పంచముఖాసుర సంహారము:
మకుటాసురుడు , అతడి దళపతి అయిన కంబళాసురుడు , వీరిని విశ్వేశ్వర అవతారమూర్తిగా స్వామి సంహరించిన అనంతరము , భూలోకమున ధర్మము నాలుగు పాదముల నడచుచుండినది.కొంతకాలము గడచిన పిమ్మట కంబళాసురుని పుత్రుడైన *'పంచముఖాసురుడు'* అనువాడు తమకు కలిగిన దుస్థితి తొలగుటకై బ్రహ్మదేవుని కొరకై తపమాచరించి , వర ఫలితముగా తమ
జాతికి ఔన్నత్యము కలుగజేయనెంచి , తపమాచరించెను. అతడి తపస్సునకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మనగా *“మా రాక్షస కులము అభివృద్ధిలోకి రావలయును. ముల్లోకములు నా యొక్క ఆజ్ఞకు లోబడి యుండవలయును , నేను ధర్మము తప్పి నడుచునపుడు , శ్రీమన్నారాయణుని కుమారుని చేత మాత్రమే నా జీవితము అంతము కావలయును”* అనెను. బ్రహ్మదేవుడు అట్లే
అగుగాక అని వరమునొసగెను.
వరబలము తోడైనందువలన , అతి త్వరలోనే పంచముఖాసురుడు ముల్లోకములను తన
ఆధిపత్యమునకు లోబడియుండునట్లుగా చేసికొనెను. దేవలోకమును సైతము ఆక్రమించిన అనంతరము ,
రాక్షస రాజుగా పట్టాభిషిక్తుడై , ఇంద్ర సింహాసనము నందు అమరియుండి పరిపాలించసాగెను.
అతడు కోరుకున్నట్లుగానే రాక్షసులు మునుపటివలెనే అధికారగర్వము బూని సంతోషముగా
జీవించసాగిరి.
అదే సమయమున భూలోకమున కళింగదేశమును *'విప్రసహాయకుడు'* అను రాక్షస రాజు
పరిపాలించచుండెను. అతడికి కామవర్ధిని , కామవల్లి యను కుమార్తెలుండిరి. పంచముఖాసురుడు
వారిని పరిణయమాడెను. ఆ ఇరువురిలోనూ చిన్నదైన కామవల్లి , అసురకులము నందు
జన్మించినదైననూ , మహాశాస్తా పట్ల మిక్కిలి భక్తి భావము కలదై , తనకు కలుగబోవు సంతానము కూడా స్వామి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసములు కలిగియుండునట్లు చేయమని ఆదినాధుడైన
స్వామిని కోరుకొనసాగెను.
కొంతకాలమునకు పెద్దదైన
కామవర్థినికి
మహాధీరుడు , జటాసురుడు , ఋషిగ్రీవుడు , జ్వాలాకర్ణుడు ,
వజ్రాసురుడు , అను ఐదుగురు పుత్రులు , చిన్నదైన కామవల్లికి విఘ్నహంత్రి , శత్రుహంత్రి అను కవలలు కలిగిరి. పంచముఖాసురుని పుత్రులందరూ వీరులుగా , ధీరులుగా కొనసాగిరి.
పంచముఖాసురుని పెద్ద భార్య కుమారులు ఐదుగురూ దుష్ట స్వభావమూ కలిగి ప్రవర్తించసాగిరి
చిన్న భార్య కుమారులు తల్లి కోరుకున్నట్లుగానే శీలవంతురుగానూ , స్వామి యందు అపారమైన భక్తి
కలిగియూ ఉండిరి.
కుమారులకు యుక్తవయస్సు రాగానే పంచముఖాసురుడు తన పెద్ద కుమారుడైన మహాధీరునకు పట్టముకట్టి రాజ్యమునప్పగించెను.
భూలోకమున జరుపుబడు దేవతార్చనలచే , దేవలోక వాసులకు ఫలితము కలుగజేయుట
గమనించిన , దుష్టస్వభావియైన మహాధీరుడు , దేవాతార్చనలను తక్షణమే నిలిపివేయుమని ఆజ్ఞాపించెను.
యజ్ఞయాగాదులు , దేవతార్చనలు , పూజలు ఆలయ ఉత్సవములన్నియూ నిలిపివేయబడినవి. అధర్మము తలెత్తి , దుఃఖము తాండవించుచుండెను.
ఇట్టి సమయమున , దేవేరు లిరువురితోనూ , పరివారగణములతోనూ శాస్తా కొలువై యుండు
రైవత పర్వత ఛాయలలోని ఒక కాననమునందు , మహాశాస్తా యొక్క పరమభక్తుడైన *'గంగేశ్వరుడు'*
అను విప్రుడు , తన భార్యతోనూ , పుత్రుడైన శివదాసుతోనూ జీవించసాగెను. మహాధీరుని ఆజ్ఞ
ప్రకారము , రాజ్యములో ఎక్కడా దైవపూజలు జరుపకుండుటచే , కాననము నందు అజ్ఞాతవాసము చేయుచూ రహస్యముగా భగవంతుని అర్చించుచుండెను. ఒకనాడు పూజకొరకు పూవులు తీసుకురమ్మని
తన పుత్రుని పంపిన పిమ్మట , పూజకై సమాయుత్తమై యుండు సమయమున , వేట నిమిత్తమై అచ్చటికి వచ్చిన మహాధీరుడు కాననమందు ఒక కుటీరము , అందు పూజాదికార్యక్రమములు
జరుపబడుటయుగాంచెను.
కోపము ఉప్పొంగగా కుటీరమునందు ప్రవేశించిన అతడు *“ద్రోహీ ! నా ఆజ్ఞ నీకు తెలియనిదా ? ఎంత ధైర్యము నీకు నా ఆజ్ఞను మీరి పూజచేయుటకు”* అని గర్జించెను.
బదులుగా విప్రవర్యుడు *“మహారాజా ! మన యొక్క జన్మకు కారకుడైన స్వామిని పూజించుట వలననే భూమి అంతయూ సుభిక్షముగా విలసిల్లును. భగవంతుని పూజించుట ప్రతి మానవుని బాధ్యత. దానిని కట్టడి చేయుట తగదు' అని బదలిచ్చెను.*
*“నాకు నీతులు చెప్పేటంతటి ఘటికుడవా నీవు ? దానికి తగిన ఫలితమును అనుభవించుము”*
అని కోపావేశుడై , ఉచితానుచితములు మరచినవాడై , తన కరవాలముతో విప్రదంపతులను
దునిమివైచెను. పూవులు తెచ్చుటకై వెళ్ళిన బాలుడు తిరిగివచ్చి , తన తల్లిదండ్రులు అతి ఘోరముగా చంపబడి యుండుట చూచి దిగ్ర్భాంతిచెందెను. మరునిమిషం తెప్పరిల్లినవాడై రంకెలు వేయుచూ *“ఈ ఘోరకృత్యమును ఎవరు చేసిననూ మరుక్షణమే వారి తల ఖండింపబడి వేయి చెక్కలగుగాక. ఇది నేను నిత్యమూ పూజించు దుష్టనాశకుడైనటువంటి మహాశాస్తామీద ఆన”* అని ఆక్రోశముగా
శాపమిచ్చెను.
లోకములన్నియూ అంతమొందిననూ అగుగాక , స్వామి మీద చెప్పబడిన ఆన వృధా కానేరదు కదా ! శివదాసుడు శపించిన మరుక్షణమే , తన పరివారగణములతో రధమున ప్రయాణించుచున్న మహాధీరుని తల శాపము ప్రకారము వేయి చెక్కలైనది.
