శ్రీ మహాశాస్తా చరితము - 54 | ఇంద్రుని పత్ని అయిన శచీదేవిని రక్షించిన విధము | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 54 | ఇంద్రుని పత్ని అయిన శచీదేవిని రక్షించిన విధము | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

ఇంద్రుని పత్ని అయిన శచీదేవిని రక్షించిన విధము*

రాక్షసుల నుండి తప్పించుకుని పారిపోయిన దేవేంద్రుడు భూలోకమును చేరి దక్షిణ ప్రాంతమున బ్రహ్మపురంగా పిలువబడు *'సీర్ గాళికి (తమిళనాడుకి చెందినది)* చేరెను. అయిననూ తన అసలు
స్వరూపముతో నడయాడుటకు జంకినవాడై వెదురుకర్ర రూపము ధరించి అజ్ఞాతవాసము చేయసాగెను.
రాక్షసులు ఎవరైననూ వచ్చి వెళ్ళిన అనంతరము తన అసలు రూపునకు మారుచుండెను. తన ఈ
దుస్థితికై దుఃఖించుచూ , తనను కాపాడుమని శివుని కోరుచూ తన భార్యయైన శచీదేవితో
ప్రార్థించసాగెను.

తమ ప్రభువైన ఇంద్రుడు ఈ స్థలమునందు దాగియున్న సంగతి నెరిగిన దేవతలు , తమ
దుస్థితిని ప్రభువైన పరమశివునికి విన్నవించుట కొరకు దేవేంద్రుని సహాయము కోరిరి.

దేవతల కోరిక మేరకు కైలాసమునకు పోవుటకు ఇంద్రుడు సమ్మతించెను. కానీ తనను ఒంటరిగా వదలి పోవలదని ఇంద్రాణి అయిన శచీదేవి పలు విధముల ప్రార్థించెను. ఎటువంటి పని
చేయుటకైననూ తెగించి యున్న రాక్షసుడు తన భార్యను చెరపట్టునని భయపడెను. రాక్షసులను
అణచగల శక్తిగలవాడు స్వామి ఒక్కడేనని భావించెను.

*“దిక్కులేని వారికి దేవుడే దిక్కు ఆ దేవుడు శాస్తా తప్ప వేరు ఎవరు ? శీలవతియైన నీకు ఆ దేవుడే దిక్కు నిన్ను తప్పక కాపాడి తీరును. మనము అతడిని శరణు గోరుదుము. శరణుగోరిన వారిని అతడు కాపాడును. స్వామి ఉండగా మనకు భయమేల ?”* అని పలికెను.

బాలకవేషమున నున్న శాస్తాని స్తుతించి , ఇంద్రాణికి తోడుగా ఉండుమని అర్థించెను.

స్వామి యొక్క ప్రాశస్త్యమును తన భార్యకు తెలుపుచూ , అత్యంత శ్రద్ధా భక్తులతో స్వామిని ధ్యానించెను. శరణాగత వత్సలుడైన శాస్త్రా , భక్తులు స్మరించినంత మాత్రమున వారి ముందు
సాక్షాత్కరించెను.

భూతనాధుడు తన పరివార భూతగణములు సేవించి యుండగా తన పత్నులైన పూర్ణాదేవి ,
పుష్కలదేవి ఇరువైపులా అమరి యుండగా , గజవాహనుడై ప్రత్యక్షమై ఇంద్రునికి అభయము
నొసంగెను. అమరాధిపతియైన ఇంద్రుడు శాస్తా పాదములకు నమస్కరించి *'నీవు తప్ప వేరు గతి లేదు'* అని ప్రార్థించి అభయమునడిగెను. ఇంద్రాణిని కాపాడుమని ప్రార్థించెను. ఎటువంటి
వారినైననూ కాపాడి రక్షించువాడు తోడుగా ఉండగలడను ధైర్యముతో ఇంద్రుడు మొదలగు
దేవతలు పరమశివుని ప్రార్థించుటకై కైలాసమునకేగిరి.

