శ్రీ మహాశాస్తా చరితము - 51 | శాస్తా యొక్క కరుణను పొందిన రావణుడు | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 51 | శాస్తా యొక్క కరుణను పొందిన రావణుడు | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

శాస్తా యొక్క కరుణను పొందిన రావణుడు:

సృష్టికర్తయైన బ్రహ్మదేవుని మానసపుత్రుడు పులస్త్యమహర్షి. అతడి కుమారుడు విశ్రవసు.
అతడికి మందాకిని , కైకసియను భార్యలు ఇరువురు కలరు. వారిలో మందాకినికి జన్మించినవాడు కుబేరుడు. కైకసి పుత్రులే రావణుడు , కుంభకర్ణుడు , విభీషణుడు అను మూవురూ.

ఆ సమయమున పెద్దవాడైన కుబేరుడు లంకానగరమును పరిపాలించుచుండెను. ఇది చూచి కంటగించిన కైకసి , తన కుమారుడైన రావణునితో *“కుమారా ! నీ పెద్ద తల్లి కుమారుడైన కుబేరుడు ఐశ్వర్యముతో తులతూగుతూ , పుష్కక విమానము , లంకారాజ్య ఆధిపత్యము అంటూ సర్వభోగములూ అనుభవించుచున్నాడు. మరి నీవో , ఏ సంపదలూ లేక ఉండుట నాకు ఎంతో బాధగా ఉన్నది. బ్రహ్మదేవునికై తపమాచరించి , వరములను పొంది , నీవు కూడా కుబేరుడంతటి వాడై కీర్తి ప్రతిష్టలతో తులతూగవలెననునది నా కోరిక”* అని తెలిపినది.

తల్లి కోరికపై కఠోర తపస్సు చేసి , బ్రహ్మదేవుని వరప్రభావము చేత బలవంతుడైనాడు. తన
సోదరుడైన కుబేరుని వద్దనుండి లంకానగరమును , పుష్పక విమానమును కైవసము చేసికొనెను. ఆ
తరువాత దేవతలను జయించి మహావీరునిగా కీర్తిగాంచెను. గర్వము తలకెక్కిన రావణడు , ఒక
మారు పరమశివుని చూచుటకై కైలాస పర్వతమునకు వెళ్ళెను.

ఆ సమయమున పరమేశ్వరుడు తన భార్యయగు పార్వతీ దేవితోనూ , తన కుమారులైన గణపతి , సుబ్రమణ్యేశ్వరస్వామితోనూ వీక్షించి యుండెను. నంది దేవుని పిలిచి *"నా భార్యా పుత్రులతో కొంత సమయము ఏకాంతముగా నుండ నిచ్చయించితిమి. ఆ సమయమున ఎవరు వచ్చిననూ లోపలికి అనుమతించరాదు”* అని దృఢముగా తెల్పెను.

అదే తరుణమున ఏతెంచిన రావణుడు , పరమశివుని చూచుటకై వచ్చిన విషయము తెలుపగా , దారిలో అడ్డగించిన నందీశ్వరుడు , శివుని ఆజ్ఞలేదు గావున లోనికి పంపుట సాధ్యము కాదనెను బలగర్వముతో మిడిసిపడుచున్న రావణుడు ఎట్లైనను లోనికి పోవుటకు ప్రయత్నించగా , నందీశ్వరుడు అతడిని వెలుపలికి నెట్టి వేసెను.

