శ్రీ మహాశాస్తా చరితము - 52 | శునకము , మేక , కుక్కుటము వీటిని అనుగ్రహించిన విధము | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 52 | శునకము , మేక , కుక్కుటము వీటిని అనుగ్రహించిన విధము | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

శునకము , మేక , కుక్కుటము వీటిని అనుగ్రహించిన విధము*

ఒకానొక సమయమున మహాగ్రీవుడు , అసురేశుడు , విశాలనేత్రుడు అను మూవురు రాక్షస
సోదరులు ఒక అడవి యందు నివసించుచుండిరి. మాయా రూపములు ధరించుటలో సిద్ధహస్తులు.
నరమాంసభక్షకులు. అడవి మార్గమున వచ్చు నరులను , నయవంచనచేసి , లాఘవముగా వారిని
హతమొనరించి మాంసభక్షణ చేయుచుండిరి.

సోదరులలో మధ్యవాడైన అసురేశుడు అనువాడు కుక్కుటముగా మారి అడవి మార్గమున
ఎవరైననూ వచ్చుచున్నారా అని పరిశీలించుచూ , ఎవరైనా వచ్చినంతనే వారి రాకను తనవారికి తెలియజేయువిధముగా కొక్కరక్కో అని అరచును. ఇక విశాలనేత్రుడనువాడు మేక వేషము ధరించి ,
ఎంతో వేగముగా కాళ్ళతో కుమ్ముచూ వచ్చి , బాటసారులను తన కొమ్ములతో కింది పడవైచును. మరుక్షణమే మహావీరుడను వాడు వేటకుక్కవలె మారి , అచ్చటికి వచ్చి కిందపడిన వారిని కుమ్ముచూ , వారి గొంతులను కరచి , రక్తమును పీల్చును. ఆ పైన సోదరులు తమ స్వయరూపములు
బూని మరణించిన వారిని తమ గుహకు ఈడ్చుకునిపోయి తిందురు. ఇటులనే ఎందరో బాటసారులు ,
సాధువులు వారిచే అసువులు బాసిరి.

ఒకసారి తపోసంపన్నుడు , శ్రీమహాశాస్తా యొక్క పరమభక్తుడునైన అగస్త్య మహాముని ఆ దారివెంట రాసాగెను. ఎప్పటివలెనే మాయారూపములు ధరించిన అసురేశుడు కుక్కుటముగానూ ,
విశాలనేత్రుడు , మహాగ్రీవుడు మేక , శునక వేషము బూని అగస్త్యనిపై లంఘించిరి. క్షణమాత్రముననే వారి మాయను గ్రహించిన ముని వారికి బుద్ధి చెప్పదలచెను. తనవైపుగా లంఘించి వచ్చుచున్న
మేకని చూచి శాంతపూరితముగా చిరునవ్వు నవ్వగా , దాని ఉగ్రత్వమంతయూ పోయి , ముని యొక్క
పాదముల చెంత మూర్ఛపోయినది.

ఇది చూచి కోపావేశముతో తనపై దుమకపోయిన శునకమును చూచి నవ్వగా కుక్క కూడా
అతడి పాదముల చెంత మూర్ఛపోయినది. కుక్కుటమును చూచిన మహర్షి నీ సోదరులు ఇట్లు పడి యుండగా , నీవు మాత్రము ఒంటరిగా తిరుగాడుట సమంజసము కాదు అనుచూ దాని యందు
కూడా తన చూపును ప్రసరించగా , కోడిపుంజు సైతము మహర్షి పాదముల చెంత మూర్ఛపోయెను. పలు దుష్టకార్యములు చేసియూ , పలువురిని పొట్టన బెట్టుకొనిన ఆ ముగ్గురూ ఇక బ్రతికియుండుట నేరముగా భావించిన మహర్షి వారిని చంపివేయనెంచెను. కానీ ఊహించని విధముగా ,
తపస్సంపన్నుడైన మహర్షి పాదముల పైబడుటచే , వారి పాదస్పర్శ కారణముగా , వారిలోని దుర్గుణములు నశించిపోయినవి. విచక్షణాజ్ఞానము కలిగినవారై *"మునీంద్రా మేము చేసిన ఘోరకృత్యములు పాపకార్యములకు సిగ్గుపడుచుంటిమి. కరుణాసముద్రులైన తమరు మా తప్పులను క్షమించి , మాకు సద్గతి కలుగజేయ ప్రార్థన”* అని వేడిరి.

వారిలో కలిగిన పరివర్తన , వారు ప్రార్థించిన తీరు చూచిన మునీంద్రుడు *"అసురులారా ! ఇకపై
మీరు ఈ రూపములలోనే సంచరింతురుగాక. కానీ ఇంతవరకూ మీరు చేసిన పాపములు తొలగవలెనన్నచో , మహాశాస్తాని శరణువేడుట తప్ప వేరు మార్గములేదు.

*కశ్యపమహర్షిసుతుడైన శాండిల్య ముని ఈ అడవిలో ఒకచోట ఆశ్రమమునెలకొల్పి , జగత్కారణుడైన మహాశాస్తా కొరకు కఠోర తపస్సును ఆచరించుచున్నాడు. మీరు అచటికి పోయి , నలభై ఎనిమిది రోజులు అనగా ఒక మండలం పాటు ఆశ్రమమును ప్రదక్షిణగావించుడు. సదా తన భక్తులను అనుగ్రహించు భగవంతుడు , తప్పక మిమ్ములను కాపాడి ఆనుగ్రహించును”* అని వారిని శాండిల్యముని ఆశ్రమమునకు పంపెను.

అగస్త్యముని చెప్పిన దంతయూ విని , వారు అతడికి నమస్కరించి శాండిల్యముని ఆశ్రమమును చేరి ముని చెప్పినట్లుగానే ప్రతిదినమూ ప్రదక్షిణ చేయసాగిరి. ఆశ్రమమున మునివర్యులు పఠించు
సహస్రనామములు , ప్రార్థనలను ప్రతిదినమూ వినుట వలన ఆ జంతువులు మరింత పవిత్రతను
సంతరించుకున్నవి. ఇటులనే మహర్షి వాక్కు వేదవాక్కుగా భావించిన ఆ ప్రాణులు ఒక మండలం పాటు శ్రద్ధాభక్తులతో ప్రదక్షిణ గావించిరి. రోజులు గడచిన కొలదీ ఆ ప్రాణులు మరింత
ఉన్నతముగా మారిపోయినవి. పరిపూర్ణమైన ఆత్మజ్ఞానమును పొందిన ఆ మూవురినీ అనుగ్రహింపగోరిన నిజభక్త పరాధీనుడైన స్వామి వారి ముందు ప్రత్యక్షమయ్యెను.

*“అసురులారా ! అగస్త్యముని వలన జ్ఞానోపదేశము , శాండిల్యముని వలన అనుగ్రహము పొందగలిగిన మీరు అత్యంత భాగ్యశాలురు. అందుచేతనే మీయందు నాకు అమితమైన కరుణ కలిగినది. జనులందరూ పొగడు విధముగా మీకు దైవత్యము ఆపాదించబడినది. శునక రూపముననున్న మహాగ్రీవుడు , మేకరూపమున నున్న విశాలనేత్రుడు నాకు వాహనములుగా మారుదురుగాక. కుక్కుట రూపుననున్న అసురేశుడు నా యొక్క ధ్వజమునందు నిరంతరమూ నిలువగలడు”* అని వారిని దీవించెను.

అసురకులమునందు జన్మించిననూ , పలు పాపపు పనులను చేసిననూ , తమ్ము క్షమించి , తమకు ఇటువంటి ఉన్నతమైన స్థానములను కల్పించిన స్వామికి కృతజ్ఞతతో పలుమార్లు నమస్కరించిరి. సమస్తలోక రక్షకుడైన ప్రభువు ఆశీర్వదించి , తన లోకమునకు పంపివైచెను.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow