అచ్చన్ కోవిల్ కరవాలము*
దైవమునుగూర్చి సదా సర్వకాలము తలచుచుండు భక్తుడు ఎప్పుడు ఆ భగవంతుని వద్దకు వెళ్ళిననూ ఒక అతీతమైన జాగ్రత స్పూర్తితో వెళ్ళవలయును. భగవంతుడు తన దాసులు పొరబాట్లను క్షమించును. కాని ఆయన దాసులు మాత్రం ఇతరులు భగవంతుని యెడ చేసే పొరబాట్లను మాత్రము సహించజాలరు.
పరశురామ క్షేత్రమున అయ్యప్ప స్వామివారు కోయిలగొని యుండు స్థలములలో శ్రీ పూర్ణాపుష్కళా సమేతుడై , రాజాది రాజునిగా (అచ్చన్ కోవిల్ అరసన్ గా) దర్శనమొసంగు దివ్యస్థలమే అచ్చన్ కోవిల్. కలియుగమున ప్రత్యక్ష దైవమై కోవిల గొనియుండు అచ్చన్ కోవిల్ రాజును సర్వకాల సర్వావస్థలయందునూ మనస్సున కోయిలగొని యుంచుకొని వున్నాడు ఒక భక్తుడు. తిరునల్వేలి జిల్లా పావూర్ సత్రం అనబడు ఊరుకు చెందిన ఆ బ్రాహ్మణుడు అచ్చన్ కోవిల్ శాస్తావారిపట్ల అమిత భక్తిప్రపత్తులు నిండినవారగును. అంతటి భక్తశిఖామణి మనస్సులో పలుకాలంగా ఒక అభిలాష నెలకొనియుండెను. అది ఏమనగా దేవాదిదేవతలెల్లరు సేవచేయుచుండు కాంతగిరి పొన్నంబలమున కోలాహలముగా పూజలందుకొంటున్న శ్రీధర్మశాస్తా వారిని అచ్చటికి వెళ్ళి దర్శించుకొనవలయునన్నదే అది.
తన మనస్సులోని ఈ కోర్కెను అనుదినము స్వామి ముంగిట పూజలు చేయువేళ ప్రార్థనగా మొరలిడుతూ వచ్చెను ఆ బ్రాహ్మణుడు. వారు స్వీకరించియుండు కరుప్పస్వామి ఉపాసన కూడా అందులకు తోడుగా నిలిచెను. యదార్థభక్తులయెడ తన కరుణామృతమును కురిపించు భక్తవత్సలుడైన అయ్యప్ప ఆ విప్రుని కోర్కెను తీర్చనెంచి కరుప్పస్వామిని వారివద్దకు పంపెను.
భక్తుడైన బ్రాహ్మణుని ముంగిట ప్రసన్నమైన కరుప్పస్వామి *"విప్రశ్రేష్టా ! నీ మనోభిలాషతో కూడిన ప్రార్థన శ్రీస్వామివారి చెవిన పడినది. స్వామివారి ఆజ్ఞానుసారం వారి సన్నిధికి మిమ్ములను కొనిపోవుటకే నేను వచ్చియున్నాను. కాని ఒక హెచ్చరిక. నేను మిమ్ములను కాంతమలకి కొనిపోయి వదలినప్పుడు అచ్చట యుండు ఏ యొక వస్తువును తాకవలయునని ఎంచకూడదు. ఇది మిక్కిలి గుర్తించుకొన వలసిన విషయమగును. మరలా చెప్పుచున్నాను. ఇది స్వామివారి హెచ్చరిక"* అనెను.
అందులకు శ్రీస్వామివారిని దర్శించబోవు ఉత్సాహములో యుండిన బ్రాహ్మణుడు అంగీకరించెను. *"ఇప్పుడు నన్ను ముట్టుకోండి"* అని కరుప్పస్వామి చెప్పగా బ్రాహ్మణుడు వారి చేతులను పట్టుకొనెను. బ్రాహ్మణుడు కరుప్పస్వామిని కనులుమూసుకొని తాకిన మరుక్షణం కనులు తెరచినప్పుడు ఇద్దరూ భక్తులను అయస్కాంతము వలే ఆకర్షించు కాంతమలై శిఖరమున యుండుట గ్రహించి ఆశ్చర్యపోయిరి.