ఉగ్రుడైన రావనుడు *"నన్ను అవమానించిన నంది , అతడిని కావలికై యుంచిన ఈశ్వరునికి తగిన గుణపాఠము చెప్పుదునని అహంకారపూరితుడై కైలాసపర్వతమును తన ఇరువరి చేతులతో పైకెత్తి తిప్పసాగెను. రావణుని చేష్టలకు కోపగించిన శివుడు , రావణునికి గర్వభంగము చేయబూని , లేశమాత్రముగా తన కాలి బొటనవేలితో కైలాసమును అదిమివేసెను. అంతమాత్రమునకే రావణుడు పర్వతము క్రింద చిక్కుకుని అల్లాడసాగెను.*

ఈ స్థితి కొనసాగుచుండగా , ఆ సమయమున ఏతెంచిన వాశీశమహర్షి శివ దర్శనార్థము వచ్చినవాడై , పరిస్థితిని అవగతము చేసుకుని రావణునికి హితబోధగావించి , ఈశ్వరుని మన్నింపుమని ప్రార్థన చేయమనియూ , శివునకు ప్రీతి పాత్రమైన సామగానమును ఆలపించుమని ఉపదేశించెను.

ఆ సమయమున శివసాన్నిధ్యమున అమరియున్న శాస్తా సామగాన ఆలాపన విన్నంతనే ఆనందపరవశుడయ్యెను. సామగానప్రియుడు కదా శాస్తా. ఆ కారణముగానే శాస్తాకు రావణుని
యందు కరుణ ఉప్పొంగెను.

తండ్రి నుద్దేశించి *"తండ్రీ ! రావణుడు చేసినది తప్పే. అయిననూ అతడు తన తప్పును తెల్సికొని మీ వద్ద క్షమాపణ కోరుచున్నాడు. మిమ్ములను కరుణించమని సామగానమును ఆలపించుచున్నాడు. కాబట్టి మీరు అతడిని క్షమించి తీరవలసినదిగా ప్రార్థించుచున్నాను”* అనెను.

*“వత్సా ! రావణుని గర్వము అణచుటకు ఇది చాలదు. అతడు ఇంకనూ బాధపడవలసినదే. కానీ కరుణామూర్తియైన నీవు కోరుటచేత అతడిని మన్నించుచున్నాను”* అని పరమశివుడు రావణుని అనుగ్రహించి , కుటుంబసమేతుడై ప్రత్యక్షమై , రావణుని అభీష్టము నెరవేర్చిపంపెను.

అంతట లంకానగరమునకు తిరిగివచ్చిన రావణుడు , అతిబలవంతుడై కీర్తి ప్రతిష్టలతో అలరారుచు
ఉండెను. ఓకనాడు సభకు నారదమహాముని ఏతెంచి , కైలాసమున జరిగిన వృత్తాంతమును అడిగి తెలిసికొనెను. *“అహంకారపూరితుడనైన నేను చేసిన తప్పిదమునకు తగిన శిక్షను అనుభవించవలసి వచ్చింది - శివ అపరాధము చేసినవారు తప్పించుకొనగలరా ? రుద్రుని యొక్క ప్రత్యక్ష కోపమునకు పాత్రుడనైన నేను పరమశివుని ప్రార్థించగా , నా తప్పిదమును మన్నించి , నన్ను పరమశివుడు అనుగ్రహించెను.*

*కరుణాసముద్రుడైన శ్రీమహాశాస్తా కారణముగానే ఈనాడు నేను పరమశివుని అనుగ్రహమునకు పాత్రుడైన సుఖముగా జీవించుచున్నాను”* అని కృతజ్ఞతగా పలికెను.
బదులుగా నారదమహాముని *“రావణా ! నీ కృతజ్ఞలను మాటలతో మాత్రము సరిపెట్టుట పాడికాదు. భక్తవత్సలుడైన మహాశాస్తా , భక్తులకొరకు పలుచోట్ల కొలువైయున్నాడు.*

*అట్లు 'ప్రముశి' మహాముని కొరకుగానూ , తన దేవేరులతోనూ , పరివార గణములతోనూ కొలువై యున్న స్థలము రైవత పర్వతము. అచ్చట స్వామి నిత్యవాసము చేయుచున్నాడు. అచటికి వెళ్ళి స్వామిని దర్శించి , అతడి ఆశీర్వాదములు పొందుము”* అని తెల్పెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow