చోళరాజును అనుగ్రహించిన శాస్తా*
భూలోకమున పుణ్యక్షేత్రముగా వెలయు కాశీపట్టణమును *'మహాబాహు'* అను రాజు ఏలుచుండెను. మహాశాస్తావారి పట్ల అచంచల భక్తి ప్రపత్తులు నిండియుండిన అతడు స్వామివారి అనుగ్రహముతో రాజ్యనిర్వహణలోనూ , భక్తి ఆచరణలోనూ సాటిలేనివాడై యుండెను. అతని భక్తికి మెచ్చుకొనిన అయ్యప్ప తలచిన స్థలమునకు కొనిపోగల అద్భుత విమానమును అతనికి బహుమతిగా ప్రసాదించెను. అయ్యప్పస్వామి అనుగ్రహముతో త్రిలోకమునందలి ఎనలేని కీర్తి ప్రపత్తులతోనూ , దేవతలు సైతం స్తోత్రించి సావాసము చేయగల విధానముగానూ ఆ రాజు మెసలుకొనెను. ఒక పర్యాయము మహాబహు వేదనాయకుడగు శ్రీమహాశాస్తా వారిని దలచి యొక మహాయజ్ఞము చేయ సంకల్పించెను. తన వద్ద యున్న విమానమెక్కి అన్నిలోకాలకు వెళ్ళగలవాడై నందున తాను నిర్వహించనెంచిన యజ్ఞములో పాలుపంచు కొనుటకు రమ్మని బ్రహ్మ మొదలగు దేవతలందరిని , సకల తీర్థరాజములను , పర్వతములను , దిక్పాలకులందరిని వారు వీరు అననేల అందరిని ఆహ్వానించి యుండెను. అతని ఆహ్వానమును మన్నించి అందరూ ఆ యాగములో పాలుపంచుకొనిరి. యాగముకూడా శ్రీ స్వామివారి అనుగ్రహముతో అత్యద్భుతముగా నెరవేరెను. యాగము చివర మహాబాహు అందులో పాలుపంచుకొన్న వారందరికి తగు మర్యాదలు చేసి గౌరవించెను.
అదిగాంచి హిమవత్పర్వతరాజు కాస్త ఈర్షచెందెను. మహాశక్తి అగు పార్వతిని పుత్రికగానూ , సాక్షాత్ పరమేశ్వరునే అల్లుడుగానూ పొందిన తనను మహాబాహు అందరికన్నా గొప్పగా తనను గౌరవిస్తాడని ఎదురుచూసెను. కాని కాశీరాజు అందరిని ఒకలాగే సత్కరించుట అతనిమనస్సులో కాస్త కలతను కలిగించినది. తక్కిన వింధ్యరాజు వంటి పర్వతములకు ఇచ్చిన మర్యాదనే తనకు ఇచ్చినందున ఆగ్రహించిన అతడు ఆ రాజుని చూసి ఆగ్రహముతో పరుషవచనములు మాటలాడసాగెను. అందరి సమక్షమున ఇచ్చిన ఆ బహుమతులను విసిరిపడేసి బయటకి వెళ్ళుటకు యత్నించెను.
వీటన్నిటిని తిలకించుచుండిన బ్రహ్మదేవుడు అతని అహంభావమునకు మిక్కిలి ఆగ్రహము చెందెను. *"హిమవంతుడా ! సర్వేశ్వరుడైన శ్రీమహాశాస్తావారి మహాయాగమున అతడి పరమభక్తునిచే నీకు ప్రసాదించబడిన బహుమతులను నీ అహంభవముచే విసిరికొట్టితివి అటువంటి నీవు మహాశాస్తావారి పరమభక్తుడైన ఒకరాజుచే ఓటమిపాలై , అతనిచే శిక్షించబడుదువు గాక"* యని శపించెను. అహంభావము నెత్తికి ఎక్కివుండిన హిమవంతుడు దాన్ని పెడ చెవిన పడేసి అటునుండి వెళ్ళిపోయెను. కొంతకాలం గడచినది. చోళ దేశమును కావిరిపూంపట్టినం అను శ్రీనగరమును రాజధానిగాకొని *"కల్మాషపాదుడు"* అను రాజు ఏలుచుండెను. సూర్యకుల తిలకమై చోళ వంశమును ఏలుచుండిన ఆ రాజు చిన్నవయస్సునుండియే అపార మేధాశక్తియూ మిక్కిలి వీర శౌర్య పరాక్రమములు నిండినవాడై యుండడంతోపాటు శ్రీమహాశాస్తావారిపై అతీతమైన భక్తి ప్రపత్తులు కలిగి యున్నవాడై వెలసెను. అయ్యప్పస్వామివారి అనుగ్రహముచే తనమీద యుద్ధమునకు తలపడిన శత్రుదేశస్తులందరినీ ఓడించి దక్షిణభారత మంతయూ తన పాలనలోకి తెచ్చుకొని సువిశాల దేశముగావించి సత్పాలనము చేయుచుండెను. ఇతన్ని ప్రజలు ప్రేమతో *"కరికాల్ పెరువళత్తాన్"* అని పిలవసాగిరి.
తదుపరి ఉత్తరభారతదేశముపై దృష్టిని సారించిన కరికాలుడు ఆ దేశములపై దండెత్తి వెళ్ళెను. ఒక సమయాన మోక్షపురియగు కాంచీపురమును చేరుకొని ఆ నగరము సమీపాన తన వీరులతో గుడారమేర్పరచుకొని విశ్రమించెను. అచ్చట వెలసియుండిన ఆదిభూతుడైన అయ్యప్పస్వామివారి సన్నిధిని దర్శించి శ్రీస్వామి వారిని పలురీత్యా స్తుతించెను. తనను ఇంతవానిగా అనుగ్రహించిన శ్రీస్వామివారికి అనేక కైంకర్యములు చేయించి మురిసెను. అందువలన సంతసించిన శ్రీమహాశాస్తా అతనికి అనుగ్రహము యొసంగ నిశ్చయించి అతని ముంగిట ప్రత్యక్ష మయ్యెను. *"కరికాల ! నీ భక్తిప్రపత్తులకు , నీవు చేసిన సేవలకు మెచ్చుకొంటిని. మున్ముందు కూడా నా అనుగ్రహముచే నీవు వీరధీరపరాక్రమములు చేసి పలుదేశములను కైవశము చేసుకొందువుగాక ఉత్తర భారతదేశమును గెలిచి హిమ గిరిని ఓడించి చక్ర వర్తియై తీరుదువుగాక"* యని ఆశీర్వదించి అతనికి యొక చెండా యుధమును బహు కరించి ఆశీర్వదించి అదృశ్య మయ్యెను. భూలోక వాసియగు సామాన్య మానవు డొక్కడు పేరు ప్రఖ్యాతలు గడించి , తనను దాటుకొని వెళ్ళుటగాంచి ఆగ్రహించిన హిమగిరీశుడు వానిని అడ్డుకొన దలచి యొక రాజురూపమున అతని ముంగిట వచ్చి అతనితో యుద్ధమునకు తలపడెను. ఎంతటి శక్తివంతమైన ఆయుధములను ప్రయోగించిననూ వాటన్నిటిని కరికాలుడు సునాయాసముగా నేలకూల్చెను. ఇంకనూ వదలక అనేక ఆయుధములను ప్రయోగించిన హిమవంతునిపై ఆగ్రహించిన కరికాలుడు అన్యాయమును ఎదిరించి పోరాడుటకు అయ్యప్పస్వామి వారు ప్రసాదించిన చెండాయుధమును పైకితీసి హిమవంతుని తలపై బాదెను. స్వామివారి చెండాయుధము హిమవంతుని తలపై పిడుగులా దిగెను. హిమవంతుడు స్పృహతప్పి నెలకొరిగెను.
వెంటనే అచ్చట ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు కరికాలుని ఆగ్రహమును శాంతపరచి మునుపు తాను హిమవంతునికి యొసంగిన శాపమును చెప్పి అతనిని మన్నించమనెను. పిదప తన కమండలములోని జలమును హిమవంతునిపై చల్లగా హిమవంతుడు స్పృహలోకి వచ్చెను. బ్రహ్మదేవుడు జరిగినదంతా హిమవంతునికి గుర్తుచేసెను. గర్వము తొలగిన హిమవంతుడు బ్రహ్మదేవునికి , కరికాలునికి ప్రణమిల్లి *"చోళరాజా ! శ్రీమహాశాస్తావారి భక్తుడైన మహాబాహును కించపరచినందువల్లనే నేను ఇప్పుడు ఇంతటి అవమానమును పొందవలసి వచ్చినది.
*శ్రీమహాశాస్తావారు నీకు ప్రసాదించిన ఈ చెండాయుధము యొక్క స్పర్శచే నా గర్వము తొలగినది. ఇప్పుడు నేను గర్వము తొలగి ప్రశాంత చిత్తుడై యున్నాను. ఈ వృత్తాంతమును భూజనులెల్లరు తెలుసుకొను రీత్యా శ్రీ శాస్తావారి భక్తుడైన నీ దేశపు చిహ్నముదాల్చిన జండాను నా పర్వత శిఖరముపై నాటి వెళ్ళుదువుగాక"* యని వినయముతో చెప్పెను. ఆ మాటలకు సంతసించిన బ్రహ్మదేవుడు అటునుండి అదృశ్యమయ్యెను. పిదప చోళరాజైన కరికాలుడు హిమగిరి శిఖరముపై పులిబొమ్మగల తన పతాకమును నాటి , అందుండి ఉత్తరముగా వెళ్ళి సర్వులను గెలిచి మహారాజుగా మిక్కిలి పేరుప్రఖ్యాతులతో పలుకాలములు జీవించెను.