మనస్సును మైమరపించు అలంకారములతో , నవరత్నఖచిత మండపములు , భవనములు సర్వము స్వర్ణమయమై ధగధగ మెరుసూ కనపడెను. ఆ ప్రదేశమున కాలుమోపగానే ఆ బ్రాహ్మణుని తనువు ఒక్కసారిగా పులకరించిపోయెను. చేసిన పాపములన్నియూ కరిగి నీరై పోయినట్లు అనిపించెను. కనులనుండి భక్తి పారవశ్యముతో జలధారలు వ్రాలసాగెను. అమరులు ఏకాంతముగా అయ్యప్పస్వామి వారిని ఆరాధించు పొన్నంబల స్వర్ణసింహాసనమున శ్రీ పూర్ణా , పుష్కళా సహితుడే శ్రీశాస్తావారు గంభీరముగా కొలువుండిరి. పదునెనిమిది దేవతలు సోపానములై అలా పరుండి కన్నులు గీటుచుండిరి. ఇంతటి ఈ దృశ్యమును దర్శించుటకు తాను ఎన్ని జన్మల తపము చేసినాడో తెలియదుగాని అంతటి మహాత్ భాగ్యము ఆ విప్రునికి కలిగినది.
స్వర్ణఖచిత సింహాసనమున శ్రీస్వామివారు అమరియుండగా యక్ష - కిన్నెర - కింపురుషాదులు జయగోషలు చేయుచుండిరి. అత్రి - భృగు - గుప్త - వశిష్ఠ - గౌతమ - అంగీరస అనబడు సప్తఋషులు వేదఘోషము చేయుచుండిరి. రంబ - ఊర్వశి మేనక తిలోత్తమ - వంటి అప్సరసలు ఆనంద నృత్యము చేయుచుండిరి. గంగా - యమున -గోదావరి - నర్మద - సింధు - కావేరి - కృష్ణ - తుంగభద్రా మున్నగు పుణ్య భాగీరధులు శ్రీస్వామివారి పాదములు కడుగుటకు సిద్ధముగా యుండిరి. దేవేంద్రుడు ఉదయాస్తమన పూజ చేయుటకు పళ్ళెములో పారిజాత పుష్పములను పట్టుకొని సిద్ధముగా యుండెను. అష్టదిక్పాలకులు వింజామరలు వీచుచుండిరి. భూతగణములన్నియూ శ్రీ స్వామివారి సేవలో నిమగ్నమై యుండిరి. గణపతి , కుమారస్వాములు వారి చెంతనే అమరియుండిరి. శ్రీ శాస్తావారి తనయుడగు సత్యకన్ అటుఇటూ తిరుగుతూ భూతగణములకు ఆదేశాలను జారీచేయుచుండెను. ఇవన్నిటిని మందహాసముతో స్వీకరించు చుండిన శ్రీస్వామివారు పొన్నంబలమున అడుగిడిన బ్రాహ్మణుని తిలకించెను.
అంతటి పవిత్రమైన ప్రదేశమున తన పాదము మోపుటకు మనస్కరించని ఆ బ్రాహ్మణుడు అలాగే నేలపై పడి ద్రొల్లుతూ శ్రీ స్వామివారి సన్నిది ముంగిటవరకు వెళ్లి అటులనే పరుండి అనేక విధముల స్తోత్రపారాయణములచే స్వామిని స్తుతించ సాగెను. ఎంతవరకు - ఎంతసేపు - పారాయణము చేసిననూ బ్రాహ్మణునికి అటునుండి లేవవలయునని అనిపించనే లేదు. దొరుకునా మరలా మరలా ఇట్టి సదవకాశము యని అనిపించినదో ఏమో ? అటులనే పరుండిన బ్రాహ్మణుని చూసి శ్రీస్వామివారు *"విప్రశ్రేష్ఠ ! నీ భక్తికి మెచ్చితిని కావుననే ఇంకెవ్వరు కోరని కొర్కెగా నీవుకోరిన పొన్నంబల దర్శనమును నీకు ప్రసాదించితిని. నీవు కీర్తి ప్రతిష్ఠలతో చిరకాలం భువిపై యుండిన పిమ్మట నా సాయుజ్యము చేరుకొందువు గాక"* యని ఆశీర్వదించెను. పిదప కరుప్పస్వామితో *"మరలా ఇతన్ని అతని స్థావరములో విడిచిపెట్టి రమ్ము"* యని ఆజ్ఞాపించెను.