ఇంద్రాణికి అభయమును ప్రసాదించిన శాస్తా , తన భూతగణములలో నొరకైన వీరమహాకాలుని శచీదేవికి కాపలాగా ఉంచి తన నివాస స్థలమైన మహాకాళమునకు వెడలిపోయెను.

కొంతసేపటికి శూరసేనుని సోదరియైన అజముఖి ఎప్పటివలెనే సంచరించుచూ అచటికి
వచ్చెను. ఉద్యానవనముల సౌందర్యమును కొంత సేపు ఆస్వాదించు నిమిత్తమై అచట తిరుగడసాగెను. ఈశ్వర ధ్యానమున నున్న ఇంద్రాణిని చూచిన అజముఖి , ఆమె స్నేహితురాలైన దున్ముఖలకు కడు
సంతోషము కలిగెను. శచీదేవిని ఏమార్చి తన సోదరునికి కానుకగా ఈయవలెనని తలచిరి. తమతో వచ్చి వేయమని బలవంతము చేసిరి. తమ సోదరుని గొప్పదనమును గూర్చి ఎంతగానో పొగడిరి.

శచీదేవి వారితో *“దేవేంద్రుని తప్ప వేరు ఎవరినీ మనస్సున తలవను. నన్ను కాపాడుటకై కొలువై యుండు స్వామి యొక్క గొప్పదనము తెలియక , నన్నుగొని పోవుటకై ప్రయత్నించుచున్నావు. అది అసాధ్యము”* అని తెలియజేసి శాస్తాని కాపాడుమని ప్రార్థించెను.

స్వామి యొక్క గొప్పదనము నెరుగని అజముఖి *“నిన్ను కాపాడువారు లేరు”* అంటూ హేళన గావించెను. ఇంద్రాణి చేయి పట్టి ఈడ్చుకుపోవుచుండగా అభయం , అభయం అంటూ మొర పెట్టుకొనెను.

*“స్వామీ అభయం , దేవప్రభువునకు అభయం*
*చెడ్డవారిని శిక్షించు దేవా అభయం. మా యొక్క దైవమా అభయం , వీరాధి వీరుడవైన స్వామి అభయం. అభయం.”*

ఆమె ఆక్రందన విన్న మరుక్షణమే స్వామిచేత నియమించబడిన మహాకాలుడు ఆమె ముందు సాక్షాత్కరించెను. అతడిని చూచిన అజముఖి *“నీవు ఎవరవు”* అంటూ ప్రశ్నించినది.

*యస్తులోకం ప్రచాస్త్యేనం శ్వేతో పస్య గజోవరః*
*యఃశక్త్యాం పురుషాఖ్యాయాం జాతః చంద్రశిఖామణే*

చంద్రశేఖరుడైన పరమశివునికి , మోహినిగా అవతరించి శివుని చేరిన శ్రీధరునికి జన్మించినవాడు ,
ముల్లోకముల నేలువాడు అయిన మహాశాస్తాని గూర్చి మహాకాలుడు వర్ణించిన దానిని అజముఖి చెవిన పెట్టక అలక్ష్యముగా నుండినది. అతడు చెప్పిన దానిలో శ్వేతగజము వాహనముగా కలవాడు అను మాట మాత్రము చెవినబడినది. గజమునెక్కి వచ్చువాడు ఇంద్రుని యొక్క సేవకుడని ఎంచి ,
తమ బానిసలైన దేవతలు యొక్క సేవకుడే కదా అను నిర్లక్ష్య వైఖరితో తన చేత నున్న శూలమును విసరగా , మహాకాలుడు దాన్ని అడ్డగించి తునాతునకలు చేసెను. అతడి చేష్టలకు కోపగించిన అజముఖి మరియొక శూలమును విసరగా , దాన్ని కూడా మహాకాలుడు ముక్కలు ముక్కలుగా చేసెను. 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow