసం వాకిటిలోనే నిలబడి వున్నాడు. నన్ను అనుగ్రహించిన తండ్రియగు తమరు అతనిని అనుగ్రహించి లోనికి వచ్చుటకు అనుమతించవలెను"* యని వినమ్రుడై వేడుకొనెను. సుందరమూర్తి నాయనార్ మీద గల వాత్సల్యముతో అందులకు పరమేశ్వరుడు సమ్మతించి నందీశ్వరునితో అతన్ని లోనికి పంపమని ఆజ్ఞాపించెను. నందీశ్వరునిచే లోనికి పిలుచుకొని రాబడ్డ చేరమాన్ భక్తి ప్రపత్తులతో పరమేశ్వరునికి సాష్టాంగ ప్రణామములు చేసి కరములు జోడ్చి నిలబడెను. అనుదినము లోకమాతాపితలైన పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించుకొనుచుండు చేరరాజు అపుడు ప్రత్యక్షంగా తాను అనునిత్యం కొలిచే ఆ ఆదిదంపతులను చూచెను. ఉమాదేవితోనూ పిల్లలైన గణపతి , స్కంధదేవుడు శాస్తావారితోనూ కొలువుతీరియుండు భంగిమను కనులార గాంచి తరించెను. ఈశ్వరుని ఆ అందచందములను కవిత్వముగా చేసెను.
ఈశ్వరుని అనుమతి పొంది తాను రచించిన *"తిరుక్కైలాయ జ్ఞాన ఉలా"* అను గ్రంథమును అప్పటికప్పుడే శ్రీ పరమేశ్వర పార్వతుల ముంగిట పాడి వినిపించెను. అప్పుడు ఈశ్వరుని కొలువులో తల్లిదండ్రుల మధ్య అమరియుండిన శ్రీహరిహరపుత్రుడు ఈ పదకవితను విని మహదానందము చెందెను. చక్కటి తమిళ భాషలో కృతించబడిన ఆ జ్ఞాన ఉలాను భూలోకములోని జనులెల్లరు చదివి ప్రయోజకులు కావలయునని దలచి దాన్ని మనుజుల సమూహము నకు తీసుకొని వెళ్లనెంచిరి. తల్లిదండ్రుల అనుమతితో ఆ కావ్యమును వేదశాస్త్రపండితులు నివసించు *'తిరుప్పిడవూర్'* అను దివ్యక్షేత్రమున వెలుపరచెను. అలా తన తండ్రియగు మహేశ్వరుని స్తుతించి చేరరాజు పాడిన తమిళ మహాకావ్యమగు *'తిరుక్కైలాయ జ్ఞాన ఉలా'* అను తమిళులు అందరూ చదివి తరించే రీతిగా పిడవూర్ నందు అచ్చటయున్నవారు సమక్షమున కరమున ఆ తాళపత్ర గ్రంథముతో ఆ వెలుపుచ్చిన శ్రీ శాస్తావతారాన్ని అందరూ అరంగేట్రం గావించిన అయ్యనార్ అని స్తుతించి పొగడిరి. ఇలా సామాన్యులు సైతం దైవస్తుతి చేసినచో సాక్షాత్ పరబ్రహ్మమే ముందుకువచ్చి అరంగేట్రం గావించును అను వార్త తెలియగానే అనేకమంది కవులు అప్పటినుండి అనేక కావ్యములు కీర్తనలు శ్రీపరమేశ్వరునిపైననూ , శ్రీమహాశాస్తావారి పైననూ వ్రాయుటకు మొదలిడిరి.