ఆ ఆజ్ఞను శిరసా వహించిన కరుప్పస్వామి బ్రాహ్మణునితో తనతో రమ్మని పిలిచెను. అంతవరకు స్వామివారి దర్శనముతో తనువు మరచి యుండిన బ్రాహ్మణుడు మరలా తన స్వస్థలం వెళ్ళబోయే తరుణాన కరుప్పస్వామి అచ్చన్ కోవిల్ నుండి బయలుదేరకముందు జారిచేసిన హెచ్చరికను మరచి పోయెను. తాను పొన్నం బలము శ్రీ స్వామివారిని చూసి వచ్చినందులకు గుర్తుగా ఇచ్చటనుండి ఏమైనా యొక దివ్యవస్తువును తీసుకువెళ్లితే తప్ప ఇతరులు తన మాటను నమ్మరు అను ఉద్దేశ్యంతో ఏమైనా ఒక వస్తువును తీసుకెళ్ళుటకు నిశ్చయించెను. అప్పుడు అచ్చట గోడపైన ధగధగా మెరుస్తుండిన కరవాలం కనిపించెను. దానిని తీసుకెళ్ళి అచ్చన్ కోవిల్లో యుండే భక్తులకు చూపించాలను సంకల్పముతో ఆ కరవాలమును ముట్టుకొనెను. ఇంకేముంది మరుక్షణము ఆ బ్రాహ్మణుడు విసిరి పడవేసినట్లు అచ్చన్ కోవిల్ అడవి పరిసర ప్రాంతమున మూర్చిల్లి పడిపోయెను. కరుప్పస్వామి హెచ్చరికను లెక్కచేయక కాంతమలైలో యున్న దివ్య వస్తువును ముట్టుకున్న తన పొరబాటుకు ఆ బ్రాహ్మణుని చూపులుపోయెను.
స్పృహ వచ్చిన బ్రాహ్మణుడు తనకు కనుచూపు పోయినది గ్రహించి బాధపడెను. తాను చేసిన పొరబాటుకు తగిన శాస్తి లభించినదని మనస్సుకు ఓదార్పు చెప్పుకొనెను అతని మనస్సులో మాత్రం పొన్నంబలమున దర్శించుకొనిన స్వామివారి భంగిమయూ , అచ్చట గోడకు తగిలించియున్న స్వర్ణ కరవాలము కదలాడుచునే యుండెను. మెల్లి మెల్లిగా తడుముకొంటూ అచ్చన్ కోవిల్ ఆలయ ప్రాంగణము చేరుకొన్న బ్రాహ్మణుడు గుడి పూజరితో తాను చేసిన సన్నివేశమును వివరించెను.
మరుసటి ఉదయము ఆలయము తెరచిన పూజారికి మహాదాశ్చర్యము కలిగినది. ఇదివరకు ఆ గర్భగుడిలో లేని నవరత్న ఖచిత స్వర్ణకరవాలము స్వామివారి ప్రక్కన యున్నది కనబడెను. బ్రాహ్మణుడు చెప్పినది వాస్తవమేనన్నది గ్రహించిన పూజారి ఆ విషయమును బ్రాహ్మణునితోనూ మిగిలిన గ్రామస్తులకు తెలిపెను.
ఆ భక్తుడు చేసిన పొరబాటుకు ఫలితముగా అతని వంశములోని వారందరూ కనుచూపులేకనే పుట్టి బాదపడుచున్నారు. కాని కాంతమలై కరవాలం మాత్రం ఆ అచ్చన్ కోవిల్ ఆలయముననే యుండిపోయినది. ఆ కరవాలం యొక్క మహిమలను చెప్పుట ఎవ్వరితరముకాక పోయినది. మేను బంగారముతో ధగధగలాడు చుండు ఆ కరవాలము యొక్క తూకము ప్రతి చోట మారినప్పుడు యొక్కక్క విధముగా కనబడుచున్నది. ఆ ఖడ్గము నేటికిను అచ్చన్ కోవిల్ స్వామివారి సన్నిధిని అలంకరిస్తూ కనబడుతూ ఆ నిష్కల్మషభక్తి నిండిన బ్రాహ్మణుని త్యాగమును గుర్తుచేయుచునూ యున్నది.
అయ్యప్ప సర్వస్వం - 120 | అచ్చన్ కోవిల్ కరవాలము | Ayyappa Sarvaswam
October 18, 2025
Tags
